.
పండుగల విషయంలో ఎప్పుడూ తలోమాట చెబుతూ, వివాదాల్ని రాజేసే అర్చక స్వాములు ఈమధ్య మరే కొత్త పంచాయితీ పెట్టడం లేదేమిటబ్బా అనుకుంటూనే ఉన్నాను… పెట్టేశారు… ఊరక ఊరుకోరు కదా…
30 అంటే మంగళవారం మాత్రమే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని వరంగల్ భద్రకాళి గుడి ప్రధానార్చకుడు శేషు చెబుతున్నాడు… తెలంగాణ విద్వత్ సభ చెప్పింది ఇదే అంటున్నాడు… ఎందుకయ్యా అంటే…
Ads
ఇది అష్టమి నాడు జరుపుకోవాల్సిన పండుగ… సోమవారం మధ్యాహ్నం అష్టమి వస్తుంది, మరుసటి రోజు అనగా మంగళవారం ఉదయం అష్టమి తిథి ఉంటుంది కాబట్టి 30న మాత్రమే జరుపుకోవాలనీ, సూర్యోదయం వేళ ఏ తిథి ఉంటే అదే ప్రామాణికం అని చెబుతున్నాడు…
నో, నో, అలా కాదు… 21న మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభించాం, ఇది 9 రోజుల పండుగ, సో, 29న అంటే, సోమవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని అదే వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ చెబుతున్నాడు…
దీంతో గందరగోళం నెలకొంది… ప్రభుత్వం మాత్రం 30న సద్దుల బతుకమ్మ నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది… మరి నిజంగా 9 రోజులు ప్రామాణికమా..? సూర్యోదయం నాటి తిథి ప్రకారమే అష్టమే ముఖ్యమా..? ఇంతకీ ఏ రోజు సద్దుల బతుకమ్మ..?
అసలు గుళ్ల అర్చకులకు ఎందుకు ఈ వివాదం..? ఊళ్లల్లో పౌరోహిత్యం చేసేవాళ్లు చెప్పినదాన్ని బట్టే పండుగలు నిర్వహిస్తుంటారు ప్రజలు… మునుపటి సంప్రదాయాల ప్రకారం వాళ్లు చెబుతుంటారు… అదే పాత వరంగల్ జిల్లా, దేవరుప్పలకు చెందిన పురోహితుడు వుప్పల రమేష్ శర్మ ఏమంటాడంటే..?
- ‘‘సోమవారం ఉదయం 11.47 నుంచి మంగళవారం పగలు 1.08 వరకు అష్టమి… శుభకార్యాలకు మాత్రమే సూర్యోదయాలు ప్రామాణికం… కానీ సద్దుల బతుకమ్మకు 9 రోజులు అనేదే ముఖ్యం… సోమవారం తొమ్మిదో రోజు కాబట్టి సోమవారమే సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం శ్రేష్టం… పైగా నిమజ్జనం వేళకు అష్టమి ఉంటుంది కదా…’’
నిజమే… ఇది ప్రధానంగా ప్రకృత్రిని గౌరమ్మగా పూజించే పండుగ లేదా సంప్రదాయం… కొన్నిచోట్ల ఎంగిలిపూల బతుకమ్మను ఓరోజు ముందుగానే పాటిస్తారు, కొందరు ఐదురోజులు, ఇంకొందరు ఏడు రోజులు… అందుకని ఎక్కడి పాత అలవాటును బట్టి, వాళ్లు నిర్వహించుకోవాలి… మరి 30న జరుపుకోవాలని ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఖరారు చేసిందో తెలియదు…
పైగా ఇలాంటివి కాస్త ముందుగానే అధ్యయనం చేసి, ఏదో ఓ తారీఖు ఫిక్స్ చేయాలి… తీరా రెండుమూడు రోజుల ముందు ఈ రాద్దాంతం లేవనెత్తడం ఓ గందరగోళానికి తెరతీయడమే…
- అన్నట్టు విజయదశమి అనగా దసరా మాత్రం రెండో తారీఖే అంటోంది ప్రభుత్వం… గాంధీజయంతి రోజున… నో మాంసం, నో మద్యం..! మహాత్మాగాంధీకి మాంసం, మద్యంతో ఏం సంబంధం అని రాగం తీయకండి.., కొన్ని ప్రభుత్వ తిక్క నిర్ణయాలు హేతువుకు నిలవవు..!! ఎందుకో మరో కథనంలో చెబుతా…
Share this Article