.
రోజురోజుకూ మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాలుకు రెండు వివాదాలు పెద్దదవుతున్నాయి… రెండూ మతప్రమేయం ఉన్నవే… తన స్నేహితుడు మరో సూపర్ స్టార్ మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్‌లాల్ అయ్యప్పను ప్రార్థించాడనేది మొదటి అంశం…
ఏమాత్రం స్పర్థ లేకుండా, ముప్పయ్ ఏళ్లుగా మోహన్‌లాల్, మమ్ముట్టి మాలీవుడ్‌లో ఓ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుతున్నారు… ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా కూడా చేస్తున్నారు… వారితోపాటు నయనతార, ఫహాద్ ఫాజిల్ కూడా అందులో నటిస్తున్నారు…
Ads
ఐతే ఒక ముస్లిం స్నేహితుడి కోసం ఇతర మత దేవుళ్లను ప్రార్థించడం ఏమిటనేది కొందరి విమర్శ… నిజానికి మోహన్‌లాల్ తన మిత్రుడి ఆరోగ్యం కోసం తను నమ్మిన దేవుళ్లను ప్రార్థించడం సహృదయం, సత్సంకల్పమే తప్ప అందులో తప్పేమిటనేది కొందరి ఖండన…
అనేక ప్రాంతాల్లో దర్గాలను కూడా హిందువులు సందర్శిస్తారు… తమ మంచి కోసం ప్రార్థిస్తారు… కానీ మోహన్‌లాల్ చర్య మాత్రం విమర్శలకు గురైంది… ఇది ముస్లిం వర్గాల నుంచి ఎదురు కాాగా, తన తాజా సినిమా ఎంపురాన్ సినిమా మీద హిందూ వర్గాలు దాడి చేస్తున్నాయి…
బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలే కాదు, చివరకు మోహన్‌లాల్ ఫ్యాన్స్ నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది… గోధ్రా రైలు దహనం చూపించిన దర్శకుడు, అదేదో ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనగా చిత్రీకరించాడనీ, దానికి మూలకారణం చూపించలేదనీ, పైగా తరువాత పరిణామాలను, మతహింసలో హిందువులను చెడుగా చూపించాడనీ హిందూశక్తుల విమర్శ…
ఈ విమర్శలు పెరగడంతో నిర్మాతలు విలన్ పేరు మార్చడంతోపాటు దాదాపు 26 సీన్లను కత్తిరించారని ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ రవి చెబుతున్నాడు… ఆయన మోహన్‌లాల్ దోస్త్… మోహన్‌లాల్ లెఫ్టినెంట్ కల్నల్ పోస్టు కరెక్టు కాదంటూ తనకు ఆర్మీ నుంచి కాల్స్ వస్తున్నాయట…
‘‘మోహన్‌లాల్ స్క్రిప్టులో కలగజేసుకోడు, ఎంపురాన్ మాత్రమే కాదు, తన కీర్తిచక్ర సినిమాను కూడా తను చూడలేదు రిలీజు తరువాత… ఈ అనుకోని వివాదంతో తను బాధపడుతున్నాడు… దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, స్క్రిప్టు రచయిత మురళి గోపీలే ఈ వివాదానికి బాధ్యులు… సున్నితమైన అంశాల్ని చూపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా’’ అంటాడు తను…
‘‘నా క్రియేటివ్ వర్క్ నేను చేశాను.., లెఫ్ట్, రైట్ వింగ్స్ తన్నుకుంటే తన్నుకోనీ’’ అన్నట్టుగా మురళి గోపి తేలికగా ఈ వివాదాన్ని కొట్టిపడేసినట్టు వార్తలు వచ్చాయి… అది బాధ్యతారహితమైన వ్యాఖ్య అని మరో విమర్శ… త్వరలో మోహన్‌లాల్ క్షమాపణ చెబుతాడని కూడా మేజర్ రవి అంటున్నాడు… తను లేవనెత్తిన ఓ ప్రశ్న మాత్రం ఇంట్రస్టింగు…
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆ సినిమాకు ఆమోదం తెలిపింది కదా… మరి వాళ్లు ఎందుకు ఆబ్జెక్షన్స్‌ను రిలీజుకు ముందే లేవనెత్తలేదు… ఎక్కువగా అందులో ఉన్నది బీజేపీ వాళ్లే కదా… వాళ్లను తీసేయండి అర్జెంటుగా అంటున్నాడు తను… అవును, సెన్సార్ సమయంలో అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇప్పుడిలా కొత్త వివాదం ఎలా క్రియేటైంది..?!
అప్ డేట్ ::: నాకు ప్రియమైన కొందరిని బాధించిన సీన్లను సినిమా నుంచి తీసేయాలని నిర్ణయించాం, చిత్ర బృందం తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను… అని మోహన్ లాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు…
Share this Article