.
ఓ పెళ్లి ఊరేగింపు… పదిమంది డాన్స్ చేస్తున్నారు… పోలీసులు వచ్చి వరుడితోపాటు ఆ పదిమందినీ తీసుకెళ్లి జైలులో వేశారు… చట్టప్రకారం సాధ్యమేనా..? కోర్టులో పోలీసులు ఈ చర్యను సమర్థించుకోగలరా..?
అవును, మొన్నమొన్నటివరకూ సాధ్యమే… చట్టప్రకారమే… నిన్న ఢిల్లీలో జరిగిన NXT Conclave సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఒకటీరెండు ఇలాంటి ఉదాహరణలు ఇంట్రస్టింగు… మనం స్వాతంత్ర్యం పొందాక ఓ ముఖ్యమైన పనిని విస్మరించాం…
Ads
కాలం చెల్లినవి, వర్తమాన కాలానికి వర్తించనివి బోలెడు బ్రిటిష్ చట్టాల్ని మార్చుకోలేకపోయాం, రద్దు చేయలేకపోయాం… అలాంటి వాటిల్లో ఒకటి The Dramatic Performance Act… ఎప్పుడో 150 ఏళ్ల క్రితంనాటి చట్టం అది… స్వతంత్రం వచ్చాక 75 ఏళ్లలోనూ దాన్ని రద్దు చేయలేకపోయాం… అప్పుడెందుకు ఈ చట్టం తీసుకొచ్చారో కూడా తెలియదు…
అలాంటిదే మరో ఉదాహరణ… వెదురును నరికితే కేసులు పెట్టాలనే చట్టం… ఎందుకంటే వలస పాలకులు వెదురు చెట్టు కాదని గుర్తించకపోవడం… చెట్టు నరికితే కేసు సరే, కానీ వెదురు చాలామంది గిరిజనులకు ఓ పంట… అదే వాళ్లకు జీవనోపాధి…
ఇదుగో ఇలాంటి 1500 బ్రిటిష్ కాలంనాటి పాత, నిరర్థక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది… సీఆర్పీసీ, ఐపీసీల స్థానంలో కొత్త నేరచట్టాల్ని తీసుకొచ్చారు కదా… దానికి ముందు సుదీర్ఘ కసరత్తుతో అదుగో పైన చెప్పిన చట్టాల వంటివి వందలుగా రద్దు చేశారు… మోడీ హయాంలో జరిగిన కొన్ని ఉపయుక్త పనుల్లో ఇదొకటి…
అప్పుడప్పుడూ ఒకటీరెండు చెత్తా చట్టాల గురించిన వార్తలు వచ్చినా సరే… మీడియా పెద్దగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు… అంతెందుకు కొత్త నేరచట్టాలపైనా పెద్దగా సమగ్ర సమీక్షలు లేవు… వీటిపైనే మోడీ కాస్త వ్యంగ్యాన్ని దట్టిస్తూ…
‘ఇలాంటి చట్టం ఒక్కటి తీసుకొచ్చినా సరే, కాలబెట్టేవాళ్లు, నా జుత్తు పీకేసేవారు… ఐనా అలాంటి చట్టాల రద్దు మీద ఈ సోకాల్డ్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అస్సలు మాట్లాడదు, గుర్తించదు, స్పందించదు’ అన్నాడు… దాంట్లో రాజకీయం చేయడానికి ఏమీలేదు గనుక… పిల్స్ టేకేదార్లు అందుకే మాట్లాడలేదు…
ఇదంతా సరే, ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటే ఏమిటి..? ఢిల్లీలోని ఓ ప్రాంతం ఖాన్ మార్కెట్… పష్తూన్ లీడర్ గఫార్ ఖాన్ సోదరుడు జబ్బర్ ఖాన్ పేరుతో ఏర్పడింది… నిజానికి ఒకప్పుడు అదంతా రెఫ్యూజీల ఏరియా… కింద షాపులు, పైన నివాసాలు… కానీ మంచి కమర్షియల్ వాల్యూ ఉన్న ఏరియా కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగి అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది…
ఖరీదైన రెస్టారెంట్లు, షాపులు, విలాస వస్తువులు… ఉన్నత, ధనికవర్గం అడ్డా… అప్పుడప్పుడూ అరుణ్ జైట్లీ సరదాగా ఈ పదాన్ని వాడేవాడట… పార్లమెంట్ లంచ్ బ్రేక్ అనగానే కొందరు ధనిక వర్గ నేతలు అక్కడ తేలేవారట… అంటే వినోదం, విలాసం, వైభోగం నాన్ సీరియస్ ఎలైట్ గ్రూపు అని వెక్కిరించడానికి ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అనేవాడు…
మిలింద్ దేవర, జితిన్ ప్రసాద్, మన్వీందర్ సింగ్, సుప్రియా సూలే తదితరులు మొదట్లో అలా తరచూ కనిపించేవారట… తరువాత సూలే ఆ గ్రూపు నుంచి వెళ్లిపోయినా కనిమొళి, కవిత వంటి నాయకులు కనిపించేవారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏదో కథనంలో రాసుకొచ్చింది… రాహుల్ గాంధీ కూడా వెళ్తాడట అప్పుడప్పుడూ… ఇప్పుడు మోడీ కూడా అదే పదం కాస్త వెక్కిరింపు ధోరణిలో ప్రస్తావించాడన్నమాట…
Share this Article