.
విధి… చల్లగా చూడాలే గానీ… హఠాత్తుగా అదృష్టయోగం పడుతుంది, అదీ నమ్మలేని రీతిలో… మోనాలిసా కథ అదే కదా… కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ‘మోనాలిసా’గా గుర్తింపు పొందిన ఆ అమ్మాయి కథ తెలిసిందే కదా… నిన్నామొన్న హైదరాబాదులో మెరిసింది… ఎందుకొచ్చిందో చెబుతా గానీ…
అసలు పేరు మోనాలిసా భోంస్లే... ఆమె వయసు సుమారు 16 ఏళ్లు... ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా, మహేశ్వర్‌కు చెందిన అమ్మాయి… కుంభమేళాకు తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం పూసల దండలు అమ్ముకోవడానికి వచ్చింది…
Ads

వందా, రెండొందల రూపాయల సంపాదన కోసం పూసల దండలు అమ్ముకున్న ఆమె ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతోంది… వరుసగా యాడ్ షూట్లు చేస్తోంది… ఇన్‌స్టా ఫాలోవర్లు పెరిగారు… బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను స్వయంగా కలిసి తన తదుపరి చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur)లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు… మలయాళ సినిమా ‘నాగమ్మ’తో సౌత్ ఇండియాలో కూడా అడుగుపెడుతోంది…
గాయకుడు ఉత్కర్ష్ సింగ్ రూపొందించిన ‘సాద్గీ’ (Saadgi) అనే మ్యూజిక్ వీడియోలో కూడా ఆమె నటించింది… బ్రాండ్ ప్రమోషన్లు, యాడ్స్… తెలుగులో ఎవరైనా నిర్మాత ఆమెను తీసుకొస్తున్నాడో లేదో స్పష్టత లేదు గానీ… హైదరాబాద్‌లో ఒక హోటల్ (బేల్ ట్రీ) కిచెన్ విభాగాన్ని ప్రారంభించడానికి అతిథిగా వచ్చింది… ఆమెకు ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది…

బేల్ ట్రీ… అంటే బిల్వ వృక్షం… (బిల్వ అని పెడితే ఇంకా బాగుండేది హోటల్ పేరు)… శివుడికి ఇష్టమైన చెట్టు, ఆకులు… హోటల్ ప్రచారం కోసం కిచెన్ ప్రారంభం పేరిట మోనాలిసాను పట్టుకొచ్చారు… లోకల్ యాంకర్లు, తారలకన్నా మోనాలిసా అయితేనే ఆ టేస్ట్ డిఫరెంట్ అనుకున్నట్టున్నారు… ఆమెను చూడటానికి స్థానికంగా జనం ఎగబడ్డారు కూడా…
అసలు విషయంలోకి వెళ్దాం… అదే కుంభమేళాలో ఆమెను చూడటానికి, వీడియోలు తీయడానికి, సెల్ఫీలకు జనం ఎగబడటంతో భద్రతా కారణాలతో ఆమె తండ్రి మధ్యలోనే ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు… ఆమె ఆర్థిక కారణాలతో ఐదో తరగతితో చదువు ఆపేసింది కదా… ఇప్పుడు మళ్లీ చదువు కొనసాగిస్తోంది… అదీ విశేషం… మధ్యప్రదేశ్‌లోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది…

ఆ చదువుతోపాటు బాలీవుడ్ దర్శకుడి నేతృత్వంలో ముంబైలో నటనతోపాటు స్పోకెన్ ఇంగ్లిషులో కూడా శిక్షణ పొందుతోంది… మరి అక్కడే ఏదో ఓ కార్పొరేట్ స్కూల్‌లో చదువు కంటిన్యూ చేయొచ్చు కదా అంటారా..? ఏమో మరి… ఇప్పుడు ఏ తరగతో తెలియదు గానీ, తనకు గతంలో 5వ తరగతి దాకా చదువు చెప్పిన స్కూల్‌కే వెళ్తోంది…
తండ్రి చిన్న రైతు… తల్లి ఇప్పటికే చేత్తో తయారు చేసిన అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటుంది… మోనాలిసా నడమంత్రపు సిరి వాళ్లనేమీ మార్చలేదు… తమ పాత వృత్తుల్లోనే ఎప్పటిలాగే ఉన్నారు… కాకపోతే మోనాలిసా వాళ్లకు ఓ సొంత ఇల్లు సమకూర్చే పనిలో ఉంది…
ఎప్పటికైనా మా పనులు మావే అంటున్న ఆమె తల్లిదండ్రుల దృష్టిలో ఆమె బిల్వ వృక్షమూ కాదు, కల్ప వృక్షమూ కాదు... ఈ నడమంత్రపు వెలుగు ఎప్పటికీ ఇలాగే ఉండిపోదని వాళ్ల భయం, నమ్మకం... ఈ మొత్తం కథలో నాకు నచ్చింది ఏమిటంటే..? 16 ఏళ్లే కదా ఆమెకు, హఠాత్తుగా వచ్చిపడిన ఫేమ్, మనీని ఏం చేసుకోవాలో తెలియదు కదా... కానీ మోనాలిసా ఎంచక్కా భద్రంగా నిభాయించుకుంటోంది... గుడ్...
Share this Article