……. By…. Taadi Prakash……… బాపూ.. నీ పాదాలేవీ!
MOHAN’s encounter with artist Bapu
———————————————————–
విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసు. బాస్ ఒక చేతిలో ఫోనూ, మరో చేతిలో టైటిల్ డిజైనూ పట్టుకుని తాపీగా మాటాడుతున్నాడు. ఎదురుగా నేను టైటిల్ తీసుకుని చూశా. తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ కి బాపూ వేసిన బొమ్మ. ఉరుకుతున్న గుర్రం మీద వీరావేశంతో చంఘిజ్ ఖాన్ మంగోలియన్ కళ్ళూ, మీసాలూ, వెనక మంగోలియన్ డిజైన్. కళ్ళు తిరిగే రంగులు. మబ్బుల్లోకి ఎగిరిపోయే గుర్రం వెన్నుమీంచి తోకవరకూ సర్రున దూసిన గీత.
Ads
బాస్ జోషి గారు మాట్లాడుతున్నారు. “బొమ్మ బానే ఉంది. రంగులు కూడా ఓకే-కానీ మంగోలియన్ ఎట్మాస్ఫియర్ రాలేదు. తెన్నేటి సూరి స్పిరిట్ కావాలి. అదే లేదిందులో” ఇంకా ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడాయన. ఎవరితో మాట్లాడారంటే, బాపూ అన్నారు. నా కళ్లు మెరిశాయి. ఏమన్నాడాయన? అంటే మంగోలియన్ మోటిఫ్స్ ఉన్న ఆల్బమ్ లు పంపిస్తే మరో బొమ్మ గీసిస్తానని చెప్పాడట. ఈ బొమ్మకేం తక్కువా? కన్ను వంకరా, కాలు వంకరా? అని నేను వాదించా. బాపూ రెండోసారి కాదంటే మూడోసారి గూడా వేసిస్తాడు. నీకేమిట్రా నెప్పి మధ్యలో అని జోషీగారు నవ్వేరు. బెంగపడిపోయాను.
ఎంత అందమైన బొమ్మ.
బాపు బెజవాడ హోటల్ నుంచే ఫోన్ చేశారని జోషీ చెప్పారు. ఇదంతా పన్నెండూ, పదమూడేళ్ళ క్రితమేమో. ముత్యాలముగ్గుకు ముందో వెనకో మరి. బాపూని ఇంటర్వ్యూ చెయ్యాలి. నేనో డైలీ పేపర్ సబ్బెడిటర్ని. నా పక్కన బుల్లి మంత్లీ ‘యువజన’ ఎడిటర్. ఇంటర్వ్యూలో తుచ్ఛమైన సినిమాల గురించి మాట్లాడకూడదన్నాను. బాపూ అంటే నిన్నా నేడూ రేపూ బొమ్మలేననీ లెక్చర్ దంచాను. హరి వంశము నుండి చక్రభ్రమణం, సెక్రటరీ వరకూ వేసిన ఇలస్ట్రేషన్ల ఆరాతీయాలి. చందమామలో గలివర్ ట్రావెల్స్ కి విదేశీ బొమ్మలూ, గంగావతరణం పద్యాలకి శివుడి నిలువెత్తు బొమ్మా బొత్తిగా తేడాగా ఎందుకున్నాయో కూపీ లాగాలి. గాలిబ్ గీతాల్లో క్రోక్విల్ గీతకీ, కార్ట్యూన్ కారికేచర్ లో బ్రష్ స్ట్రోక్ కీ మధ్య ఉన్న అక్రమ సంబంధం రహస్యాన్ని ఈ బాపూతో కక్కించాలి. ఈవిధంగా ద ఎలెవెన్ కాజెస్ ఫర్ ది బర్త్… రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది టెల్గూ కార్టూన్ అండ్ ఇలస్ట్రేషన్ అనే పరిశీలనాత్మక కమ్ పరిశోధనాత్మక క్రిటిక్ రాయగలం అని చెప్పాను. నీ బుర్రే బుర్ర అన్నాడు పక్కనున్న బుజ్జాయి. అది సూరేకారం అని చెప్పాను. అప్పటికే నా లెక్చర్ లోని జ్ఞాన భారంతో వాడి కళ్లు అరమోడ్పులవుతున్నాయి.
