అయోధ్యలో రాముడి గుడి కట్టాం… ఆర్టికల్ 370 ఎత్తేశాం… ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం… పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాం… సర్జికల్ స్ట్రయిక్స్ చేశాం… నిజానికి పోలింగ్ హీట్ పెరిగేకొద్దీ బీజేపీ నాయకుల నుంచి ఈ మాటలు పెద్దగా వినిపించలేదు, వినిపించడం లేదు… కొత్త కొత్త ఎజెండా వైపు ప్రచారం మళ్లిపోయింది…
ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు వంటి అంశాలవైపు బీజేపీని కార్నర్ చేయడం మొదలుపెట్టిందో బీజేపీకి తన విజయాల ప్రచారంకన్నా వీటికి వివరణలు ఇవ్వడమే సరిపోతోంది… ఎంతసేపూ పాకిస్థాన్, చైనాల కోణంలో ఆలోచనలు తప్ప సగటు మనిషి కోణంలో పాలన సాగని వైనం కదా, అవేమీ చెప్పుకోలేదు… ప్రత్యేకించి ధరలు సగటు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి…
ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరు బుర్రల్లో చటాక్ కూడా లేకుండా బీజేపీకి ఉల్టా దాడి చేసే అవకాశాన్నిస్తున్నారు… ఎస్, మోడీ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు థాంక్స్ చెప్పాలి… ఒకడేమో సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్లు, ఈశాన్యంలో చైనీయులు, పశ్చిమాన అరబ్బులు, ఉత్తరాన ఆంగ్లేయులు అన్నట్టుగా ఏదో కూశాడు… దాంతో బీజేపీ పరివారానికి కొన్నిరోజులు ప్రచార గ్రాసం లభించింది…
Ads
దొరికింది చాన్స్ అనుకుని మోడీ కూడా స్పందించాడు… తరువాత అధీర్ రంజన్ చౌదరి కూడా ఏదో కూశాడు… అంకుల్ శామ్ పిట్రోడా మాటల్ని సమర్థిస్తూనే మన దేశంలో నీగ్రోలు కూడా ఉన్నారుగా అని ఇంకాస్త పెట్రోల్ పోశాడు… నేనూ ఉన్నానోచ్ అని మణిశంకర్ అయ్యర్ తాజాగా రంగంలోకి వచ్చి…
‘‘పాకిస్థాన్ గౌరవనీయ దేశం, అణుబాంబులున్నాయి… మనం మంచిగా ఉండాలి, మనం లాహోర్‌లో అణుబాంబు వేస్తే ఆ రేడియేషన్ మన అమృత్‌సర్‌కు వ్యాపిస్తుంది’’ అని ఏదో కూశాడు… అంతకుముందు ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఇదే మాట్లాడుతూ పాకిస్థాన్ వాళ్లేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు అన్నాడు… ఇంకేముంది..? మోడీకి ఇంకో చాన్స్ దొరికింది…
‘‘వీళ్లు టెర్రరిస్టులకు సపోర్ట్, పాకిస్థాన్‌కు మద్దతుదార్లు… ఏం..? వాళ్లు చేతులకు గాజులు వేసుకునేలా చేస్తాం మనం.,, ఆ దేశంలో పిండి లేదు, పవర్ లేదు, చివరకు గాజులు కూడా లేవు’’ అని కౌంటర్ స్టార్ట్ చేశాడు… ఈలోపు ఇంకెవరో తెర మీదకు వచ్చి (మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే) మతపెద్దలు అందరూ అయోధ్యలో తప్పు జరిగింది అంటున్నారు కదా, మా ప్రభుత్వం రాగానే అయోధ్య గుడిని ప్రక్షాళన చేస్తాం అని మొదలుపెట్టాడు…
వెంటనే అస్సోం సీఎం అందుకున్నాడు… ఎవరితో ప్రక్షాళన..? సోనియాగాంధీతోనా..? ఆమె ఏ మతమో గుర్తుందా..? అంటూ స్టార్ట్ చేశాడు… రామసేతు వివాద సమయంలో రాముడు మిథ్య అని యూపీయే ప్రభుత్వం ఖండితంగా ప్రకటించింది… అయోధ్యకూ అడ్డుపడింది… ఇప్పుడిక ప్రక్షాళన చేస్తారట అని మరికొందరూ అందుకున్నారు…
మోడీ కూడా స్పందించి… ఇండి కూటమికి వోటేస్తే, అధికారమిస్తే అయోధ్య గుడికి బాబ్రీ తాళం వేస్తారు జాగ్రత్త అని ఎదురుదాడికి దిగాడు… ఎన్నికల వేళ ఒక్కో మాట జాగ్రత్తగా మాట్లాడాలి… అవి ప్రత్యర్థులను ఇరకాటంలో పడేయాలి… నిజంగానే రిజర్వేషన్లు, రాజ్యాంగం వంటి అంశాలతో కాంగ్రెస్ మొదట్లో పర్‌ఫెక్ట్ క్యాంపెయిన్ స్ట్రాటజీని స్టార్ట్ చేస్తే, కొందరు నాయకులు మాత్రం ఆ టెంపోను చెడగొట్టేస్తున్నారు..!
ప్రజలందరినీ ఎక్స్‌రే తీసి, సంపదను పునఃపంపిణీ చేస్తామనే కాంగ్రెస్ వ్యాఖ్యలు కూడా కౌంటర్ ప్రాడక్ట్ అయ్యాయి… వీళ్లు మన పుస్తెల్ని కూడా దక్కనివ్వరు అని స్టార్ట్ చేశాడు మోడీ…! ఇలా మోడీకి ప్రచారాంశాలను కాంగ్రెస్ పార్టీయే అందిస్తోంది..!!
Share this Article