నిన్న తెలంగాణలో ప్రచారానికి వచ్చిన పెద్ద సారు మోడీ రిజర్వేషన్ల మీద, రాజ్యాంగం మీద క్లారిటీ ఇచ్చాడు సరే.., కానీ కాంగ్రెస్‌ను ప్రధానంగా టార్గెట్ చేసిన ఆయన బీఆర్ఎస్ మీద పెద్దగా దాడి చేసినట్టు అనిపించలేదు… అఫ్‌కోర్స్, ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంది కాబట్టి రాజకీయంగా అదే కరెక్టేమో… కానీ కేంద్ర పాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని, రెండో దేశరాజధాని, గోదావరి నీళ్లు ఎత్తుకుపోవడం వంటి విషయాలను ఇగ్నోర్ చేశాడు, స్క్రిప్టు రాసిచ్చినవాళ్లే వద్దనుకున్నారేమో…
కెసిఆర్ ను ఇండి కూటమిలోకి రానిచ్చే ప్రసక్తి లేదని, ఆ ఇంటి కాకి ఇక్కడ వాలినా కాల్చేస్తామని కనీసం రేవంత్ చెప్పాడు… మోడీకి ఎందుకు ఈ ప్రకటన చేతకాలేదు..? BRS, BJP ఇప్పటికీ ఒకటే అనే కాంగ్రెస్ విమర్శకు మోడీ బదులు ఇవ్వలేదు…
ఆర్ఆర్ ట్యాక్స్‌తో డబ్బు మూటలు పోగేసి ఢిల్లీకి తరలిస్తున్నారని ఓ ఆరోపణ చేశాడు… ఏ రాష్ట్రంలోని ప్రభుత్వమైనా హైకమాండ్‌కు డబ్బు పంపించాల్సిందే, ఎన్నికల ఖర్చుకు ఆదుకోవాల్సిందే… కానీ కొత్త ప్రాజెక్టులు ఏమొచ్చాయి..? అప్పుడే వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి..? సరే, అదంతా వదిలేస్తే, మొన్న న్యూస్18 ఇంటర్వ్యూలోని ఒకటీరెండు అంశాలు మాత్రం బాగున్నాయి…
Ads
అవి నిజంగా జరిగాయో లేదో తెలియదు, మోడీ నిజంగానే అలా స్పందించాడో లేదో తెలియదు… కానీ జరిగి ఉంటే గుడ్… జరగకపోయినా అలా చెప్పుకుని ఉన్నా గుడ్డే, ఎందుకంటే కీలకస్థానాల్లో ఉన్న ప్రముఖుల నుంచి కనీసం కొన్ని పాజిటివ్ నేచర్ వ్యాఖ్యలు రాజకీయాలకు మంచిది…
గతంలో వాజపేయిని ఏదో దేశం పని మీదే పంపించిన రాజీవ్ గాంధీ పనిలోపనిగా ఆరోగ్య పరీక్షలు, ఆపరేషన్లు చేయించుకొమ్మన్నట్టు అప్పట్లో కొన్ని వార్తలు చదివాం… మాజీ ప్రధానులు వాజపేయి పీవీనరసింహారావుల నడుమ కూడా సత్సంబంధాలే ఉన్నాయి… సరే, ఇప్పుడు మోడీ ఏం చెప్పాడంటే..?
ఆమధ్య బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా కర్నాటక ప్రచారానికి వెళ్లినప్పుడు ఓ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బిడ్డ ఫయాజ్ అనేవాడి చేతిలో హత్యకు గురైంది… వెంటనే నడ్డా అక్కడికి వెళ్లాడు… దీనిపై ఏదో ప్రశ్నకు బదులిస్తూ… ‘‘సమర్థనీయమే, దీనివల్ల ఎన్నికల ప్రధానాంశాలు ఏమీ డైవర్ట్ కావు, ఇక్కడ మానవీయ కోణమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు మోడీ…
ఇదే సమయంలో… తాను గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా సాయం చేయడానికి సిద్ధపడ్డ సందర్భాలను చెప్పాడు… ‘‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాషయింది… నేను అది వినగానే ఎయిర్ అంబులెన్స్ పంపిస్తానని చెప్పాను, కానీ అహ్మద్ పటేల్ వారించాడు… అంత ఎమర్జెన్సీ ఏమీ లేదు, మేం బాగానే ఉన్నామన్నాడు తను… అలాగే ఒకసారి ఎన్నికల ప్రచారానికి ఆమె వారణాసి వెళ్లింది…
ఆమె అక్కడ అస్వస్థతకు గురైంది… మా పార్టీ వాళ్లను పంపించాను ఆమె దగ్గరికి… అక్కడా అవసరమైతే వేరే ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తాననీ చెప్పాను… మనం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి ఇలాంటి సందర్భాల్లో..’’ అని వివరించాడు… గుడ్… వర్తమాన రాజకీయాల్లో ద్వేషం, అబద్ధం, కుట్ర, మోసం, శతృత్వం, పగ ప్రబలుతున్నవేళ ఈ మాటలు బాగున్నాయి… ముందే చెప్పినట్టు అవి నిజాలైనా సరే, అబద్ధాలైనా సరే..!!
Share this Article