.
మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన… అన్నీ ఒకటే, వెరసి మూసీ ప్రాజెక్ట్..! మురుగుకాలువ దశ నుంచి మళ్లీ పూర్వపు నగరజీవనరేఖగా మార్చాలనే ఓ పెద్ద సంకల్పం… దాని చుట్టూ రకరకాల రాజకీయ నెగెటివ్ ప్రాపగాండా… అబద్ధాల వ్యాప్తి… అందుకే సీఎం స్వయంగా తనే అసలు నిజాల్ని, ప్రాజెక్టు లక్ష్యాల్ని, ప్రయోజనాల్ని పౌరసమాజం ఎదుట మైన్యూట్ డిటెయిల్స్ సహా ఏకరువు పెట్టడం మంచి రాజకీయ పద్ధతి, ప్రజాస్వామికం కూడా..!! హైదరాబాద్ నగరానికి మరో గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు ఇది…
వివరాల్లోకి వెళ్తే… ప్రభుత్వ సారథి, పాలకుడు ఏదైనా ప్రజోపయోగ ప్రాజెక్టును గానీ, పథకాన్ని గానీ చేపట్టినప్పుడు అతని బాధ్యత కేవలం దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు. ఆ ప్రాజెక్టు వెనక ఉన్న సంకల్పం, ఉద్దేశం, లక్ష్యం, ప్రయోజనాలు అన్నిటినీ ప్రజలకు సవివరంగా వివరించడం కూడా అంతే ముఖ్యమైన పని.
Ads
ఇంకో కీలక బాధ్యత కూడా ఉంది. ఎప్పుడూ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేసే నెగెటివ్ శక్తులు — ముఖ్యంగా రాజకీయ విపక్షాలు — జనంలోకి తీసుకెళ్లే తప్పుడు సమాచారం, మిస్ ఇన్‌ఫర్మేషన్, నెగెటివ్ ప్రాపగాండాను అడ్డుకోవడం. ఆ పని కూడా మరెవరికీ వదిలేయకుండా, ప్రభుత్వమే ముందుకు వచ్చి చేయాలి. అదీ మాటలతో కాదు… స్పష్టమైన సమాచారం, డేటా, ఆధారాలతో.
అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై — మైన్యూట్ డిటెయిల్స్, మ్యాప్స్, గ్రాఫ్‌లు, ప్రాజెక్ట్ అవుట్‌లైన్లతో పౌరసమాజానికి నిన్న ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చాడు… మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన — పేరు ఏదైనా కావొచ్చు. కానీ ఆ ప్రాజెక్టు గురించి ప్రజల్లో పెంచబడుతున్న సందేహాల్ని తనే నివృత్తి చేసే ప్రయత్నం అభినందనీయం… సరైన సమాచారం లేకపోతేనే అపోహలు, అదే జనం ముందుంచితే జనమే అర్థం చేసుకుంటారు… వాళ్లే బ్యాడ్ ప్రాపగాండాను తిరస్కరిస్తారు… గుడ్ డెసిషన్, గుడ్ మూవ్…

అపోహల అంకెలు… రాజకీయ ప్రచారం
మెయిన్ స్ట్రీమ్ మీడియా వీలైనంతవరకు సీఎం ప్రజెంటేషన్‌లో చెప్పిన వివరాలను ఇప్పటికే ప్రజలకు చేరవేశాయి… అందులో ఉన్న ఫిగర్స్, ఫాక్ట్స్, టెక్నికల్ డిటెయిల్స్ గురించి మళ్లీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు…
కానీ కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై విపక్షాలు — ముఖ్యంగా Bharat Rashtra Samithi — రకరకాల అంకెలతో, అనుమానాలతో, తప్పుడు సమాచారంతో ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. “మూసీ ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు” అని ఒకరు, “లక్షన్నర కోట్లు” అని ఇంకొకరు చెబుతారు.
“5 వేల కోట్లతో గాంధీ విగ్రహం ఎందుకు?” అని ఇంకొందరు ప్రశ్నిస్తారు.
