ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు పెట్టాలని ప్రయత్నిస్తే… మేం మారతాం, మారిపోతాం, స్వీయనియంత్రణ పాటిస్తాం అంటూ చిలక పలుకులు పలుకుతాయి మీడియా చానెళ్లు, పత్రికలు… నెవ్వర్, మరింత దిగజారిపోతాయి తప్ప అవి మారవు… ప్రభుత్వం ఒకసారి కొరడా పట్టుకునే చాన్స్ ఇస్తే తాట లేచిపోవడమేనని వాటికీ తెలుసు… అందుకే స్వీయనియంత్రణ పేరిట దాక్కుంటున్నాయి… రాజకీయ లక్ష్యాలున్న పిచ్చి వార్తలు, కథనాల సంగతి ఎలా ఉన్నా సరే, నిత్య మానవజీవితానికి సంబంధించిన వార్తల ప్రచురణ, ప్రసారంలో కూడా మీడియా అనైతిక పద్ధతులకు వెళ్తోంది… ఆ ప్రభుత్వంతోనే చెప్పించుకుంనే స్థాయికి దిగజారిపోతోంది…
కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా భయం గొలిపే వీడియోలు, రక్తపు మడుగులో ప్రమాద దృశ్యాలు, అవయవాలు తెగిపడిన క్షతగాత్రులు, మృతదేహాలను యధాతథంగా చూపించవద్దని సూచించింది… నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన దృశ్యాల ప్రసారంలో ప్రోగ్రామ్ కోడ్ పాటించాలని చెప్పింది… రిషబ్ పంత్ ప్రమాదదృశ్యాలను మీడియా చూపించిన తీరు మీద జనంలో కూడా వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే… కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ సూచనల్ని జారీ చేసింది… ఇలా కొన్నిసార్లు ప్రభుత్వం సూచనలు జారీ చేసే పరిస్థితులు క్రియేటైతే ఇక వీటినే సాకుగా చూపి, కేంద్రం కొరడాను పట్టుకునే అవకాశం ఉంది…
టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలపై దాడులు, వృద్ధులపై అఘాయిత్యాలకు సంబంధించిన వార్తల ప్రసార సమయంలో కనీసం పిక్చర్స్ బ్లర్ కూడా చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపిస్తోంది… అది నిజం కూడా… వీక్షకులను, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, వృద్ధులను ఇవి కలవరపాటుకు గురిచేస్తాయి… నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఈ కోడ్ అమల్లో ఉన్నట్టే… పత్రికల్లో గానీ, మీడియా ప్రసారాల్లో గానీ భీతావహమైన సీన్లను ప్రసారం చేయడం, పబ్లిష్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నదే… ప్రత్యేకించి రక్తం, అవయవాలు కనిపించేలా ఫోటోలు ఉన్నా సరే బ్లర్ చేయాలి…
Ads
తెలుగులో మీడియా వీటికి అతీతం ఏమీ కాదు… మరీ ప్రత్యేకించి టీవీ9 వంటి చానెళ్ల అత్యుత్సాహంపై ఇప్పటికే ప్రేక్షకుల నుంచి బొచ్చెడు కంప్లయింట్లు… దీనికి తగినట్టే అది ఫస్ట్ ప్లేసు కోల్పోయి, రెండో ప్లేసుకు చేరుకుంది… ఐనాసరే, ప్రమాదాలు, నేరాలు, ఆత్మహత్యలు, హత్యల సందర్భాల్లో సీన్ రీక్రియేషన్ పేరిట, డిఫరెంట్ ప్రజెంటేషన్ పేరిట తిక్క తిక్క ప్రయోగాలు చేస్తోంది… ఈమధ్య రెండు రోజులు చావుబతుకుల్లో ఏదో కొండ గుహల్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి మూతి మీద గొట్టం పెట్టి రిపోర్టర్ ప్రశ్నలు అడిగిన తీరు తాజా ఉదాహరణ…
మిగతా చానెళ్లు శుద్ధపూసలని కాదు… ఒక టీవీ5, ఒక ఏబీఎన్, ఒక సాక్షి తమ రాజకీయ అవసరాల కోసం పిచ్చి పిచ్చి వాదనలతో ప్రేక్షకుల మనస్సులను పొల్యూట్ చేయడం వేరు… ప్రేక్షకులు టీవీల్లో వచ్చే రాజకీయ డిబేట్లు, వార్తలు, కథనాలను నమ్మడం ఎప్పుడో మానేశారు… కానీ నేర వార్తల ప్రసారంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనే సోయి లేదు, ఈరోజుకూ వాటికి ఓ రీతి లేదు, రివాజు లేదు..!!
Share this Article