.
నిన్న మావోయిస్ట్ పార్టీ కీలక నేత దేవ్ జీ అలియాస్ తిరుపతి ఇంటర్వ్యూ ఒకటి చూడబడ్డాను… వేర్వేరు మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో కావాలని ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, కానీ స్ట్రెయిట్ ప్రశ్నలు అడగబడిన టీవీ9 విజయ్ ఇంటర్వ్యూ చూశాను… ఇంటర్వ్యూ తీరు వోకే… కానీ దేవ్‌జీ అనబడే మావోయిస్టుకు పులుపు చావలేదనీ, గందరగోళపు తన పార్టీ సిద్ధాంతాన్ని మరింత గందరగోళంగా సమాజం మీద రుద్దే ప్రయత్నంలో ఉన్నాడనీ అర్థమైంది…
ముందుగా ఓ అంశం… ‘‘నేను లొంగిపోలేదు, ఆపరేషన్ కగార్ తీవ్రతతో వేర్వేరు చోట్ల రక్షణకు వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు… చంపేస్తారనుకున్నాం, కానీ చంపడం మా విధానం కాదు, లొంగిపొండి అన్నారు… జైలుకే వెళ్దామనుకున్నాం, కానీ జైలుకు వెళ్తే మావోయిస్ట్ పార్టీని సమన్వయం చేయడం కుదరదని భావించి, ఇక బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నాం’’ ఇదీ మాజీ కామ్రేడ్ దేవ్‌జీ అలియాస్ తిరుపతి వ్యాఖ్య…
Ads
ఎస్, నెత్తుటి చుక్క చిందకుండా… బుల్లెట్ ఖర్చు గాకుండా… అందరూ లొంగిపోయే వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం అనే రేవంత్ రెడ్డి విధానంలో భాగంగా… ఎన్‌కౌంటర్ చేయలేదు, సరెండర్ కావాలన్నారు, అంతే తప్ప తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదని కాదు, అందులో బుల్లెట్లు లేవని కాదు… హిడ్మాను బలిగొన్న బుల్లెట్‌కు దేవ్‌జీ ఎంతసేపు..?
రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి…. పోలీసులు పెట్టిన ప్రాణభిక్షతో రావడాన్నే లొంగుబాటు అంటారు మాజీ కామ్రేడ్…! ఇన్నేళ్లు సమాజాన్ని తప్పుదోవ పట్టించిన ఈ అయోమయం, ఆగమాగం భాష, ఆ వివరణలు అక్కర్లేదు… తను లొంగుబాటుకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడు… ఏదో వ్యక్తిగత జీవితానికి పరిమితం కావడానికి తమంతటతామై సరెండర్ అయితే దాన్ని లొంగుబాటు అనాలట… పోలీసులు ప్రాణభిక్ష పెట్టి, పోనీలే అని వదిలేస్తే, అరెస్టు కూడా చూపించకపోతే, జైలుకు పంపించకపోతే… సరే, బహిరంగ జీవితంలోకి వస్తున్నాం అని పోలీసుల ఎదుట తలదించితే… అది లొంగుబాటు కాదట..!! చేతికి చిక్కిన విప్లవకారుడిని ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడి మరీ తెలంగాణ పోలీసులు వాళ్ల లొంగుబాటు చూపించినట్టు బిల్డప్..!!
రాజకీయ జీవితానికి స్వస్తి పలికితే అది లొంగుబాటు అట, తను మాత్రం ఇంకా ఓ రాజకీయ పార్టీగా జనంలో ఉంటాడట కాబట్టి అది లొంగుబాటు కాదట… ఏవో పిచ్చి నిర్వచనాలు, బాష్యాలు… మళ్లీ తనే ఏమంటాడంటే..? ప్రాణాలతో దొరికినా సరే, లొంగుబాటు చూపించిన తెలంగాణ పోలీసులు తమ ‘నో బ్లడ్, నో బుల్లెట్’ మానవీయ పద్దతికి కట్టుబడి వ్యవహరించారు కదా అనడిగితే… తెలంగాణ ప్రజలు అలా బలంగా కోరుకున్నారు కాబట్టి, ఆ దిశలో ప్రజలు ఉద్యమించారు కాబట్టి రేవంత్ రెడ్డి ‘నో ఎన్‌కౌంటర్’ పాలసీకి కట్టుబడ్డాడట… ఏ ప్రజలు ఎక్కడ ఉద్యమించారో…! తెలంగాణ పోలీసులు ప్రదర్శించిన మానవతను అంగీకరించలేకపోవడం, ఇంకేదో బాష్యం చెప్పడం విచిత్రం…
ఇక లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉద్యమిస్తాడట… అది వోకే… కానీ తుపాకులన్నీ అడవుల్లో పెట్టి వచ్చాం, ఇంకా ఇంకా అర్బన్ నక్సల్స్ గట్రా భాషతో వేధిస్తే, అనివార్యంగా అటువైపు మమ్మల్ని నెట్టేయకండి, నిషేధం ఎత్తేయండి, జైళ్లలో ఉన్నవాళ్లను రిలీజ్ చేయండి అని అమిత్ షాకు మెసేజ్ పంపించాడట… అంటే, మేం మారలేదు అని చెబుతున్నాడు… తన తుపాకులు అడవిలో అలాగే ఉంటాయట, పార్టీ అలాగే ఉంటుందట, కానీ నిషేధం ఎత్తేయాలట… అందరినీ విడుదల చేయాలట.., పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా మాత్రం వద్దట…
