దేశం నలుమూలల నుంచీ వ్యతిరేకత పెల్లుబుకుతున్నా సరే… మోడీ నుంచి వీసమెత్తు స్పందన లేదు… వేక్సిన్ ధరలపై ఆయా తయారీ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా ధరల్ని ప్రకటిస్తున్నా సరే, మోడీ సర్కారు కిక్కుమనలేకపోతోంది… దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తోంది… ధరలపై నా నిర్ణయం ఇదీ అని ప్రకటించలేక, అడ్డగోలు ధరల్ని ప్రకటించిన కంపెనీలను ఏమీ అనలేక… బాబ్బాబు, కాస్త ధరలు తగ్గించుకో బ్రదర్ అని సుల్తాన్ బజార్ బేరాలకు దిగింది… ‘అందరూ తిడుతున్నారు, మీరే కాస్త దయచూపి ఎంతోకొంత ధరల్ని తగ్గించండి బ్రో, లేకపోతే ఇజ్జత్ పోయేటట్టుంది’ అన్నట్టుగా బతిమిలాడుతోంది… ఇదీ మన కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు..? మంచినీళ్ల సీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్న కోవాగ్జిన్ ఇప్పుడు ఏకంగా 1200 రూపాయల ధరను పెట్టిందంటే, తనే సొంతంగా ధరల్ని ప్రకటించేస్తున్నదీ అంటే… దానికి అలుసు ఎవరు..? ఇంకెవరు..? మోడీ ప్రభుత్వ విధానమే…
‘‘మాకు 150 రూపాయలకు ఇవ్వు, మిగతా సగం నీ ఇష్టం’’ అనేసింది కేంద్రం… ఇప్పుడు ఈ ధరల విధానంపై ఎల్లెడలా విమర్శలు రావడంతో… కేబినెట్ సెక్రెటరీకి ఈ ధరల తగ్గింపు సంప్రదింపుల బాధ్యతను అప్పగించింది… రాజీవ్ గబ్బా ఓ సమీక్ష సమావేశం పెట్టేసి, సోమవారం వేక్సిన్ కంపెనీలకు ధరలు తగ్గించాల్సిందిగా ఓ విజ్ఞప్తి చేశాడు… ఎంతోకొంత తగ్గిస్తాయనే ఆశాభావం ఉందన్నట్టుగా ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి… ఒకరోజు గడిచినా సరే కంపెనీలు కిమ్మనలేదు… సీరం కంపెనీవాడు అస్ట్రాజెనికా వాడికి రాయల్టీ చెల్లించాలి కాబట్టి కాస్త ఎక్కువ ధర అనుకుందాం… (నిజానికి ప్రైవేటు హాస్పిటల్స్‌కు అది 600కే ఆఫర్ చేస్తోంది… మరీ భారత్ బయోటెక్ వాడు 1200 పెట్టేశాడు…) మరి భారత్ బయోటెక్‌కు ఆ ఖర్చు కూడా లేదు కదా… మన ఐసీఎంఆర్ (Indian Council of Medical Research), మన ఎన్ఐవీ (National Institute of Virology) భాగస్వామ్యం కూడా ఈ వేక్సిన్ తయారీలో ఉంది… మరి అది తనంతట తను వేక్సిన్ ధరల్ని ఎలా ఖరారు చేసుకుంటోంది..?
Ads
ఇప్పుడు స్పుత్నిక్-5 వేక్సిన్ కూడా వస్తోంది… దాని ధరను అదే ప్రకటిస్తుంది… మే ఒకటి నుంచి సరుకు వస్తుంది అని చెబుతున్నదే తప్ప ఈ రష్యా కంపెనీ మరే వివరాలూ చెప్పడం లేదు… డాక్టర్ రెడ్డీస్ కూడా నోరు విప్పడం లేదు… మరిక ప్రభుత్వం దేనికి అంటారా..? మాకయితే 150కు ఇస్తే సరి, మిగతా ధర వాటి ఇష్టం అనే పాలసీయే అబ్సర్డ్… రాష్ట్రాలు వేరు, కేంద్రం వేరు అనే పాలసీ మరింత అబ్సర్డ్… ఈ మొత్తం వ్యవహారంలో NPPA (National Pharma Pricing Authority) పేరే ఎక్కడా వినిపించడం లేదు… ఇది కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోకి వస్తుంది… దీనికి మంత్రి సదానంద గౌడ… తన పేరెక్కడా తెర మీద కనిపించదు… ఇదేమిటి..? ఫార్మాకూ ఎరువులకూ లింకేమిటి అంటారా..? వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి రావాలి అంటారా..? ఆ మంత్రి హర్షవర్ధన్… తన పేరూ ఎక్కడా వినిపించదు… ICMR, NIV కూడా ఈ మంత్రిత్వ శాఖ పరిధే… కానీ ఆయనకూ పాపం, ఈ వేక్సిన్ ధరలకూ సంబంధమే లేదు… అంతా మోడీయే… ఆయన ఆఫీసే… హేమిటో… !!
Share this Article