హిందీ 77 సినిమాలు, 976 కోట్లు… కన్నడం 86 సినిమాలు, 36 కోట్లు… మలయాళం 54 సినిమాలు, 460 కోట్లు… తమిళం 85 సినిమాలు, 238 కోట్లు… తెలుగు 106 సినిమాలు 595 కోట్లు… మరాఠీ 38 సినిమాలు, 30 కోట్లు… ఇంగ్లిష్ 38 సినిమాలు, 127 కోట్లు… ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..? 2024 మొదటి నాలుగు నెలల సినిమా వసూళ్లు… ఇవన్నీ గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్లు… చెప్పుకోవడం దేనికంటే..?
గత ఒకటీరెండు సంవత్సరాల్లో కన్నడ ఇండస్ట్రీ వసూళ్లు దుమ్ముదులిపింది… బాక్సాఫీస్ వందల కోట్ల వసూళ్లతో షేకయిపోయింది… కేజీఎఫ్, కాంతారా, చార్లి వంటి సినిమాలు జాతీయ స్థాయిలో పాపులరయ్యాయి… శాండల్‌వుడ్ గతంలోలాగా కాదు, అది ఇతర భాషల చిత్రాలతో దీటుగా పోటీపడుతోంది అని నిరూపించిన కాలమది…
కానీ ఇప్పుడు..? తుస్సు… ఒక్కటంటే ఒక్క సినిమా చెప్పుకోదగింది లేదు… బెంగుళూరు నీటిఎద్దడిలాగే థియేటర్లు జనం లేక వెలవెల… 86 సినిమాలు రిలీజైతే జస్ట్, 36 కోట్ల వసూళ్లు, అంతే… అదేసమయంలో మలయాళం లెక్కలు చూడండి…
Ads
విశిష్ట ప్రయోగాలు, విభిన్న కథలు, వైవిధ్య ప్రజెంటేషన్లతో అది దూసుకుపోతోంది… 54 సినిమాలు రిలీజైతే 460 కోట్ల కలెక్షన్లు… మాలీవుడ్ స్థాయికి ఇది చాలా ఎక్కువ… ఇంత వయస్సొచ్చినా సరే మమ్ముట్టి గత 9 నెలల్లో 5 సినిమాలు చేశాడుట… దాదాపు అన్నీ హిట్లే… ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం, భ్రమయుగం వంటివి తెలుగులోనూ వచ్చాయి… ఇప్పుడు ఆవేశం అదరగొడుతోంది, 128 కోట్ల కలెక్షన్ల స్థాయి దాటేసింది…
హిందీ సినిమాల రేంజ్, రీచ్ బట్టి 77 సినిమాలకు 976 కోట్ల వసూళ్లు పర్వాలేదు, అప్పట్లో కునారిల్లిపోయిన బాలీవుడ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది… బడేమియా చోటేమియా, మైదాన్, క్రూ, సైతాన్, ఆర్టికల్ 370 వంటివి మంచి వసూళ్లే సాధించాయి… క్రూ అనుకోని విజయం… దాదాపు 150 కోట్ల రేంజుకు వెళ్లిపోయింది అది… ఆర్టికల్ 370 కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరింది…
ఎటొచ్చీ తమిళం, తెలుగు సినిమాలే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి… తమిళంలో 85 సినిమాలకు 238 కోట్ల వసూళ్లు అంటే దాని రేంజుకు చాలా తక్కువ… సేమ్, తెలుగు కూడా… టిల్లు స్క్వేర్ అనూహ్య విజయం తప్ప మిగతా సినిమాలేవీ సరిగ్గా ఆడలేదు… ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ఇండస్ట్రీకి షాకే… 106 సినిమాలతో ఇతర భాషలతో పోలిస్తే చాలా ఎక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలు వచ్చాయి…
కానీ వసూళ్లు మాత్రం 595 కోట్లు… అంటే సగటున ఐదారు కోట్లు… అందుకే థియేటర్లు వెలవెలబోతున్నయ్… ఏవో పాత సినిమాల్ని రీరిలీజ్ చేసుకుని ఏదో నెట్టుకొస్తున్నారు గానీ థియేటర్ల వద్ద అసలు సందడే లేదు… చెప్పుకోదగినవీ, జనాన్ని కనెక్టయ్యేవి సినిమాలు వస్తే కదా… మలయాళ సినిమాల్ని చూసి తెలుగు సినిమా ప్రముఖులు కమర్షియల్ పాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉందేమో..!!
Share this Article