రాజ్యం తిరుగుబాటును సహించదు, ప్రపంచంలో ఏ సమాజమైనా అంతే… కణతకు తుపాకీ గురిపెట్టబడిన పరిస్థితుల్లో ప్రాణరక్షణకు ‘లొంగిపోయిన’ కేరక్టర్లకు రాజ్యం ఎదుట డిమాండ్లు పెట్టే సీన్ ఎలా ఉంటుంది..? అమిత్ షా ఎందుకు అంగీకరిస్తాడు..? పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తారా మరి అనడిగితే… మాది పార్లమెంటరీయేతర రాజకీయాలు అంటాడు… కాకపోతే సాయుధపంథా మాది, ఇప్పుడు వేరే దిక్కులేదు కాబట్టి లీగల్ ఫ్రేమ్‌వర్క్ ప్రజాసమస్యల పోరాటం అంటున్నాడు…
సరే, నిషేధం ఎత్తేస్తే ఏం చేస్తారని అడిగితే… పీఎల్‌జీఏను రద్దు చేస్తాం అంటున్నాడు… అంటే సాయుధ పంథా వదిలేయడమే కదా, పోరాట విరమణ అనే కదా… మరి అదే చెప్పిన సోను, సతీష్‌లను వర్గద్రోహులుగా ముద్ర వేయడం దేనికి..? సాయుధ పోరాట పరిస్థితులు లేవు, విరమిద్దాం అని సెంట్రల కమిటీ చర్చించింది అని సోను వర్గం చెబితే… నో, నో, ఆ చర్చే జరగలేదు అంటున్నాడు ఈ దేవ్‌జీ… సోను వర్గం శతృవుతో చేతులు కలిపి, తుపాకులు అప్పగించి లొంగిపోయిందట, ఈయనేమో ఇంకా పోరాట పంథాలోనే ఉన్నాడట…
ఓ దేవుడా… నువ్వు చెబుతున్న సోకాల్డ్ ‘‘మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం…’’ ప్రపంచవ్యాప్తంగా ఓ విఫల సిద్ధాంతం… ఆపరేషన్ కగార్ అనే యుద్దాన్ని, దాడిని కూడా ప్రతిఘటించగలిగిన కార్యాచరణ లేటైంది కాబట్టి ఫెయిలయ్యారట… మళ్లీ తనే అంటాడు… చిన్న చిన్న టీమ్స్‌లాగా రిట్రీట్ అయిపోవాలని, ప్రాణాల్ని రక్షించుకోవాలని అనుకున్నారట, ఆ క్రమంలో దొరికిపోయారట… హేమిటో…
8.5 లక్షల మంది సైన్యం, కమాండోలు, ఎయిర్ ఫోర్స్ వాడారు అంటాడు… ప్రత్యేక బలగాల వరకు వోకే, ఆర్మీ రంగంలోకి దిగిందా..? ఎయిర్ ఫోర్స్ దిగిందా..? ఏదో ఒకటి ఆ పడికట్టు పదాల్లో చెప్పేయడం… పక్కాగా మావోయిస్టు ప్రస్థానంలాగే ఉంది ఈ ఆరోపణ కూడా..!! మళ్లీ తనే అంటాడు… నంబాల కేశవరావు, బస్వరాజ్, బీఆర్ ప్రొటెక్షన్ టీమ్‌లో కొందరు డబ్బుకు ఆశపడి, ఇన్‌ఫార్మర్లుగా మారి, గైడ్లుగా వ్యవహరించి పొట్టన పెట్టుకున్నారట…
తను చెప్పినట్టే సోను, సతీష్ ఎట్సెట్రా కేంద్ర కమిటీ సభ్యులే శతృవుతో చేతులు కలిపే పరిస్థితి ఉందంటే… కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రొటెక్షన్ స్క్వాడే దిగజారిపోతే… ఇక కేడర్‌లో నిబద్ధత ఏముంది..? ఎంపికలు అంత దారుణంగా ఉన్నాయా..? వాళ్లకు రాజకీయ శిక్షణ ఏముంది..? కేవలం గన్ పట్టుకుని ప్రొటెక్ట్ చేయడమే పనా..? మరి పార్టీ ఏం కట్టుదిట్టాల్ని, ఏం నైతికతను నేర్పినట్టు..? కేంద్ర కమిటీ సభ్యులే ‘శతృవు’తో చేతులు కలిపే పరిస్థితే నిజమైతే… ఈ వైఫల్యాన్ని సంపూర్ణంగా అంగీకరించి తలదించాలి కదా… విఫల సమర్థనలు దేనికి..?
ఆ ఇంటర్వ్యూ చూశాక ఓ సగటు జర్నలిస్టు మదిలో మెదిలే ప్రశ్నలివి… జవాబులు కరువైన శుష్క వాదనలివి… ఇదుగో ఇందుకే మీ పంథాలోకి కొత్తగా ఎవరూ రావడం లేదు… వెరసి మీ పంథా ఓ సంపూర్ణ వైఫల్యం… అది అంగీకరించలేని వైఫల్యం అదనంగా..!! సారీ, మాజీ కామ్రేడ్… టేక్ రెస్ట్… నువ్వే చెబుతున్నావుగా… రివార్డులు పెంచాలి, అయిదెకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్లు పొరపాటని… నీ ప్రతి మాటా ఆ పొరపాటు పంథాలోనే ఉంది..!!
నువ్వెలాగూ కేంద్ర కమిటీ కార్యదర్శి కాలేదు అంటున్నవ్… అంటే జస్ట్, సీసీ మెంబర్, లొంగిపోయిన నీ వ్యతిరేకవర్గం సోను ఎట్సెట్రా కూడా సేమ్… మరి ఏ హోదాలో పీఎల్‌జీఏను రద్దు చేస్తవ్..? నీ మాటను అడవుల్లో ఇంకా మిగిలిన అరకొర కేడర్ ఎందుకు వింటుంది..? నువ్విప్పుడు మావోయిస్టు పార్టీకి ఏమీ కావు కదా..!!
Share this Article