.
మలయాళ అగ్రహీరోలు సైతం భిన్న పాత్రల్ని పోషించడానికి ఎలా తహతహలాడతారో… ప్రయోగాలకు ఎలా సిద్ధపడతారో… ఆయా పాత్రల కోసం తమ ఇమేజీలను కూడా పక్కన పెట్టేస్తారో చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం కదా గతంలో…
మరో వార్త… జైభీమ్ వంటి ఆలోచనాత్మక సినిమాలు తీసిన జ్ఞానవేల్ హీరో మోహన్‌లాల్‌కు శరవణ భవన్ ఓనర్ రాజగోపాల్ కథ చెబితే… ఆ పాత్ర చేయడానికి మోహన్‌లాల్ అంగీకరించాడనేది వార్త సారాంశం… ఇంట్రస్టింగ్… ఎందుకంటే..?
Ads
శరవణ భవన్ రాజగోపాల్ కథ పెద్ద సక్సెస్ స్టోరీయే… కానీ తన వ్యక్తిత్వంలోని చీకటికోణాలు క్రూరమైనవి… నీచమైనవి… సో, ఆ బయోపిక్‌లో మోహన్‌లాల్ ఆ డార్క్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడానికి సిద్ధపడితే నిజంగా విశేషమే అది… ఐతే ఆ పాత్రను ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది కూడా ముఖ్యమే…
దోశ కింగ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ రాజగోపాల్ కథ తెలుసా మీకు..? సంక్షిప్తంగా చెప్పుకోవాలనుకుంటే…
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా “శరవణ భవన్” పేరుతో శాకాహార హోటళ్ల సామ్రాజ్యం నిర్మించిన వ్యక్తి – పి. రాజగోపాల్… అందరూ “దోశ కింగ్” అని పిలిచేవారు… సాధారణ రైతు కుటుంబం నుండి ప్రారంభించి, చెన్నైలో చిన్న కాంటీన్‌తో మొదలైన ప్రయాణం, కొన్ని దశాబ్దాల్లోనే అమెరికా, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఆ వ్యాపారం విస్తరించింది… ఇది నిజంగా ఒక సక్సెస్ స్టోరీ…
మరో కోణం చూద్దాం… వాడికి ఓ జ్యోతిష్కుడు తగిలాడు… ఆల్రెడీ రెండు పెళ్లిళ్లయ్యాయి రాజగోపాల్‌కు… మూడో పెళ్లి చేసుకో, రాజయోగం పడుతుందని చెప్పాడు… వీడి బుర్రలో పురుగు చేరింది… కన్ను ఓ అమ్మాయిపై పడింది… ఆమె తన హోటళ్లలోనే తన వద్ద అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే వ్యక్తి కుమార్తె… జీవజ్యోతి…
ప్రయత్నాలు ప్రారంభించాడు… కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ప్రిన్స్ శాంతకుమార్ అనే యువకుడిని ఈ జీవజ్యోతి ప్రేమించింది… రాజగోపాల్ మూడోపెళ్లి ప్రతిపాదనను అడ్డంగా తిరస్కరించింది… డబ్బులు, ఆస్తులు, ప్రలోభాలను కాలదన్నింది… ఆమె, శాంతకుమార్ 1999లో పెళ్లికూడా చేసుకున్నారు… రాజగోపాల్ కళ్లు భగ్గుమన్నాయి…
ఇద్దరూ విడాకులు తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు… దీంతో దంపతులు 2001లో రాజగోపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఇది జరిగిన కొద్దిరోజులకే శాంతకుమార్ హత్యకు గురయ్యాడు… 2001 అక్టోబరులో కొడైకొనాల్‌లోని పెరుమాళమలై ప్రాంతంలో శాంతకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. జ్యోతి తనకు దక్కలేదనే కోపంతో రాజగోపాలే హత్యచేయించాడు… పోలీసులకు ఆధారాలూ దొరికాయి… కేసు పెట్టారు… ఎక్కడా పోలీసులు పట్టుసడలించకుండా సీఎం జయలలిత ఆదేశాలిచ్చింది…
తన మీద కన్నేసి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేయించిన రాజగోపాల్‌కు ఎలాగైనా శిక్ష పడాల్సిందేనని జ్యోతి కంకణం కట్టుకుంది… కోర్టుల్లోనూ పోరాడింది… చిన్న టైలరింగు షాపు పెట్టుకుని, తల్లి సాయంతో దాన్ని నడిపించుకుంటూ పోరాటం కొనసాగించింది…
2004లోనే రాజగోపాల్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది… కానీ అప్పీలు, జామీన్‌లతో కేసు సంవత్సరాల తరబడి సాగింది… చివరకు 2019లో సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది… జైలుకెళ్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించి, గుండెపోటుతో మరణించాడు… ఓ సక్సెస్‌ఫుల్ వ్యాపారి కథ అలా దరిద్రంగా ముగిసిపోయింది… ఈ నీచుడి కథను తెర మీద మోహన్‌లాల్ ఇమేజ్‌కు భిన్నంగా రక్తికట్టించడం అంటే సవాలే…
Share this Article