ఊదు కాలదు, పీరు లేవదు…. కర్ర విరగదు, పాము చావదు… ఇలాంటివి ఎన్నో గుర్తొస్తయ్ కేంద్రంలోని బీజేపీ ప్లస్ ఏపీలో జగన్ ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే… ఎవరో పెద్ద మనుషుల నడుమ కేసీయార్, చంద్రబాబు రాజీ కుదిరింది కాబట్టి ఇన్నేళ్లూ కేసీయార్ ‘వోటుకునోటు’ కేసును కోల్డ్ స్టోరేజీలో పెట్టేశాడు అనుకుందాం… ఇప్పటి పరిస్థితిలో తెలంగాణలో తెలుగుదేశం జీరో కాబట్టి, కేసీయార్‌కు ఆ కేసు తవ్వడం వల్ల వచ్చేదీ లేదు, పోయేదీ లేదు అనే విశ్లేషణే నిజమని అనుకుందాం… కానీ..?
జగన్, కేసీయార్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి… అమిత్ షాకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి, ఆంతరంగిక రాచరహస్యాలు ఏవో మాట్లాడి వచ్చారు… అవన్నీ చంద్రబాబును బొక్కలో తోసే ప్రణాళికలే అనుకుందాం… ఆ తరువాతే ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చింది, ఎలాగూ కేసీయార్ తన దోస్త, తన గురువు చంద్రబాబు జోలికి పోవద్దనే పాత ఒప్పందానికే కట్టుబడి ఉన్నాడనీ అనుకుందాం… అందుకే బీజేపీ తెలివిగా వోటుకునోటు కేసు తవ్వి, ఈడీ రూపంలో బుక్ చేసే ఆలోచనలో ఉందనే అనుకుందాం… కానీ..?
Ads
ఆ ప్రణాళికలో భాగంగానే వోటుకునోటు కేసులో ముద్దాయి జెరూసలెం మత్తయ్య స్టేట్మెంట్లు రికార్డు చేసి, మళ్లీ ఈడీ ద్వారా కేసు తవ్వుతున్నారు అనుకుందాం… ఏపీలో తాము నెంబర్ టూ ప్లేసులోకి వెళ్లాంటే చంద్రబాబును తొక్కడమే మార్గం అని అమిత్ షా అనుకుంటున్నాడనే నమ్ముదాం… నువ్వు అడ్డుపడకు బాబూ అని కేసీయార్‌ను కేసుల పేరుతో బెదిరించి లొంగదీసుకున్నారనే అనుకుందాం…
ఒకేసారి ఇటు రేవంత్‌ను తొక్కి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ఏపీలో చంద్రబాబును తొక్కేయాలనేదే ప్లాన్ అనుకుందాం… స్థూలంగా పైపైన చూస్తే బాగానే ఉంది… చంద్రబాబుకు సపోర్టుగా నిలిచే ఢిల్లీ, అమరావతి రాజ్యాంగవ్యవస్థల్లో మార్పులు కూడా ఈ దిశలో సాగుతున్నవే అని నమ్ముదాం… కానీ నిజంగా బీజేపీ గనుక సీరియస్‌గా తీసుకుంటే చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లేవాడు కదా… ఆయన్ని బుక్ చేయడానికి వేరే అంశాలే లేవా ఏం..?
రెండుమూడేళ్లుగా వింటూనే ఉన్నాం… అయిపోయింది, చంద్రబాబును తొక్కేస్తాడు మోడీ అనే ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాం… కానీ ఏం జరిగింది..? చంద్రబాబు చొక్కా మీద దుమ్ము కూడా దులపలేకపోయారు జగన్, కేసీయార్, మోడీ…. వ్యవస్థల మీద చంద్రబాబు గ్రిప్పు అలాంటిది… ఈరోజుకూ జగన్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా చంద్రబాబును ఇరుకుపెట్టగల ఏ పనీ చేయలేకపోయాడు… పైగా తనే ఎప్పటికప్పుడు డిఫెన్సులో పడిపోతున్నాడు…
ఎప్పటికప్పుడు చంద్రబాబు ఏం చేసుకుంటావో చేసుకోవోయ్ అని జగన్‌కు సవాళ్లు విసురుతూనే ఉన్నాడు… ఇన్ని రోజులు గడుస్తున్నా చంద్రబాబును అడ్డంగా బుక్ చేయగల ఏ కాంక్రీట్ స్టెప్పూ జగన్ క్యాంపు నుంచి లేదు… ఇటు కేసీయార్ ‘నాకెందుకు తీట’ అని వదిలేశాడు… ఈ స్థితిలో కేంద్రంలోని బీజేపీ ఒక అడుగు ముందుకేసి, జెరూసలెం మత్తయ్యతో చంద్రబాబు రూపంలోని తెలుగుదేశన్ని, రేవంత్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ను ఒకేసారి జాయింటుగా బుక్ చేసేలా ఈడీ ఎదుట ‘‘నేరాంగీకార ప్రకటన’’ చేయించి, రికార్డు చేశారనే విశ్వసిద్దాం… చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రులైన న్యాయమూర్తులనూ కట్టడి చేస్తున్నారని అనుకుందాం… బట్, అన్ని వ్యవస్థల్లోకి విస్తరించిన ఒక విశ్వవిఖ్యాత చంద్రబాబును మోడీ అరెస్టు చేయగలడా..? చంద్రబాబును చూస్తూ జగన్, రేవంతుడిని చూస్తూ కేసీయార్ చప్పట్లు కొట్టగలరా..? జరిగే పనేనా..? అందుకే ముందే చెప్పుకున్నది… ఊదు కాలదు, పీరు లేవదు… కర్ర విరగదు, పాము చావదు…!!
Share this Article