(Mohan’s cover drawing)
నవోదయ రామ్మోహనరావుగారు హోటల్ గదిలోకి దారి చూపించారు. బాపూ లక్షణంగా తెల్ల డ్రస్ లో నల్ల పైప్ కాలుస్తున్నారు. మా మంత్లీ మాగజైన్ చూపించాం. మేము ఫలానా జర్నలిస్టులు హై అని చెప్పాం. కానీ నేను మీ అభిమానిగారు అని చెప్పలేదు. కనీసం నేను కూడా చిత్రకారుడు గారు అనైనా చెప్పలేదు. ఆయన మొహం చూసి ఓరి వెర్రివాడులారా అనేసుకున్నా. ఆ మాటకొస్తే అంతలేసి బొమ్మలు గీసే మనిషిలా కనిపించనేలేదు. వాటి ఘోస్ట్ పెన్ మేన్ లాగా ఉన్నాడు. మహానుభావులైనట్టి మా హృదయాలని మీ బొమ్మలు చూరగొన్నాయన్నట్టు చెప్పాను. ఏదో లెండి తెలీక చేశానన్నట్టు ఆయన నసిగాడు. ఏది అడిగినా ఔనౌనూ, అంతే మరి అంటూ ముందుకు ముందే ఏకీభవించేస్తున్నాడాయన. మేం ఊరుకోలేదు. అంతకు ముందెప్పుడూ చూడలేదు గనుక నా సంగతి తెలిసినట్టు లేదాయనకి. విజృంభించా. నర్సాపురంలో ఎందుకు పుట్టావ్? లాయరు పని మానేశావేం? బొమ్మ ఎందుకేస్తావ్? ఇండియనింకూ అయిడియాలూ ఎవడిచ్చాడు?
నేల మీద మఠం వేసుకు గీతలు గీయడమేనా?
ఈజిల్ ముందు తిన్నగా నించుని ఆయిల్స్ వేయడమంటూ ఉందా? అంటూ రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుకున్నా. అసలీ సినిమా వేషాల వల్ల చెడిపోయారు. బొమ్మలు తగ్గించేశారు అంటూ ప్రైవేటు చెప్పేశా. పాత బొమ్మలన్నీ జాగ్రత్త చేయడం, ఎగ్జిబిషన్లలో పెట్టడం లాంటి శ్రద్ధ ఉందా అంటే అదీ లేదూ అని బాగా కోప్పడేశాను. స్వాతిలో ఆ బొమ్మలేమిటి? బ్రష్ తో ఆ పేజీలోంచి ఈ పేజీలోకి పరాపరామని గీస్తున్నారు? షూటింగ్ కి టైమైపోతే తర్వాత తీరిగ్గా వేసుకోవచ్చుగా. తొందరేంటి అని సూటిగా మందలించా. ఆయనకి బుద్దొచ్చినట్లు నాకర్థమవుతూనే ఉంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు కూడా అనిపించింది. సినిమాల్లో మరీ రామభక్త హనుమాన్ లాగా తయారవుతున్నారు అని కూడా గదమాయించాం. అలాంటిదేమీ లేదే అంటూ ఆయన నీళ్లు నములుతున్నపుడే వెనక టేప్ రికార్డర్ లోంచి రాయినైనా కాకపోతిని పాట మొదలయింది. గట్టిగా నవ్వుతూ టేప్ కట్టేశారాయన.
అంతకుముందు చిట్టికి చిరుగంట పుస్తకం ఫలానీ పేజీలో రెండో ఇలస్ట్రేషన్, బుడతడి అద్భుత యాత్రలో చీమ పైన గడ్డి పరకతో బుడతడి యుద్ధం బొమ్మ నుండి ఫలానా పత్రిక ఫిల్లర్ వేసిన సింగిల్ కాలం బొమ్మ అంటూ నేను గడగడా వంద బొమ్మలు అప్పజెప్పేసరికి ఆయన డంగైపోయాడు. చివర్లో చంఘిజ్ ఖాన్ టైటిల్ గురించి అడిగా. జోషీ గారెందుకు నచ్చలేదన్నారో, నాకు చాలా బావుంది అన్నా. చెట్టంత ఆర్టిస్టయి ఉండీ మళ్ళీ వేస్తాను అన్నాడు. మంగోలియన్ ఆల్బమ్స్ పంపించమని చెప్పండి అన్నాడు. ఇంత సూపర్ స్టార్ కి ఈ మోడెస్టీకి బొత్తిగా పొంతన లేదే అనుకుంటూ సెలవు తీసుకున్నాం. నాలుగు రోజులయ్యాక మద్రాసు నుండి నాకో లెటరొచ్చింది. పెద్ద తెల్లకాయితం పైన చీమ తలంత ఇంగ్లీషు టైపులో బాపూ అని బూడిద రంగు పేరుంది.
