మోడీ బాటలో ప్రతిపక్షాలు… ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని…చదువుకుని…భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో “భిన్నత్వంలో ఏకత్వం” అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని…అదొక ఉప ఖండమని డి ఎం కె నాస్తిక రాజా తేల్చిపారేశాడు. ఒక దేశమంటే ఒకే భాష ఉండాలట. ఒకే సంస్కృతి ఉండాలట. ఆయన లెక్క ప్రకారం బహుశా ప్రస్తుత దేశం 29 ఉప ఖండాలయి ఉండాలి. ఇందులో భాషాభేదాలకు తోడు మాండలిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఊపోప, ఉప ఊపోప ఖండ ఖండాలు కూడా ఉండి ఉంటాయి.
“పెళ్లి చేయమంటే కష్టం కానీ…చెడగొట్టమంటే చిటికెలో పని కదా?”
అని మాయాబజార్లో మాటల మాంత్రికుడు పింగళి వాక్కు. అలా ఈ దేశాన్ని పట్టి ఉంచే పవిత్ర కార్యం కష్టం కానీ…ముక్కలుగా విడగొట్టడానికి సందుకొక రాజాలు.
సరిగ్గా బీ జె పి మోడీ ఏమి కోరుకుంటారో ఆయన ప్రత్యర్థులు అదే చేస్తూ ఉంటారు. ప్రస్తుత వాతావరణంలో రాజాల ఉప ఖండాల వింత వాదనలు తమిళనాడులో పని చేసినా…చేయకున్నా…దేశమంతా ఆ చర్చ జరుగుతుంది. దేశం అస్తిత్వాన్నే ప్రశ్నించే కూటమిలో మోడీ ప్రత్యర్థులందరూ నిలుచుని ఉంటారు. దేశాన్ని కాపాడే రక్షకుడిగా మోడీ బరిలో ఒక్కడే నిలుచుని ఉంటారు. అప్పుడు దేశభక్తులందరూ ఆటోమేటిగ్గా మోడీ వైపే నిలుచోవాల్సి వస్తుంది. రోగి కోరింది…వైద్యుడు చెప్పింది ఒకటే కావడమంటే ఇదే!
Ads
ఎప్పటికయినా ప్రధాని కావాలని కీలకమైన ఎన్నికల వేళ ఢిల్లీని వదిలి దేశం పట్టుకుని రోడ్ల మీద తిరిగే రాహుల్ ను చూడండి. “జై శ్రీరామ్- జై శ్రీరామ్” అని మీ చేత అనిపిస్తూ మోడీ మిమ్మల్ని ఆకలితో చంపేస్తున్నాడు అని యువత మీద ఎక్కడో విసుక్కున్నారు. యువత మీద ఆయన శ్రద్ధ నిజమైనదే కావచ్చు. సోషల్ మీడియా విష బీజాల రోజుల్లో భారతీయులు/హిందువులు జై శ్రీరామ్ అనకూడదు అని రాహుల్ అన్నట్లుగా మరుక్షణం దేశమంతా అగ్గి అంటుకుంటుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఇతర పాలనా కొలమానాలు, వైఫల్యాలన్నీ పక్కకు పోయి… జై శ్రీరామ్ అనాలా? వద్దా? అన్న ఒక్క చర్చతో ఆసేతు హిమాచలం ఊగిపోతుంది. బి జె పి రొట్టె విరిగి అయోధ్య నేతిలో పడుతుంది. తరువాత అదే నేతిలో నానిన రొట్టె బాగా ఉబ్బి ఓట్ల పెట్టెలో కూడా పడుతుంది. అయోధ్య మీదుగా ఎర్రకోటకు మూడోసారి కూడా ఎర్రతివాచీ పరచుకుంటూ ఉంటుంది.
తల్లి చనిపోతే గుండు గీక్కొలేదు కాబట్టి మోడీ హిందూ కాదు, కుటుంబం లేనోడికి వారసత్వ కష్టాలు ఏం తెలుసు? అన్నాడు లాలూ. కత్తి నూరి ప్రతిపక్షాలను ఖండ ఖండాలుగా నరకమని లాలూనే మోడీకి మంచి ఆయుధం అందించాడు. సందు లేనిచోటే సందుచేసుకుని వెళ్లే మోడీ ఊరుకుంటాడా? వెంటనే అందిపుచ్చుకుని లాలూ “ఏకాకి” విమర్శను అందిపుచ్చుకుని “పరివార్ వాద్” (కుటుంబపాలన) అవినీతిని త్రీడీలో దేశానికి చూపిస్తున్నాడు. “భారతదేశమంతా నా కుటుంబం” అన్నాడు మోడీ. అంతే. ప్రతిపక్షాల మోహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. మేమంతా మోడీ పరివారమని కేంద్రమంత్రులు, బి జె పి పెద్దలు సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టుకున్నారు. కోరి కొరివితో తలగోక్కోవడమంటే ఇదే మరి!
రాహుల్- రాజాలు ఉండగా మోడీ-అమిత్ షాలకు వేరే మిత్రులతో పనిలేదు.
ప్రాంతీయ పార్టీలతో దేశ ప్రజాస్వామ్యానికి, దేశం ఉనికికే ప్రమాదమని ప్రధాని మోడీ అనడానికి రాజాలే ఆస్కారమిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు దేశానికి సంబంధించిన పట్టింపు; అంతర్జాతీయ సంబంధాల్లాంటి పెద్ద పెద్ద విషయాల మీద శ్రద్ధ లేకపోవడం కొంతవరకు నిజమే కావచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలే ఉండకూడదన్న ధ్వని ప్రధాని మాటల్లో వినిపిస్తోంది. చేతల్లో దాపరికం లేకుండా కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండడానికి వీల్లేకుండా రాజ్యాంగాన్ని తిరగరాస్తే పోలా!
అయినా…మనలో మన మాట.
దానికి రాజ్యాంగాన్ని తిరగరాయాల్సినంత పనేముంది?
గోటితో పోయేదానికి గొడ్డలితో పనేముందన్న సామెత మోడీకి తెలియనిదా? -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article