.
Subramanyam Dogiparthi …… ఓ అనామక గ్రామంలో ఓ సాధారణ క్షురకుడు MLA అయి , ఆ తర్వాత CM అయి , అవినీతికి చిరునామా అయి , జనంలో తిరుగుబాటు తెప్పించి , క్లైమాక్సులో జనానికి తలంటి పోసిన సినిమా 1983 జనవరిలో వచ్చిన ఈ MLA ఏడుకొండలు సినిమా .
1978- 1983 కాలంలో రాష్ట్రంలో పేరుకుపోయిన రాజకీయ అనిశ్చితి , అవినీతి , అప్రజాస్వామ్య స్థితిగతుల మీద తీయబడిన వ్యంగ్య సినిమా . ఎలక్షన్ల ముందే రిలీజ్ చేయాలని రాత్రింబవళ్లు షూటింగ్ చేసారు . కానీ ఎలక్షన్లు ముందుకు తేవడంతో జనవరి ఎన్నికలు అయిపోయిన అయిదారు రోజులకు విడుదలయింది .
Ads
మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమా ఎంత వ్యంగ్య సినిమాయో అంతే వ్యంగ్య సినిమా ఈ MLA ఏడుకొండలు . అబధ్ధపు వాగ్దానాలు , లంచాల కోసం వన్ వే ట్రాఫిక్కులు తీసేయటాలు , గోడ దూకటాలు , హోటల్ రేట్లు మార్చటాలు వంటి అంశాలపై చురకలు , చెణుకులు , కొరడా దెబ్బలు .
గత ఇరవై ఏళ్ళల్లో అభివృద్ధి చెందిన కొత్త కొత్త అవినీతి ఆలోచనలు అప్పటికి ఇంకా రాలేదు . క్లైమాక్సులో ఏడుకొండలు విమర్శించే ఓట్లు అమ్ముకోవటం , ఎలక్షన్లలో ఏరులై పారుతున్న డబ్బులు ఇప్పుడు ఇంకా పెరిగిపోవటం బాధాకరం .
ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా costliest elections state . యంపి అంటే 100- 150 కోట్లు , MLA అంటే 50- 80 కోట్లు , రాజ్యసభ అంటే 150 కోట్లు , మండలి అంటే 25 కోట్లు . ఇవీ మన రేట్లు .
తుగ్లక్ సినిమాలో యం.పిలు అందరూ ఉప ప్రధానులు . ఈ సినిమాలో అధికార పార్టీ MLAలు అందరూ ఉప ముఖ్యమంత్రులు .
ఏదో రోజు ఏదో రాష్ట్రంలో ఈ శుభ పరిణామం చోటు చేసుకున్నా ఆశ్చర్యం ఉండదు . అయిదుగురు ఉప ముఖ్యమంత్రుల దాకా వెళ్ళాం కదా ! ఇంకెంత దూరం !!
దాసరి సినిమా అంటే ఎమోషన్ , డ్రామా ఎక్కువగా ఉంటాయి . ఈ సినిమా కూడా అంతే . పైగా ఆయనే కథానాయకుడు . సినిమా అంతా ఆయన డైలాగులే . ఆయన డైలాగులకు నంది అవార్డు కూడా వచ్చింది . డైలాగులతో బాగా నడిపించాడు . కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . ఏడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . షిఫ్టింగులతో సిల్వర్ జూబిలీ ఆడింది . వంద రోజుల పండగ మద్రాస్ Woodlands హోటల్లో జరిగింది . సినిమా ఆడేది , డబ్బులు వచ్చేవి ఆంధ్రాలో , ఫంక్షన్లు మద్రాసులో . గమ్మత్తుగా ఉండేది ఆరోజుల్లో .
ఈ సినిమాలో దాసరి తర్వాత , ఏమో ముందుగా కూడా చెప్పుకోవచ్చేమో , సుజాత బాగా నటించింది . మంచి పాత్ర . దాసరికి సుజాత అంటే ఇష్టమేమో ! అందంగా కూడా చూపాడు . ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , ప్రభాకరరెడ్డి , వంకాయల , అల్లు రామలింగయ్య , సూర్యకాంతం , బాలాజి , జయమాలిని , బౌనా , ప్రభృతులు నటించారు .
గుమ్మడి పాత్ర పేరు గోపాలకృష్ణయ్య గారు . నిస్వార్ధ నాయకుడు . సంతోషం , గర్వం ఏమిటంటే సినిమాల్లో నిస్వార్ధ నాయకుడి పాత్రకు గోపాలకృష్ణయ్య గారి పేరే పెడుతుంటారు . ప్రతిఘటన సినిమాలో కూడా గోపాలకృష్ణయ్య గారి పేరు ఉంటుంది . స్వార్ధం లేని రాజకీయాలకు ట్రేడ్ మార్క్ వావిలాల గోపాలకృష్ణయ్య గారు .
ఈ సినిమాలో మరో పాత్ర ఎర్ర నారాయణమూర్తిది . ఆయన మీద కూడా దాసరికి ప్రేమే . ఎలాగోలా తన సినిమాలలో పెట్టుకుంటాడు . ఈ సినిమాలో నారాయణమూర్తి వేసిన పాత్రను హిందీలో శతృఘ్న సిన్హా వేసాడు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . సుశీలమ్మ పాడిన ఎంతో బీద వాడు గోవిందుడు పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో ! సుశీలమ్మకు ఈ పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయినిగా అవార్డు కూడా వచ్చింది . శ్రీశ్రీ వ్రాసిన పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ! ఏడవకండేడవకండి వస్తున్నాయొస్తున్నాయ్ జగన్నాధ రధ చక్రాలొస్తున్నాయ్ క్లైమాక్సులో పెట్టబడింది . జయమాలిని పాట , డాన్సూ రెండూ బాగుంటాయి .
హిందీలో రాజేష్ ఖన్నా , షబానా ఆజ్మీ లతో క్రాంతికుమార్ పునర్నిర్మించారు . దాసరే డైరెక్టర్ . సినిమా పేరు ఆజ్ కా MLA రాం అవతార్ . అక్కడా బాగానే ఆడింది . మన తెలుగు సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . చూడండి .
ముఖ్యంగా సుశీలమ్మ పాడిన పాటను అసలు మిస్ కావద్దు . సంగీత ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది . పాటలో సుజాతను కూడా దాసరి చాలా అందంగా చూపుతాడు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article