మోహన్ కి –
అనగనగా ఒకానొక శ్రీ సినిమా కంపెనీ వారు ఆరుద్రని పాట రాయమన్నారు. అలాగేనన్నారు ఆరుద్ర. మూడు నిముషాల్లో రాసిచ్చారు. అదేమిటీ మూడు నిముషాల్లో రాసిన పాట ఏం బావుంటుందీ, బాగా కష్టపడి రాయాలి గదా అని శ్రీ సినిమా కంపెనీ వారన్నారు. ఇది మూడు నిమిషాల్లో రాసినా 30 ఏళ్ల అనుభవంతో రాసింది అని ఆరుద్రగారు చెప్పారు.
ఉంటాను మరి.
– బాపు
లెటర్ చదివి సిగ్గేసి చచ్చాను. స్వాతికి హడావుడిగా బొమ్మలేస్తున్నారన్న ఆరోపణకి ఆయన జవాబెలా ఇచ్చాడో చూడండి. పగలూ రాత్రీ ఆ లెటరే కలలోకి వచ్చింది. ఆయన ఇంటర్వ్యూని పేపర్లో రాయడం మానుకున్నాను. ఎప్పటికైనా బాపూగారు కనిపిస్తే ఆనాటిదంతా వెర్రితనమనీ, కుర్రతనమనీ చెప్పాలి. ఇప్పుడంతా జ్ఞాన భారంతో కుంగిపోతున్నామనీ, ఈ జీనియస్ ని ఏం చేసుకోవాలో తెలీట్లేదనీ చెప్పాలి. కనక బాపూగారి కాళ్లు ఎక్కడున్నా సరే రెండూ స్టేజి మీదికి రావాలి. గట్టిగా పట్టుకు బావురుమని ఏడవాలి.
– Mohan, artist
*** *** ***
కొన్ని వివరాలు: డిసెంబర్ 15 బాపుగారి 88వ పుట్టిన రోజు. మోహన్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది 1978లో కావొచ్చు. జోషి గారిది పశ్చిమ గోదావరి జిల్లా. వాళ్ళది సద్బ్రాహ్మణ కమ్యూనిస్ట్ కుటుంబం. జోషి తండ్రి మృత్యుంజయుడుని పోలీసులు కాల్చి చంపారు. అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడి పేరునే కొడుక్కి పెట్టుకున్నాడు మృత్యుంజయుడు. పీ.సీ.జోషీ ఢిల్లీ లోని పార్టీ ప్రచురణ సంస్థ peoples publishing house కి చాలా ఏళ్ళు బాస్ గా ఉన్నారు. విజయవాడలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ని ఆయన సమర్థంగా నడిపించారు. ఆర్టిస్ట్ మోహన్ కి మంచి మిత్రుడు. మోహన్ని ‘ఏ రా’ అని పిలిచే అతి కొద్దిమందిలో జోషి గారు ఒకరు. చివరి సంవత్సరాల్లో జోషి హైదరాబాద్ లో ప్రాచీ పబ్లికేషన్స్ పెట్టి చాలా పుస్తకాలు వేశారు. మూడేళ్ళ క్రితం జోషీ మరణించారు. ఆయన భార్య లలితా జోషీ ఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ లో చాలా ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఆమె వయసు 80 ఏళ్ల పైనే. మోహన్ వ్యాసం 1993 డిసెంబరులో ఆంధ్ర జ్యోతి ఆదివారం కవర్ స్టోరీగా వచ్చింది.
– Taadi Prakash 9704541559
Share this Article