.
అతివృష్టి అన్నట్లు… నేడు సోషల్ మీడియాలో ఏదైనా చిన్న విషయం భూతద్దంలోకి ఎక్కితే చాలు, అనవసర రాద్ధాంతాలు, అనర్థాలు పుట్టుకొస్తుంటాయి… తాజాగా మోహన్ లాల్ ‘బాడీ డబుల్’ వివాదం విషయంలో జరిగిందీ అదే!
రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్ 2’ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ‘మాథ్యూ’ అనే శక్తివంతమైన కేమియో పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే… అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత, మోహన్ లాల్ గెటప్‌లో ఉన్న కొన్ని ఫోటోలను జోబి కొడకర అనే మిమిక్రీ ఆర్టిస్ట్/ బాడీ డబుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు…
Ads
క్లైమాక్స్ సన్నివేశాలతో సహా మోహన్ లాల్ నటించాల్సిన కీలక సన్నివేశాల్లో ఆయనకు బదులుగా ఈ బాడీ డబుల్‌ను వాడారంటూ నెట్టింట ప్రచారం మొదలైంది… దీంతో మోహన్ లాల్ అభిమానులు అసంతృప్తికి లోనవ్వడమే కాకుండా, పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది…
అయితే, ఈ వివాదంపై బాడీ డబుల్ జోబి కొడకర స్వయంగా స్పందిస్తూ స్పష్టతనిచ్చాడు… క్లైమాక్స్‌లో కారు నడిపేటప్పుడు గేర్లు మార్చడం, యాక్సిలరేటర్ నొక్కడం వంటి కొన్ని సెకన్ల ఇన్సర్ట్ షాట్లలో మాత్రమే తన చేతులు, కాళ్లు వాడారని, సినిమాలో ఎక్కడా తన ముఖం చూపించలేదని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు… ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకున్నాడు… యాక్షన్ డైరెక్టర్ చెతన్ రామ్షి కూడా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులన్నీ మోహన్ లాలే స్వయంగా చేశాడని చెప్పుకొచ్చాడు…
అసలు ఇది ఓ తలతిక్క రాద్ధాంతం… సినిమా రంగానికి ఈ డూపులు, బాడీ డబుల్ ప్రాసెస్ కొత్తదేమీ కాదు… సినిమా అంటేనే ఒక మాయా ప్రపంచం… అక్కడ కనిపించే ప్రతి షాట్, ప్రతి సన్నివేశం వెనుక ఎంతో మంది సాంకేతిక నిపుణుల శ్రమ ఉంటుంది… ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-రిస్క్ డ్రైవింగ్ షాట్లు, లాంగ్ రేంజ్ విజువల్స్ తీసేటప్పుడు నటుల భద్రతను దృష్టిలో ఉంచుకొని డూపులను లేదా బాడీ డబుల్స్‌ను వాడడం అత్యంత సహజం…
మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్, దశాబ్దాలుగా పరిశ్రమలో వేలాది యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు కదా… అన్నీ తనే చేశాడా..? లేదు కదా… బాడీ డబుల్స్ తనకే కాదు, చివరకు నిన్నగాక మొన్న కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కుర్ర హీరోలు కూడా వాడేస్తున్నారు… ఇప్పుడైతే గ్రాఫిక్స్ కూడా ఉపయోగిస్తున్నారు… అందరికీ తెలిసిన రహస్యమే బాడీ డబుల్…
కానీ, కార్ డ్రైవింగ్ సమయంలో గేర్లు మార్చే క్లోజప్ షాట్లకో, లేదా ఎడిటింగ్ పరంగా అవసరమైన చిన్న ఇన్సర్ట్ షాట్లకో ఒక బాడీ డబుల్ చేతులు లేదా కాళ్లు కనిపిస్తే, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ “హీరో నటించలేదు, అంతా డూపే” అని ప్రచారం చేయడం కేవలం పిచ్చి వివాదం…

ప్రస్తుత డిజిటల్ యుగంలో వివాదాలకే ఎక్కువ మార్కెట్ ఉంది… ఒక చిన్న విషయాన్ని పట్టుకుని దాన్ని పెద్దదిగా చేసి చూపించడం, వ్యూస్, లైకుల కోసం సోషల్ మీడియాలో ఫేక్ నెరేటివ్స్ క్రియేట్ చేయడం కొందరికి అలవాటుగా మారింది…
-
ఫ్యాన్ వార్స్ & ట్రోలింగ్…: ఒక స్టార్ హీరో సినిమా పట్ల జరిగే ఈ రకమైన దుష్ప్రచారం వెనుక ప్రత్యర్థి వర్గాల ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంటుంది…
-
సోషల్ మీడియా క్రేజ్…: జూనియర్ ఆర్టిస్టులు లేదా డూప్‌లు సినిమా సెట్లలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తామేదో పెద్ద చక్రం తిప్పినట్లు బిల్డప్ ఇవ్వడం ఈ వివాదానికి అసలు బీజం వేసింది…
సినిమా అనేది ఒక టీమ్ వర్క్… అక్కడ ఏ ఒక్కరి శ్రమను తక్కువ చేయడానికి వీలులేదు… దర్శకులు, స్టంట్ మాస్టర్లు భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, దాన్ని స్వాగతించాలి కానీ అనవసరమైన రాద్ధాంతాలు చేసి, అసలు సినిమాలోని మ్యాజిక్‌ను చెడగొట్టకూడదు… అక్కడికి మోహన్‌లాల్ ఒక్కడే బాడీ డబుల్స్‌ను వాడుతూ మిగతా హీరోలందరూ సొంతంగా భీకరమైన ఫైట్లు, యాక్షన్ సీన్లు చేసేస్తున్నట్టు..!!
చివరగా… ఇదే సినిమాలో రజినీకాంత్ వయోభారం దృష్ట్యా తనతో ఫైట్లు, యాక్షన్ సీన్లు చేసేటప్పుడు చాలా విభిన్నంగా కంపోజ్ చేశారు… అతిగా గాలిలో ఎగరడం, పల్టీలు కొట్టడం (Over-the-top acrobatics) వంటివి లేకుండా చాలా సహజంగా, తక్కువ కదలికలతో (Realistic) తీర్చిదిద్దారు… రజనీకాంత్ చిన్న చిన్న మూవ్మెంట్స్, మేనరిజమ్స్తోనే ఎలివేషన్ ఇచ్చి శత్రువులను చెండాడుతాడు… అల్లు అర్జున్ అన్నట్టుగా… మడత నలగకుండా వందల కోట్లు సాధించిన వైబ్ రజినీకాంత్‌ది…
Share this Article