ప్రభుత్వ వివరణ ప్రకారం గాంధీ విగ్రహ నిర్మాణ ఖర్చు 200 కోట్లను కూడా దాటదని చెబుతోంది… అలాగే గాంధీ సరోవర్ దాకా జరిగే పనుల మొత్తం ఖర్చు కూడా 5 వేల కోట్లకు లోపే ఉంటుందని అంటోంది… మరోవైపు “10 వేల ఇళ్లను కూల్చేస్తారు, ఇది విధ్వంస పాలన” అనే విమర్శలు చేస్తున్నారు విపక్ష నాయకులు… కానీ ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే — మూసీ ప్రవాహాన్ని ఆక్రమించి నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న పేదలకు మోడల్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పిస్తామని…
నాగరికతల్ని నిర్మించిన నదులు
నదులు ఉన్నచోటే నాగరికతలు పుట్టాయి. ప్రపంచ చరిత్ర చూస్తే పెద్ద నగరాలు అన్నీ నదుల చుట్టూనే ఎదిగాయి. ఒకప్పుడు సజీవంగా ప్రవహించిన Musi River కూడా హైదరాబాద్‌కు అలాంటి జీవనాధారమే. కానీ కాలక్రమంలో అది నగర డ్రైనేజీని మోసే కాలువగా మారిపోయింది.
దశాబ్దాలుగా పేరుకుపోయిన కాలుష్యం, ఆక్రమణలు, పరిపాలనా నిర్లక్ష్యం — ఇవన్నీ కలివ మూసీని ఒక మురుగు ప్రవాహంగా మార్చేశాయి. అలాంటి పరిస్థితి నుంచి మూసీకి మళ్లీ పూర్వరూపం తీసుకురావాలనే సంకల్పం వెనుక కీలక లక్ష్యాలకు తోడు అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి… సీఎం ప్రజెంటేషన్ అవన్నీ కవర్ చేసింది…

గ్లోబల్ సిటీ లక్ష్యంలో మూసీ
హైదరాబాద్‌ను నిజంగా గ్లోబల్ సిటీగా మలచాలనే పెద్ద లక్ష్యంలో భాగమే ఈ మూసీ ప్రాజెక్టు. కాలుష్య పరిశ్రమలను నగర పరిధి బయటకు తరలించడం, మెట్రో విస్తరణ, ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహం, ఫ్లైఓవర్లు — ఇవన్నీ నగరాన్ని ఆధునికంగా మార్చే ప్రయత్నాలే. అదే దిశలో మూసీ పునరుజ్జీవం కూడా ఒక కీలక భాగం… 1.25 లక్షల ఆటోలకు ఎలక్ట్రికల్ కిట్లు అమర్చే ఆలోచన కూడా ఉంది…
బాపు ఘాట్ – త్రివేణీ సంగమం
మూసీ ప్రాజెక్టులో అత్యంత భావోద్వేగ ప్రాధాన్యం ఉన్న ప్రదేశం బాపు ఘాట్. ఇక్కడే Mahatma Gandhi అస్థికల అవశేషాలు నిమజ్జనం చేశారు… అదే ప్రాంతంలో Esi River, Musi River సంగమం కూడా ఉంది… అలాంటి చారిత్రక ప్రదేశంలో గాంధీ సరోవర్ నిర్మాణం, అలాగే “గేట్ వే ఆఫ్ హైదరాబాద్” అనే ఆలోచన ఒక ప్రత్యేకతను తీసుకువస్తుంది…
ఇది కేవలం ఒక సుందరీకరణ ప్రాజెక్టు మాత్రమే కాదు. దశాబ్దాలుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన రిజర్వాయర్ల నుంచి బాపు ఘాట్ దాకా నదీప్రవాహాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఇంకా ఒక పెద్ద ఆలోచన కూడా ఉంది…
దూరంగా ఉన్న Godavari River జలాలను మూసీతో అనుసంధానం చేయడం. ఐదు నుంచి పది టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఈసా, మూసీ నదులతో సంగమింపజేస్తే — అది ఒక విధంగా త్రివేణి సంగమం లాంటి దృశ్యాన్ని సృష్టించగలదని అంటున్నారు… 2.5 టీఎంసీలు మూసీకి, మిగతావి హైదరాబాద్ తాగునీటికి… ఇది నెరవేరాలంటే కాళేశ్వరం బరాజుల మరమ్మత్తులు, హిమాయత్ సాగర్, గండిపేటల అనుసంధానం ముఖ్యం…
మూసీ ప్రక్షాళనలో కీలక అంశాలు
మూసీ పునరుద్ధరణలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. 1. మురుగునీరు నదిలోకి చేరకుండా అడ్డుకోవడం 2. నగరవ్యాప్తంగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం. ఈ రెండు చర్యలూ లేకుండా నదిని అందంగా మార్చే ప్రయత్నం కేవలం పైపూత సుందరీకరణగానే మిగిలిపోతుంది. ముందే చెప్పినట్టు పెద్ద టాస్క్ ఇది.,.
- ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి ఇప్పుడు నెగెటివ్ ప్రాపగాండాతో అడ్డుపడే బీఆర్ఎస్ అధినేత ‘‘హుసేన్‌సాగర్ మొత్తం ఎండబెట్టి, మంచినీటితో నింపి, దోసిళ్లతో తీసుకుని తాగేలా మారుస్తాం, ఆకాశహర్మ్యాలతో ఈ సాగర్ చుట్టూ నైట్ లైఫ్ డెవలప్ చేస్తాం’’ అన్నాడు… నిజంగా రేవంత్ రెడ్డి ఏదో చేయటానికి ప్రయత్నిస్తే ఇవే శక్తులు అడ్డుపడుతుంటాయి… అదీ ఐరనీ… (రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, ఇప్పుడిక కేటీయార్ అదే పనిచేస్తాడట… ప్రతిపక్షం అంటే అభివృద్ధికి అడ్డుపడటమేనా..?)

నల్గొండ రైతాంగం ప్రశ్న
హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యపు నీరు చివరకు వెళ్లేది నల్గొండ ప్రాంతానికే. అక్కడి రైతాంగానికి ఎందుకు ఆ మురుగునీరు దక్కాలి? అది భూగర్భ జలాలను ఎందుకు కలుషితం చేయాలి? అసలే నల్గొండ జిల్లా చాలా కాలంగా Fluoride Contamination సమస్యతో బాధపడుతోంది. అందుకే మూసీ పునరుద్ధరణను కేవలం నగర అభివృద్ధి కోణంలో కాకుండా — సామాజిక బాధ్యతగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
55 కిలోమీటర్ల మూసీ రివర్ కారిడార్
గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల మూసీ రివర్ కారిడార్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో కీలక భాగం. ఇది పూర్తయితే నగరానికి ఒక కొత్త రవాణా మార్గం లభిస్తుంది. ఇది సాధారణ రోడ్డు కాదు — నగర మధ్యలో నదిని అనుసరిస్తూ వెళ్లే ఒక సిటీ ఇన్నర్ రివర్ రోడ్. దీనికి “మూసీ రివర్ రోడ్” లేదా “మహాత్మా రివర్ రోడ్” వంటి పేర్లు పెట్టే ఆలోచన కూడా ఉంది.

పర్యాటకం, నైట్ ఎకానమీ
ఈ కారిడార్ నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తుంది — Charminar, Mecca Masjid, Telangana High Court, State Central Library Hyderabad. దీంతో ఇది ఒక ప్రత్యేక పర్యాటక మార్గంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని పెద్ద నగరాల తరహాలో మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి నైట్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం కూడా ఉంది. దీంతో పర్యాటకం పెరగడం మాత్రమే కాదు — యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవచ్చు.
హైదరాబాద్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం?
మొత్తానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కేవలం ఒక నది సుందరీకరణ కార్యక్రమం కాదు. ఇది నగర పర్యావరణం, రవాణా, పర్యాటకం, నీటి నిర్వహణ, ఉపాధి — అన్నింటినీ తాకే ఒక సమగ్ర ప్రణాళిక. నదులు నగరాల ఆత్మ అని అంటారు. అయితే ఒకప్పుడు జీవనాధారంగా ఉన్న మూసీ మళ్లీ నగరానికి లైఫ్‌లైన్‌గా మారుతుంది? అనుకున్నట్టుగా ప్రాజెక్టు కొనసాగితే… అది అవసరం… ఆచరణను కాలమే చెప్పాలి… కానీ ఒక విషయం మాత్రం నిజం — మూసీ భవిష్యత్తు అంటే హైదరాబాద్ భవిష్యత్తే…
Share this Article