హేమిటో మన నాయకులు… కొన్నిసార్లు ఏం మాట్లాడతారో తమకే తెలియదు… చిత్రమైన పోరాటాలకు దిగుతుంటారు… జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తిరుమలలోనే మీడియాతో మాట్లాడుతూ… (చంద్రబాబు లడ్డూ స్వచ్ఛత కోసం ప్రాణాలైనా ఇవ్వగలడు గానీ, తిరుమల ఆవరణలో మీడియా గొట్టాల్ని మాత్రం నిషేధించలేడు… ఫాఫం)
‘‘మా సొంత మనుషులు, పార్టీ వాళ్లు అడిగితే తిరుమలలో ఓ రూమ్ ఇప్పించలేం మేం… దర్శనాలకు సిఫారసు లేఖలు ఇవ్వలేం… టీటీడీ వాటిని ఖాతరు చేయదు… మీ వ్యాపారాల కోసం హైదరాబాద్ కావాలా… మేం మాత్రం అక్కరలేదా..? భద్రాచలం, యాదగిరిగుట్టల్లో మిమ్మల్ని, మీ లేఖల్ని, మీ సిఫారసుల్ని అనుమతిస్తున్నాం…
మీరేమో మాకు అస్సలు విలువ ఇవ్వడం లేదు… మీరిలాగే ఉంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, అప్పుడు తెలుస్తుంది మీకు మా కోపమేమిటో… మేమిచ్చే 15 వేల కోట్లు కావాలి గానీ మేం వద్దా..?’’ ఇలా చెప్పుకుంటూ పోయాడు…
Ads
భద్రాచలం, యాదగిరిగుట్టల్లో ఏపీ ఎమ్మెల్యేల సిఫారసుల్ని అనుమతించాలని ఎవరు చెప్పారు..? తీసి బుట్టలో పడేయండి… అవే కాదు, కొండగట్టు, ఆలంపూర్, బాసర, కొమురవెళ్లి సహా ఎక్కడా పట్టించుకోం అని చెప్పేయండి… ఆయా క్షేత్రాలకు వెళ్లే భక్తులకు పెద్ద రిలీఫ్… పోనీ, తిరుమలకు తెలంగాణ సిఫారసులు అనుమతించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏ కఠిన నిర్ణయాలుంటాయి…? హైదరాబాదులో ఏపీ వాళ్ల నివాసాలకు, వ్యాపారాలకు అనుమతించరా..? హైడ్రా బుల్‌డోజర్లు నడిపిస్తారా..?
తిరుమల మీద పెత్తనం ఏపీ ప్రభుత్వానిది… అసలు ప్రభుత్వ జోక్యం ఉండకూదనేది కదా భక్తజనం వాదన… ఈ రాజకీయ నాయకులే కదా తిరుమల దేవుడిని ఎప్పటికప్పుడు భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నది… ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు… తమిళనాడు ప్రజలకు తిరుమల మాదే అంటారు… (తిరు అంటేనే తమిళపదం, శ్రీ అని అర్థం)… కేరళ కూడా సేమ్… కన్నడిగులకూ ప్రియదేవుడే… బాలాజీ అంటూ మహారాష్ట్ర తదితర ఉత్తరాదికీ దేవుడే…
అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గట్రా సిఫారసు లేఖల్ని ఇలాగే పంపించి, మాకు విలువ ఇవ్వరా అని కస్సుమంటే… ఇక తిరుమలలో దర్శనానికి ఆధార్ కార్డు ప్లస్ ఎమ్మెల్యే సిఫారసు లేఖ తప్పనిసరి అవుతుందేమో..? ఏ సిఫారసు లేకపోతే అలిపిరి గేటు కూడా దాటనివ్వరేమో… గట్టిగా అడిగితే అక్కడే గుండు గొరిగి వాపస్ పంపించేస్తారేమో…
ఐనా… తిరుమల యంత్రాంగాన్ని అడిగినట్టే శబరిమల యంత్రాంగాన్ని అడిగి చూడండి… అక్కడికి కూడా మనవాళ్లు లక్షల్లోనే వెళ్తుంటారు కదా… వై ఓన్లీ తిరుమల… కర్నాటకలోని గానుగాపూర్, తమిళనాడులోని మధుర, చిదంబరం, అరుణాచలం గట్రా… సేమ్, షిరిడి… (కాశి, అయోధ్య, ద్వారక, ఛార్ దామ్, వైష్ణో, ఇవే కాదు… అమరనాథ్ కూడా…) ఏం మనం పోవడం లేదా..? వాటి ఆదాయానికి మన తెలుగు పర్సులే శ్రీరామరక్ష…
సో, ఈసారి ఆయా క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఆ డిమాండ్ కూడా గట్టిగా వినిపించండి ఎమ్మెల్యే సాబ్… కాదంటే ఆయా రాష్ట్రాల వాళ్లను హైదరాబాద్ రానివ్వబోమని గట్టిగా చెప్పండి… హమ్మా…!!
Share this Article