వాటీజ్ దిస్ మోడీ..,? నువ్వు హైదరాబాద్ వస్తే… మినిమం ప్రొటోకాల్ పాటించవా..? ఆమాత్రం మర్యాదమన్ననా తెలియవా నీకు..? పైగా దేశదేశాలు తిరిగావు… ఎవరు కలిస్తే వాళ్లకు అలుముకుని ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టేసుకున్నవ్… మరి మా హైదరాబాద్ వస్తే, మా సీఎం కేసీయార్‌కు ఆహ్వానం లేదా..? కేవలం సీఎస్, డీజీపీ తదితరులు వస్తే చాలునంటావా..? నువ్వేమైనా మోనార్క్ అనుకున్నవా..? అప్పట్లో రాజీవ్ గాంధీ ఇలాగే మా అంజయ్యను అవమానించాడు… ఈసడించాడు, మట్టిగొట్టుకుపోయాడు మరిచావా..? నీలాంటి నియంతలు కూడా చాలామంది వచ్చారు, పోయారు, నువ్వూ మొదలూ కాదు, నువ్వు చివరి వాడివీ కావు… ఇంత అహంకారమా…? చివరకు నువ్వు పర్యటిస్తున్న పరిధిలోని ఎంపీ మా రేవంతుడికి కూడా చెప్పవా..?……………….. ఇదుగో ఇలా బోలెడన్ని విమర్శలు, చెణుకులు, శాపనార్థాలు…
ఇంకాస్త ముందుకు పోదామా..? ఏమయ్యా మోడీ…? అసలు ఆ జీనోమ్ వ్యాలీ కట్టింది మా చంద్రబాబు… ఆయనకు ఆహ్వానం ఏది..? నీ తాత జాగీరు అనుకున్నావా..? మా చంద్రబాబుకు ఆహ్వానం ఏది అసలు..? ఆ వేక్సిన్ కనిపెట్టింది మా రామోజీరావు వియ్యంకతాత… ఆయన్ని పిలిచావా కనీసం..? ఆ లోకల్ ఎమ్మెల్యేను పిలిచారా..? ప్రొటోకాల్ అంటే ప్రొటోకాలే… లోకల్ జెడ్పీటీసీ, లోకల్ సర్పంచ్, లోకల్ వార్డు మెంబర్… ఎవరినీ పిలవలేదు… నువ్వేమైనా హిట్లర్వా..? ఆయన తాతవా..? ఆయ్ఁ…
Ads
ఇప్పుడు చూడు, మా కేసీయార్‌కు కోపమొచ్చింది… మా రేవంతుడికి కోపమొచ్చింది… మా లోకల్ జెడ్పీటీసికి కోపమొచ్చింది..? బిడ్డా, నీ సంగతి చూస్తాం… అసలు ఆ భారత్ బయెటెక్కోడు ఆ వేక్సిన్ ఎట్లా తయారు చేస్తాడో చూస్తాం… వాడి ల్యాబులు, ప్రొడక్షన్ కేంద్రాలు ఎట్లా పనిచేస్తాయో చూస్తాం… హమ్మా… అంత తెగింపా..? అంత ధైర్యమా..? ఇదేమైనా నీ వ్యక్తిగత పర్యటనా..? ఎవరినీ పిలవకుండా వచ్చీపోవడానికి..? వ్యక్తిగతం అయితే ప్రధాని విమానంలో ఎందుకొచ్చినవ్..? ప్రధానిగా ఎందుకు పర్యటిస్తున్నవ్..? వ్యక్తిగత పర్యటనకు వస్తే మా సీఎస్, మా డీజీపీ ఎందుకు వచ్చి నీకు స్వాగతం పలకాలి మరి..?
మా కేసీయార్ ఏదో ఎల్బీ స్టేడియంలో పబ్లిక్ మీటింగు పెట్టుకున్నడు… రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆంక్షలున్నయ్… అయితేనేం… రమ్మనకపోవడం దేనికి..? రమ్మంటే తెలిసేది కదా… తను వస్తాడో రాదో తేలిపోయేదిగా… నీ మీటింగ్ చూసుకో బ్రో, నా కోసం వచ్చి టైం వేస్ట్ చేసుకోకు అని చెబుతున్నట్టా..? అసలు ఏమిటిది..?
……………… ఇదుగో. ఇలాగే సోషల్ మీడియా, మీడియా తెగరెచ్చిపోయి రాసేస్తోంది ఏమిటేమిటో… ఒక కోణంలో నిజమే… తను ప్రధానిగా పర్యటిస్తున్నప్పుడు కొంత ప్రొటోకాల్ పాటిస్తే బాగుండు… అది మర్యాద… కేసీయార్ వస్తాడా రాడా, మొహం చాటేస్తాడా, దాన్ని మళ్లీ ఎలా ప్రచారం చేసుకోవాలీ అనేది వేరే విషయం… నో, నో, కేసీయార్ మీద మస్తు కోపమొస్తుంది, నేను ఆయన మొహం చూడటానికి ఇష్టపడటం లేదు, అందుకే ఆయన్ని రావద్దన్నాను అంటే కుదరదు, ఆయన ఈ రాష్ట్రానికి సీఎం… అతిథులెవరొచ్చినా అరుసుకోవాలి… పోనీ, ఆయన మర్యాద పాటిస్తాడా లేదా చూడాల్సింది కదా… అబ్బే, ఏం బాగోలేదు మోడీ భయ్యా…
అవునూ, ఇంతకీ నీకు కేసీయార్ మీద అంత కోపం ఎందుకొచ్చింది..? బెంగాల్ లో మమతతో, ఒడిశాలో నవీన్‌తో బాగానే ఉంటున్నావుగా… మరి కేసీయార్ మీద ఆయన మొహం కూడా చూడను అన్నంతగా ఆగ్రహం ఏమిటి..? నీకు వ్యతిరేకంగాఏదో ప్రాంతీయ పార్టీల సమాఖ్య ప్లాన్ చేస్తున్నాడనేనా..? ఆయన ఢిల్లీకి చేరి, గాయిగత్తర లేపి, నిన్నూ నీ పార్టీని పునాదులతో సహా లేపేస్తాడనే భయమా..? మొన్నటి ఎన్నికల్లో నీ ప్రత్యర్థులకు డబ్బులిచ్చి సాయం చేశాడనే కోపమా..? రేప్పొద్దున తనతో పొలిటికల్ ఘర్షణ తప్పదు, ఇంకా మొహాలు చూడటం, ఈ మర్యాదలు దేనికి అనేనా..? ఇంకేదైనా సీరియస్ చర్యలు ప్లాన్ చేస్తున్నవా..? అందుకే కేసీయార్ మొహం చూడదల్చుకోలేదా..? అసలు నిజమేమిటి సారూ..? పోనీ, నోటికొచ్చిన ఏదో వివరణనయినా ప్రజలకు చెప్పాలి కదా… అదీ చెప్పవేమిటి..? ఎవడికి చెప్పేదేమిటి అనే జిన్‌పింగ్ పోకడా..? ఏమిటిది..?
Share this Article