.
సోషల్ మీడియా…. అనగా యూట్యూబర్లు, సైట్లు… చివరకు ప్రధాన మీడియా అనుబంధ న్యూస్ వెబ్ సైట్లు కూడా వ్యూస్, రీడర్‌షిప్ పిచ్చిలో పడి ఎంత పైత్యం ప్రదర్శిస్తాయో చెప్పడానికి మోనాలిసా ఓ పక్కా, తాజా, బలమైన ఉదాహరణ…
అదేనండీ, కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే అమ్మాయి… ఆమెది ఇండోర్… సరే, ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ కళ్లల్లో పడ్డాయి ఆమె పిల్లి కళ్లు… ఏదడిగినా అమాయకంగా బదులిస్తోంది… మేకప్‌లోనే కనిపిస్తోంది…
Ads
ఇంకేముంది..? ఓ వేలంవెర్రి… అందరూ అక్కడికి వెళ్లడం, ఇంటర్వ్యూలు, మాటామంతీ, ఫోటో షూట్లు… ఆమె ఆరాధనలో స్నానాలు చేశారు వేలమంది… మీదమీద పడి… చివరకు ఏమైంది..? ఆమె వచ్చిన పని గంగలో కలిసిపోయింది…
ఈ ‘విజిటర్ల’ తాకిడికి తట్టుకోలేక ఆమె ఒక దశలో మాస్క్ వేసుకుని, దుపట్టాను మొహం చుట్టూ కప్పుకుని తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది… దాంతో ఆమెను పూర్తిగా టెంట్‌కే పరిమితం చేశారు… చివరకు ఆమెను స్వస్థలానికి పంపించేశారు…
మోనీ భోంస్లే ఆమె అసలు పేరు… సొంతంగా మోనాలిసా పేరిట ఓ ఇన్‌స్టా ఖాతా కూడా ఉంది… ఆధునిక యువతే… ఈ కుంభమేళా పుణ్యమాని దేశమంతా ఆమె పేరు మారుమోగిపోయింది… రీల్స్, షార్ట్స్ మొత్తం ఆమెవే కనిపిస్తున్నాయి… ఇప్పుడు ఆమె ఓ పాన్ ఇండియా స్టార్…
కానీ ఆమెకు వచ్చేదేమీ లేదు… ఎవరో బాలీవుడ్ దర్శకుడు నేను సినిమాలో చాన్స్ ఇస్తాను అంటున్నాడు… వెంటనే రాంచరణ్ రాబోయే సినిమాలో ఓ పాత్ర ఇవ్వబోతున్నారు అని మరో వార్త… ఒకడైతే ఏకంగా రాజమౌళి తీస్తున్న మహేశ్ బాబు సినిమాలో తీసుకున్నారని ఓ వీడియో చేసి పడేశాడు… (ఫాఫం వాళ్లకు కూడా తెలిసి ఉండదు…) హైదరాబాద్ వస్తున్నట్టు ఇంకో టీవీ స్టోరీ…!!
మరొకడు ఏకంగా ఆమె ఐఏఎస్ అధికారిణి అట… కుంభమేళా ఏర్పాట్ల పర్యవేక్షణకు రహస్యంగా వచ్చిందట… ఓ వీడియో వదిలాడు… రేపోమాపో ఆమె ‘రా’ ఏజెంటనీ, కుంభమేళాలో ఉగ్రవాదుల కదలికలు, చర్యల నిరోధానికి ఆ వేషంలో వచ్చిందనే వీడియో కూడా రావచ్చు… ఎవడికి ఏం తోస్తే అది వార్త…
ఒకావిడ శాలువా కప్పి ఫోటోలు దిగుతోంది… మరొకావిడ మేకప్ చేసి వీడియో తీసి మురిసిపోతోంది… ఒకడు ఆమె బొమ్మ గీస్తూ రీల్ చేస్తాడు… మరొకడు ఎఐ సహకారంతో ఆమెను రకరకాల వేషాల్లో చూపిస్తుంటాడు… ఇంకొకడు ఆమె హీరోయిన్ మెటీరియలేనా కాదా అని విశ్లేషిస్తుంటాడు… విషాదం ఏమిటంటే..? అలాంటి వీడియోలనే జనం విరగబడి చూస్తున్నారు… మోనాలిసా మొహం కనిపిస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తున్నయ్…
నిజానికి ఈ సినిమా చాన్సులు, మన్నూమశానం అన్నీ అబద్ధం… అవేవీ వర్కవుట్ కావు రియాలిటీలో… ఏదో కొన్నాళ్లు సోషల్ మీడియాలో ఈ ధూంధాం… అంతే… ఇప్పుడు కుమారీ ఆంటీని ఎవరు పట్టించుకుంటారు..? రేపు మోనాలిసా కథ కూడా అంతే..!! మరొకరు దొరికేవరకు, కాదు కాదు, మరో మూణ్నాలుగు రోజులు… అంతే..!!
Share this Article