మొత్తానికి ‘వైసీపీ వ్యతిరేక వోటు చీలనివ్వను’ అని పవన్ కల్యాణ్ పదే పదే చేస్తున్న ప్రకటన ఫలిస్తున్నట్టే ఉంది… తెలంగాణలో బలాన్ని చూపించి, ఏపీలో పొత్తుకు దారులు తెరవాలనే చంద్రబాబు వ్యూహం ఫలిస్తున్నట్టే ఉంది… మళ్లీ ఈ గుదిబండ మెడకు పడుతుందేమో అనే తెలంగాణ బీజేపీ భయసందేహాలు నిజమవుతున్నట్టే ఉంది… దేశంలో అందరికన్నా మోడీని అధికంగా తిట్టిన అదే చంద్రబాబు అదే మోడీని అలుముకునే రోజు వస్తున్నట్టే ఉంది…
ఠాట్, టీడీపీతో పొత్తేమిటి, ఆ ఆలోచనే లేదు, అసలది సాధ్యమే కాదు అని ఖండితంగా ప్రకటనలు చేసిన బీజేపీ ముఖ్యనేతలు మాటమార్చారు… స్వరం మారి, స్నేహగీతం పాడటానికి రెడీ అవుతోంది… పొత్తు పెట్టుకోం అనే మాట నుంచి ఇప్పుడు పెట్టుకోవాలా వద్దా ఆలోచిస్తున్నాం వరకు మాట షిఫ్టయిపోయింది… చిత్రాతివిచిత్రం ఏమిటంటే… చంద్రబాబు పార్టీకి ఆగర్భశత్రువుగా భావించే షర్మిల పార్టీని కూడా కూటమిలో కలుపుకునే యోచన… వారెవ్వా తెలంగాణ రాజకీయం…
Ads
ఎన్నికలు సమీపిస్తున్నాయి… ఇప్పటికిప్పుడు పెద్ద లీడర్లు ఎవరూ వేరే పార్టీల నుంచి వచ్చే సూచనలేమీ లేవు… మహా అయితే అదే కోమటిరెడ్డి, అదే పొంగులేటి… వీళ్లతో రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏమీ సమకూరదు… కొన్ని సీట్లలో కొంతమేరకు బలం పెరుగుతుంది… మహాఅయితే బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్లు దక్కని వాళ్లు ఎవరైనా కీలకమైన తరుణంలో బీజేపీని ఆశ్రయిస్తారేమో… అలాంటి ఆయారాం, గయారాంలతో బీజేపీకి వచ్చే ఫాయిదా కూడా పెద్దగా ఏమీ ఉండదు… మరి తెలంగాణవ్యాప్తంగా 30 సీట్లలో ప్రభావం చూపించగల సెటిలర్స్ వోట్లను ఆకర్షించి, వాటిని బీఆర్ఎస్ ఫోల్డ్ నుంచి కత్తిరించగలిగితే..? ఆ ఆలోచన నుంచి ఉత్పన్నమైందే టీడీపీతో పొత్తు…
ఇది వెల్లడించింది ఎవరో అల్లాటప్పా లీడరేమీ కాదు… బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్… నాన్సెన్స్, టీడీపీతో పొత్తేమిటి, ఛస్, ఉత్త ట్రాష్ అని ఇప్పుడు బండి సంజయ్‌ను అనమనండి… తెలంగాణ పదాన్నే పార్టీ పేరు నుంచి కత్తిరించుకుని, తెలంగాణ అస్థిత్వ ఛాయల్ని వదులుకున్న బీఆర్ఎస్‌కూ, మళ్లీ తెలంగాణలో రాజకీయ పెత్తనం కోరుకునే టీడీపీకి పెద్ద తేడా లేదిప్పుడు… దొందూ దొందే… ఈలెక్కన బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ మూడూ జాతీయ పార్టీలే… ఎంఐఎం, కాంగ్రెస్, బీఎస్పీ కూడా జాతీయ పార్టీలే… షర్మిల పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీ…
బీజేపీకి ఏపీ ముఖ్యం కాదు, అక్కడ వాళ్లకేమీ యాక్టివిటీ లేదు… ఇప్పటికిప్పుడు అక్కడ ఊడబొడిచేదేమీ లేదు… ఏదో ఉండీలేనట్టుంది పార్టీ… కానీ తెలంగాణలో రాజ్యాధికారం కావాలి… ఇప్పుడు గెలవలేకపోతే మళ్లీ గెలవలేం అన్నంత ఊపు మాటల్లో కనిపిస్తోంది… కానీ నిజంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీకి దీటైన అభ్యర్థులున్నారా..? కాషాయ శిబిరమే ధీమాగా చెప్పలేని దురవస్థ… ఈ స్థితిలో టీడీపీని మళ్లీ కౌగిలించుకునే అవసరం బీజేపీకి క్రియేట్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నాడా..? మోడీ, చంద్రబాబు అలుముకునే దృశ్యాల్ని చూడబోతున్నామా..?!
కొసమెరుపు :: ఆఫ్ ది రికార్డ్ అన్నీ చెప్పి, తీరా పైనుంచి అక్షింతలు పడ్డాక, అబ్బే, నేను అలా అనలేదు అంటారు కదా లీడర్స్… ఇదుగో ఇలా అన్నమాట…
Share this Article