Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !

August 25, 2026 by M S R

.

‘ఇరుముడి’లో మాలీవుడ్ ఫ్లేవర్ ఎందుకు..? తెలుగు సినిమా చూస్తున్నామా… మలయాళ సినిమా చూస్తున్నామా అనిపించిందా మీకు కూడా…?

‘ఇరుముడి’ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటివరకు ఎక్కువగా రవితేజ రీఎంట్రీ, తన నటన, నక్షత్ర పాపతో తండ్రి– కూతురు అనుబంధం గురించి చర్చ జరుగుతోంది. స్వాసిక విజయ్ పోషించిన ధనలక్ష్మి టీచర్ పాత్ర కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చను రేపుతోంది. ఆమె ఎవరనే సెర్చింగూ సాగుతోంది. బాగా చేసింది కూడా…

Ads

కానీ సినిమా చూస్తున్నప్పుడు ఇంకో విషయం మాత్రం పదేపదే అనిపిస్తుంది… ఇది తెలుగు సినిమా అయినా… మలయాళ సినిమా ఫ్లేవర్ ఎందుకు వస్తోంది? అది ఒక్క నటుడి వల్ల వచ్చిన వాసన కాదు… ఒక్క పాత్ర వల్లా కాదు.

సినిమాలోని కథ చెప్పే తీరు, పాత్రల ఎంపిక, గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలను నడిపించిన విధానం, అయ్యప్ప భక్తి నేపథ్యం, చిన్నపిల్ల పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఇవన్నీ కలిపి ‘ఇరుముడి’కి ఒక మాలీవుడ్ మార్క్ టచ్ ఇచ్చాయి…ఇరుముడి

ఇది యాదృచ్ఛికమా? లేక దర్శకుడు శివ నిర్వాణకు మలయాళీ కథాకథనాలు, ప్రయోగాల మీద ఉన్న అనురక్తి, అభిమానం తనకు తెలియకుండానే మలయాళ సినిమా మార్క్ సెన్సిబిలిటీ తన లోపలికి వచ్చిందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్న…

ముందుగా నటీనటులనే చూడండి… హీరో రవితేజ తెలుగు స్టార్… కానీ ఆయన చుట్టూ కనిపించే ప్రపంచం మాత్రం సాధారణ కమర్షియల్ తెలుగు సినిమా ప్రపంచంలా లేదు… ఆ దేవుడు మలయాళీ… హీరో కూతురిగా నక్షత్ర. మలయాళీ… ముఖ్యమైన పాత్రలో నటి స్వాసిక విజయ్. మలయాళీ…

ముఖ్యంగా నక్షత్ర గురించి చెప్పుకోవాలి… సినిమాలో ఆమె కేవలం హీరో కూతురు కాదు… కథను ముందుకు నడిపించే కీలక పాత్ర… తండ్రి జీవితంలో మార్పుకు కారణమయ్యేది ఆమే… తండ్రి– కూతురు బంధమే సినిమా భావోద్వేగానికి కేంద్రంగా నిలుస్తుంది… నిజానికి సినిమా బలాల్లో ఈ అమ్మాయి కూడా ఒకటి… ఇది మన దగ్గర సాధారణంగా కనిపించే కమర్షియల్ హీరో సినిమాల ఫార్ములాకు భిన్నం… అక్కడే మలయాళ సినిమా పదే పదే గుర్తుకొస్తుంది…

హీరో కంటే ముందు మనిషి… రవితేజను ఈ సినిమాలో చూస్తే మరో విషయం కనిపిస్తుంది… మామూలుగా రవితేజ అంటే ఎనర్జీ… డైలాగ్ వేగం… మాస్ మేనరిజమ్స్… హీరోయిజం… కానీ ‘ఇరుముడి’లో దర్శకుడు వాటన్నింటినీ పక్కకు పెట్టి ఒక మద్యానికి బానిసైన ఓ సాధారణ తండ్రిగా చూపించే ప్రయత్నం చేశాడు…

తన కూతురంటే ప్రాణం.

 

తన లోపాలున్నాయి.

తన చుట్టూ ఒక గ్రామం ఉంది.

తనకంటూ ఒక భక్తి ఉంది.

తనలో ఒక అపరాధ భావన ఉంది.

అంటే ముందుగా హీరో కాదు… ఒక మనిషి.

