హఠాత్తుగా మోడీ మీద జనంలో సానుభూతి పెరిగింది… ఫాఫం, ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని కాదు… చంద్రబాబు మీద, నితిశ్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితిలో ఇరుక్కున్నందుకు..!
మీరు ఎప్పుడొచ్చినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మీకేం కావాలో అడగండి అని ఇండి కూటమి నుంచి ఖాళీ చెక్కు అందిందట… ఇంకేముంది..? అసలే చంద్రబాబు… చక్రాలు తిప్పే అలవాటు… పైగా లోలోపల మోడీ మీద ఎన్నాళ్లుగానో అణుచుకున్న కోపం…
ఎప్పుడు ఎన్డీయే కాడి కింద పడేస్తాడోనని బీజేపీలోనే ఓ భయం… కానీ తను ఢిల్లీ వ్యవహారాల్ని పట్టించుకోకుండా… ఆ చక్రాలు కావు, రాష్ట్రంలో చాలా చక్రాలు ఉద్దరించాల్సినవి ఉన్నాయి… వాటిని చూసుకుంటే బెటర్… పైగా అలవిమాలిన హామీలు ఇచ్చి ఉన్నాడు తను… ఒక్కసారి చదువుతారా..? ఎవరో పంపించారు..?
Ads
ఉమ్మడి ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలు..
1. మెగా డీఎస్సీపై మొదటి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ 4000/- (మొదటి నెల నుండి మాత్రమే కాకుండా గత మూడు నెలలు 1000 రూపాయిలు చెప్పున 7000/-)
3. దివ్యాంగుల పెన్షన్ 6000/-
4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500/-
5. ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. నిరుద్యోగులకు నెలకి 3000/- నిరుద్యోగ భృతి
8. తల్లి వందనం కింద ఎంత మంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కో బిడ్డకి 15000/-
9. ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
10. ప్రతి రైతుకు ఏడాదికి 20000/- పెట్టుబడి
11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000/-
12. ఉచిత ఇసుక
13. అన్న క్యాంటీన్లు
14. భూహక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్
16. బీసీ రక్షణ చట్టం
17. “పూర్ టూ రిచ్” ద్వారా ప్రతి పేదవాడినీ సంపన్నులను చేయడం
18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్
19. కరెంటు చార్జీలు పెంచకూడదు
20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి
21. ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి
22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇల్లు నిర్మాణం చెయ్యాలి
23. పెళ్లి కానుక కింద 1,00,000/-
24. విదేశీ విద్య మళ్ళీ
25. పండుగ కానుకలు మళ్లీ ఇవ్వాలి…
ట్రూ స్పిరిట్‌తో వీటిని అమలు చేయడం అసాధ్యం… పరిమితులు, కత్తిరింపులు మన్నూమశానం మొదలుపెట్టినా సరే వీటి అమలే చంద్రబాబుకు తలకుమించిన పని… లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, డెట్ మేనేజ్‌మెంటే పెద్ద టాస్క్ కాబోతోంది… ఆ బాధ ఏమిటో ఇప్పుడు రేవంత్‌రెడ్డి అనుభవిస్తున్నాడు… కేసీయార్ బాపతు అప్పులతో తలపట్టుకున్నాడు… ఇక జగన్ మరీ ఎక్కువ తెచ్చాడు…
జగన్ ఏమేం అరాచకాలకు పాల్పడ్డాడో మాకూ, మీడియాకు తక్కువే తెలుసు, తవ్వాల్సి ఉంది అంటున్నాడు చంద్రబాబు… తవ్వకాలు సరే, ఫిక్స్ చేస్తారు సరే, కానీ రథం సాఫీగా నడవాలంటే కష్టపడాలి కదా… అదుగో దానికే టైమ్ స్పెండ్ చేస్తే ఏపీకి మేలు… ఈ హామీల్లో ఎక్కడ వెనక్కి తగ్గినా వైసీపీ మళ్లీ అందుకుంటుంది… వేరే ప్రత్యామ్నాయం కూడా దిక్కులేదు కదా…
ఈ సందర్భంగా ఒక వార్త చటుక్కున గుర్తొచ్చింది, వాళ్ల ఆంధ్రజ్యోతిలోనే కనిపించింది… ఎవరో స్టాలిన్‌ను అడిగారట, ఇండియా కూటమికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్ ఉంది కదా, ఇప్పుడు గాకపోయినా రేపయినా అని… దానికి ఆయన నవ్వుతూ ‘నా ఎత్తు నాకు తెలుసు’ అన్నాడు తండ్రి కరుణానిధి స్టయిల్‌లో…
ఇదే ప్రశ్న కేసీయార్‌ను అడిగి ఉంటే… (సరే, తనకు అంత సీన్ లేదు, తెలంగాణలోనే జీరో అయ్యాడు కదా…) వై నాట్, ప్రధాని పదవి వరిస్తే గాయిగత్తర లేపుతా అని బదులిచ్చేవాడు… చంద్రబాబు అయితే ఏదీ స్ట్రెయిట్‌గా ఆన్సర్ చెప్పకుండా… అన్ని సమీకరణాలూ ఆలోచిస్తున్నాం బ్రదర్ అని బదులిచ్చేవాడేమో…
అవునూ, ఈ అలవిమాలిన హామీల అమలు బాధ్యత కూడా మీరూ పంచుకోవాలంటూ చంద్రబాబు మోడీ మెడ మీద ఒత్తిడి కత్తి పెడతాడా..? లేకపోతే వెళ్లిపోతానంటాడా..? ఏమో, చంద్రబాబు మార్క్ హామీల మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది… ఆ తల్నొప్పి నువ్వే భరించు అంటాడా మోడీ… ఇంట్రస్టింగు…!!
Share this Article