ఒక ఫోటో… దేశవ్యాప్తంగా చర్చను రేపుతోంది… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో గణపతి పూజకు ప్రధాని మోడీ హాజరై హారతి ఇస్తున్న ఫోటో… వేరే దేశాల్లో ఇవి పెద్దగా వార్తల్లోకి, చర్చల్లోకి… సందేహాలు, విమర్శల్లోకి రావు… మనం పొలిటికల్ పంకిలంలోనే ఉంటుంటాం కాబట్టి…. హఠాత్తుగా ఇది అభ్యంతకరంగా చిత్రీకరించబడుతోంది… ఎందుకు..?
ఎందుకంటే..? పాల్గొన్నది ప్రధాని కాబట్టి… మోడీ ఏం చేసినా సరే, ఏవో తాటాకులు కట్టాలనే ప్రతిపక్షాలు తహతహలాడుతుంటాయి కాబట్టి… ఎక్కడికో వెళ్లి రాహుల్ గాంధీ ఏవేవో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటే మాత్రం ఒక్కరూ నోరు మెదపరు… తన మీటింగులకు ఖలిస్థానీవాదులు హాజరైనా సరే, ఖలిస్థానీ వేర్పాటువాదులు తన వ్యాఖ్యలకు ప్రశంసల చప్పట్లు కొడుతున్నా సరే… ఇక్కడి రాజకీయాల బురదను ఖండాంతరాల్లోకి తీసుకుపోతున్నా సరే…
Ads
ఇప్పుడు మోడీ, సీజేఐల మీద విమర్శ ఏమిటయ్యా అంటే… ‘‘సాధారణంగా న్యాయమూర్తులు ప్రైవేటు ఫంక్షన్లకు హాజరు కారు… అవాయిడ్ చేస్తారు, అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరించరు, ప్రత్యేకించి రాజకీయ నాయకులను తమ ఫంక్షన్లకు ఆహ్వానించరు… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని వెళ్లడం అనూహ్యం, అసాధారణం… అనవసరం’’ ఇలా సాగుతున్నాయి…
నిజానికి ఇలా కలవకూడదనే ప్రోటోకాల్ ఏమీ లేదు… అందుకే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్తార్ పార్టీలకు హాజరు కాలేదా..? అక్కడే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవలేదా అంటూ బీజేపీ ఆ ఫోటోలతో ఎదురుదాడి స్టార్ట్ చేసింది… సరే, ఉన్నత స్థాయి హోదాల్లో ఉన్న వ్యక్తుల నడుమ మర్యాదపూర్వక సంబంధాలు తప్పు కాదు, నిజానికి అవసరం కూడా..! వ్యవస్థల్ని లీడ్ చేసే వ్యక్తుల మధ్య అనవసర అగాధాలు కూడా అవసరం లేదు… వీటిని పట్టుకుని సాగించే ప్రచారాల్లోనూ హేతువు ఉండదు…
ఎందుకంటే..? ప్రధాని సీజేఐ ఇంటికి వెళ్లగానే ఇద్దరూ మస్తు క్లోజ్ అయిపోయి, ఇక సుప్రీం తీర్పులన్నీ మోడీకి అనుకూలంగా వస్తాయా..? అబ్సర్డ్… చంద్రచూడ్ ఇంటెగ్రిటీ మీద ఎవరికీ ఏ అనుమానాల్లేవు… ఎవరి వృత్తి వాళ్లది, కొన్నిసార్లు వ్యవస్థల నడుమ ఘర్షణ కూడా వస్తుంది… అలాగని వాటిని లీడ్ చేసేవాళ్లు పరస్పరం అనుమాన దృక్కులతోనే వ్యవహరించాల్సిన అవసరం లేదు… ఐతే దీనికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్లూ ఉంటారు… తప్పు లేదు, కానీ సీజేఐ ఇవన్నీ ఆలోచించి ఉండడా..? తను విజ్ఞుడు, తనకన్నీ తెలుసు… మరీ కపిల్ సిబల్ వంటి ఉగ్ర లాయర్లతో చెప్పించుకునే స్థితిలో ఏమీ లేడు… మరీ లిటిగెంట్ కేరక్టర్ సంజయ్ రౌత్ అయితే ఏకంగా సీజేఐ శివసేన బాపతు కేసుల నుంచి తప్పుకోవాలట… మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అడగలేదు సంతోషం…
సరే, ఇవన్నీ పక్కన పెడితే … ఈ విమర్శలన్నీ చదువుతుంటే హఠాత్తుగా 2018 కావచ్చు, ఏపీలో చంద్రబాబు మర్యాదల వార్తలు గుర్తొచ్చాయి… సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఆయన పున్నమి ఘాట్‌లో ప్రత్యేక విందు ఇచ్చాడనేది వార్తల సారాంశం… తనే దగ్గరుంచి మర్యాదలు, స్వాగతాలు, ఏర్పాట్లు, ఆహారం, కల్చరల్ ప్రోగ్రామ్స్ వంటివన్నీ చూసుకున్నాడు… ఘనంగా సన్మానించాడు…
ఆ ఫోటోలు బయటికి రాకుండా సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు కూడా ముందే తీసేసుకున్నారట… మరి ఈ సోకాల్డ్ విమర్శకుల్లో ఒక్కరూ దీని గురించి మాట్లాడలేదేం..? పైగా ఇప్పుడేమో మోడీ చర్య వల్ల, సీజేఐ వల్ల సుప్రీంకోర్టు స్వతంత్రతే దెబ్బతినిపోయినట్టు గావుకేకలు… లిఖిత నిషేధం కాదు గానీ, సరైన ఆనవాయితీ కాదు అంటున్నారు… పర్లేదు, ఈ ‘మర్యాద’లతో మన సుప్రీంకోర్టు ఎవరి ఎదుటా సాగిలబడదు..!! ఇంకా నయం, ఒక సెక్యులర్ దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గణపతి పూజ చేయడం ఏమిటని కొత్త గాయిగత్తర స్టార్ట్ చేయలేదు..!!
Share this Article