ఇదే మలయాళ సినిమాల్లో కూడా తరచూ కనిపించే పద్ధతి. హీరోను ఎంట్రీలోనే హీరోగా ప్రవేశపెట్టడంకంటే… ముందు అతన్ని మనిషిగా పరిచయం చేసి, ఆ తర్వాతకథానుగుణంగా అతనిలోని హీరోను బయటకు తీయడం… ‘ఇరుముడి’లో రవితేజ పాత్రకు కూడా అదే ప్రయత్నం కనిపిస్తుంది.

ఇరుముడి

అయ్యప్ప భక్తి కూడా కేవలం భక్తి కాదు … ఇంకో ముఖ్యమైన అంశం అయ్యప్ప దీక్ష… ‘ఇరుముడి’ అనే పేరే శబరిమల యాత్రతో ముడిపడి ఉంది… హీరో 41 రోజుల దీక్ష తీసుకోవడం కథలో కేవలం ఒక భక్తి ఎపిసోడ్ కాదు… అతని వ్యక్తిత్వ మార్పుకు అది ఒక భాగంగా ఉపయోగించారు… ఇక్కడ కూడా సినిమా మాస్ ఎలివేషన్ కోసం దేవుడిని వాడుకోలేదు…

భక్తి → నియమం → ఆత్మ నియంత్రణ → కుటుంబం → సమస్య … అనే దారి కథను నడిపింది… అయ్యప్ప భక్తి సంస్కృతి కేరళతో సహజంగా ముడిపడి ఉండటం వల్ల కూడా ఈ నేపథ్యానికి మలయాళ సినిమా జ్ఞాపకం రావడం సహజమే.

మలయాళీ నటులు + అయ్యప్ప నేపథ్యం + గ్రామీణ జీవితం + కుటుంబ భావోద్వేగం + పిల్లల చుట్టూ కథ + సహజమైన పాత్రల ప్రవర్తన… ఇవన్నీ ఒకే సినిమాలో కలిసినప్పుడు, కనిపించినప్పుడు ఆ వాసన ప్రేక్షకుడికి తగలకుండా ఉండదు… అందుకే స్వాసిక విషయంలో అసలు ఆసక్తికరమైన విషయం ఆమె విలన్‌లా కనిపించడం కాదు… ఒక మలయాళ నటిని తెలుగు ప్రేక్షకుడు కొత్తగా చూసినట్టనిపించడం కూడా సినిమా మొత్తం వచ్చిన ఆ కొత్త వాతావరణంలో భాగమే…ఇరుముడి

ఇప్పటివరకు ప్రేమ, కుటుంబం, సంబంధాలు, భావోద్వేగాలను తన సినిమాల ప్రధాన భాషగా చేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ… ఇప్పుడు అదే భావోద్వేగ భాషను ఒక థ్రిల్లర్‌లోకి తీసుకెళ్లాడు… సినిమా మొదటి భాగం నెమ్మదిగా పాత్రలను, వారి జీవితాలను పరిచయం చేస్తుంది… ఆ తర్వాతే కథ థ్రిల్లర్ వైపు మళ్లుతుంది… ఈ నెమ్మదైన నిర్మాణం, పాత్రల జీవితాల్లోకి ప్రేక్షకుడిని ముందుగా తీసుకెళ్లడం వల్లే మలయాళ డ్రామా ఫ్లేవర్ ఇచ్చింది…

అంటే… దర్శకుడు మాలీవుడ్ నుంచి కథ తీసుకున్నాడని కాదు… మాలీవుడ్ తరహా సెన్సిబిలిటీని తన తెలుగు కథలోకి తెచ్చినట్టుగా అనిపిస్తోంది… ఇదే ‘ఇరుముడి’లో అసలు కొత్తదనం కావచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !
  • ‘గ్లోబరీనా’ తవ్వకాలు షురూ ! కేటీయార్‌పైకి మరో అస్త్రం రెడీ !!
  • అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!
  • రాఖీకి ఈ ర్యాంప్ లుక్ ఎందుకు..? దారితప్పుతున్న క్రియేటర్లు…!!
  • కులం నిజం – వివక్ష నిజం – కులాధిపత్యం గుప్పిట్లో టాలీవుడ్‌ !!
  • రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?
  • రేవంత్‌ రెడ్డి చాణక్యం ! ‘తెలంగాణ ఆత్మగౌరవం’ ఎవడబ్బ సొత్తు ?
  • సారీ, వారణాసి రాజమౌళీ… నీ డబ్బింగ్ ఆలోచనల్లోనే తప్పుంది !!
  • వారణాసిలో పెద్ద కర్మ ! తంతు అల్లాటప్పా ఏమీ కాదు, అదొక పరీక్ష !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions