ఇద్దరు శోభన్ బాబుల సినిమా ఇది . ఒక శోభన్ బాబు పల్లెటూర్లో ఉండే నాటకాలరాయుడు, మరో శోభన్ బాబు నగరంలో ఉండే జువెల్ థీఫ్ (Jewel Thief ) . నాటకాలరాయుడికి జోడీ మంజుల . జువెల్ థీఫుకి జోడీ జయసుధ . ముగ్గురూ బాగా నటించారు . ముఖ్యంగా మంజుల , జయసుధలు చలాకీగా నటించారు . రెండు జంటల కెమిస్ట్రీ బాగా కుదిరింది .
అన్నదమ్ముల్లో ఒకడిని ఓ దొంగ ఎత్తుకుపోయి జువెల్ థీఫుని చేస్తాడు . సినిమా కదా ! ప్లేసులు మారుతారు . పెద్ద దొంగను ప్రభుత్వానికి పట్టిస్తారు . ఇద్దరు శోభన్ బాబులకు , వాళ్ళ చెల్లెలికి పెళ్శిళ్ళతో శుభం కార్డు పడుతుంది .
సినిమాల రాజధాని విజయవాడ , అప్పట్లో అసలు రాజధాని హైదరాబాద్ , చదువుల రాజధాని విశాఖపట్టణం , సాంస్కృతిక పట్టణం కాకినాడల్లో వంద రోజులు ఆడింది . ఈ సినిమా దర్శకుడు టి కృష్ణ ప్రకాశం జిల్లా ప్రతిఘటన కృష్ణ కాదు . ఈయన వరంగల్ జిల్లా కృష్ణ . మాజీ మంత్రి హయగ్రీవాచారి బంధువు . అలాగే ఈ సినిమా నిర్మాత టి త్రివిక్రమరావు NTR తమ్ముడు త్రివిక్రమరావు కాదు . ఈయన కూడా విజయవంతమైన సినిమాలను చాలానే తీసాడు .
Ads
(మొనగాడు పేరు కలిసొచ్చేలా బోలెడు సినిమాలొచ్చాయి… ఇదే పేరుతో 2022లో ఓ తెలుగు సినిమా రాగా, ఇక ఊరికి మొనగాడు (రెండు సినిమాలు), పల్లెటూరి మొనగాడు, మొనగాళ్లకు మొనగాడు, అందరికీ మొనగాడు, సిరిపురం మొనగాడు, మన్నెంలో మొనగాడు, అందరికంటే మొనగాడు, ఎవరు మొనగాడు, భలే మొనగాడు వంటి మొనగాళ్లు చాలామంది వచ్చారు… తెలుగు సినిమా టైటిళ్లలో మొనగాడు టైటిల్ ఇది…)
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగా ఉన్నా , బయట హిట్ కాలేదు . నాటకాలరాయుడు శోభన్ బాబు- జయసుధల సారంగధర నృత్య రూపకం అందంగా ఉంటుంది . మొనగాడా చినవాడా , వయసు ఉరకులు వేస్తుంటే , ఈరోజు అన్నయ్య పుట్టినరోజు , డబ్బా కారు అబ్బాయి గారు పాటలు బాగుంటాయి .
మామా రారా అనే పాట మంజుల మీద జానపద గీతం లాగా ఉంటుంది . ఏ జయమాలినో , జ్యోతిలక్ష్మో వేయాల్సిన ఐటమ్ డాన్సును మంజుల చేత వేయించారు . ఆమె కూడా బాగానే వేసింది .
ఈ సినిమా వంద రోజుల పోస్టర్ని చూసేటప్పుడు అనిపించింది . ఇప్పటి హీరోలయిన ప్రభాస్ , చిన్న NTR , మహేష్ బాబు , రాం చరణ్ , అల్లు అర్జున్ , పవన్ కల్యాణుల ముందు తరంలో హీరోలకు , హీరోయిన్లకు వంద రోజుల సినిమాలు చాలా ఉండేవి . ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద షిఫ్టింగులు లేకుండా , పోనీ షిఫ్టింగులతో , అసలెన్ని సినిమాలు వంద రోజులు ఆడుతున్నాయి !? ఇంక ముందు ఒక నెల ఆడితేనే గొప్పేమో ! నేను డబ్బుల గురించి మాట్లాడటం లేదు .
ఈ సినిమాలో తారాగణాన్ని కూడా బాగానే దించారు . అంజలీదేవి , కాంతారావు , రోజారమణి , శ్రీధర్ , రాజబాబు , రావు గోపాలరావు , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు , కె వి చలం , బాలయ్య ప్రభృతులు నటించారు . కలర్లో వచ్చిన ఈ సినిమా చూడబులే . చూడనివారు యూట్యూబులో చూడవచ్చు . శోభన బాబు , జయసుధ , మంజుల అభిమానులకు బాగా నచ్చుతుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…………. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article