కొత్తతరం వచ్చిందొక వెల్లువలా!
—————————————-
Happy birthday Vidura
… And the second son syndrome
———————————————–
అది 2016 ఆగస్ట్ ఎనిమిదో తేదీ.
చెన్నై నుంచి నాకో ఫోన్ వచ్చింది.
“నాన్నా, ఎవరో జ్యోతిలక్ష్మి అంట. చనిపోయింది. మా వాళ్ళు కవర్ చేయమంటున్నారు.
జ్యోతిలక్ష్మి అంటే ఎవరు? ఏం చేసేది?” అడిగినవాడు నా చిన్నకొడుకు. పేరు విదుర.
చెన్నైలో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో
ట్రైనింగ్ లో ఉన్నాడు.
జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత తెలీని ఒక అరసికుడు కొడుకైనందుకు పశ్చాత్తాపంతో రగిలిపోతూ, నా కడుపున చెడబుట్టావ్ కదరా అని లోన తిట్టుకుంటూ, “జ్యోతిలక్ష్మి చాలపెద్ద పాపులర్ డాన్సర్. సౌతిండియా ఫిల్మ్ స్టార్. జ్యోతిలక్ష్మి పాట, డాన్స్ లేకపోతే ఒకప్పుడు సినిమాలు ఆడేవి కావు, తప్పకుండా ఆ వార్త కవర్ చెయ్ నాన్నా” అని చెప్పాను.
ఊపిరి సలపని వేగంతో చేసే జ్యోతిలక్ష్మి నృత్యాలకి, ఆమె రాజేసిన శృంగారాగ్నికి ఏలూరు థియేటర్లు ఫెటేల్మని పేలి, దగ్ధమై, భస్మీపటలమై, చల్లారని బూడిదకుప్పలుగా మారిన దృశ్యాలు నాలో మెదిలాయి. అది 1966 – 70 . కాముని దహనం అంటే ఏంటో తెలీని వయసు. తొలి సెక్సుకోర్కెల చిరుదీపాలని యువరక్తపు చీకటి గుమ్మాలపై కవ్విస్తూ వెలిగించిన కనకమహాలక్ష్మి కదా మన జ్యోతిలక్ష్మి!
***
ఈ రోజు మా చిన్నకొడుకు విదుర జన్మదినం.
1994 ఆగస్టు25 న పుట్టాడు. 29 ఏళ్లిప్పుడు. 2015లో ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసాడు. వాడు
ఐ. ఐ. టీ లేదా సివిల్స్ రాయుట, డాలర్ల కోసం అమెరికా వెళ్ళుట… అలాంటివేమీ నేను ప్లాన్ చేయలేదు.
వీడసలు పనికిరాని వాడేగాక, ఎందుకూ కొరగాని దద్దమ్మ అనే సదభిప్రాయం నాపట్ల భార్య నళినీకి ఉండడం వల్ల, ఒక రోజు పొద్దున్నే జీ. ఎస్.రామ్మోహన్ అనే జర్నలిస్టుకి ఫోన్ చేసింది. ఇంటికొచ్చిన రామ్మోహన్ గారికి(ఇప్పుడు తెలుగు బీ .బీ. సీ ఎడిటర్)విదుర గాడిని పరిచయం చేసింది. ఆ మోహనూ, ప్రకాషూ అసలేమీ పట్టించుకోరు అని కూడా చెప్పే ఉంటుంది. రామ్మోహన్ విదురతో మాట్లాడి, ఈ బక్క కుర్రాడికి డొక్కశుద్ధి మరియు చదువు సంధ్యా కలిసి ఉన్నాయని కనిపెట్టి, చెన్నై ఏసీజే కి తక్షణం అప్లై చెయ్యమని ప్రోత్సహించాడు.
ఆ రోజు మోహన్ దగ్గర ఉన్న నాకు విదుర ఫోన్ చేసాడు. “1500 కావాలి” అన్నాడు. దేనికో? అంటే, ఏసీజేకి అప్లికేషన్ పెడుతున్నా అన్నాడు. చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం – ‘హిందూ’ దినపత్రిక వాళ్ళది. దేశమంతటా పరువూ ప్రతిష్టా ఉన్న పెద్ద సంస్థ. సీటు రావడం వీజీ కాదు. అయినా దొంగకొడుకు దొంగే అవ్వాలన్న రూల్ కి బద్ధుడై వీడూ జర్నలిస్ట్ కావడమేంటి? అని కొంత సంశయించాను.
కొన్నివేలమంది అప్లికేషన్ పెట్టుకున్నా ప్రతియేడూ 240మందిని మాత్రమే ఏసీజే కి రిక్రూట్ చేస్తారు. పదినెలల కోర్సు. అయిదులక్షల ఫీజు. మొదటి లిస్టులోనే విదుర నెగ్గుకొచ్చాడు. ఇంటర్వ్యూ కోసం ఒక్కడే చెన్నై వెళ్లి వచ్చాడు. సెలక్ట్ అయ్యాడు. ACJ ట్రైనింగ్ అంటే దేశం మొత్తం మీద నుంచి వచ్చిన ఇలాంటి స్టూడెంట్స్ ని, మొదట సోడాలో ఉడకబెట్టి, ఆనక ఉతికి ఆరేస్తారు. మిషనరీ జీల్ తో పని చేయడంలోని మజా ఏమిటో అప్పుడే తెలుస్తుంది.
Ads
జయలలిత చనిపోయిన వార్తని కూడా విదుర కవర్ చేసాడు. చెన్నై అపోలో ఆస్పత్రి గేటు ముందు మూడురోజులు పడరాని పాట్లు పడి జయ అంతిమవార్త వివరంగా రాసిచ్చాడు. ప్రసిద్ధ జర్నలిస్టులు పాలగుమ్మి సాయినాథ్, ఎన్. రామ్, హిందూ రవి, రచయిత కంచె ఐలయ్య గెస్ట్ లెక్చర్లు విన్నాడు. ప్రముఖ కాశ్మీరీ జర్నలిస్టు సుజాత్ బుఖారీ ప్రసంగం అద్భుతంగా ఉందని విదుర చెప్పాడు. కొన్నినెలల తర్వాత సుజాత్ బుఖారీని కాశ్మీర్ లో కాల్చి చంపేశారు.
ట్రైనింగ్ లో భాగంగా నోమ్ చోమ్స్కీ ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’ వీళ్ళతో చదివించారు. అలాగే నచ్చిన ఒక సబ్జెక్టుని బాగా చదివి, చిన్నపాటి థీసిస్ లాంటి డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి. విదుర ఓవర్ యాక్షన్ లో భాగంగా, ఆఫ్రికా దక్షిణప్రాంత దేశాల్లో తెల్ల ఖడ్గమృగాల ట్రోఫీ హంటింగ్ – ఒక పరిశీలన అంటూ అధ్యయన పత్రం రాసాడు. వేటగాళ్ళు సరదా కోసం వైట్ రైనోస్ ని చంపి, వాటి తలల్ని గొప్పగా ఇళ్లల్లో పెట్టుకుంటారు
గనక దాన్ని ట్రోఫీ హంటింగ్ అంటారుట.
నాలుగైదు వేల డాలర్లు పలికే ఈ ఖడ్గ మృగాల
వేట ఆ దేశాల్లో ఒక పెద్ద జాతీయ సమస్య.
***
మా అబ్బాయి లాంటి, ఆ వయసున్న, ఎగసి పడుతున్న ఒక కొత్తతరానికి గురజాడ, గుడిపాటి చలమూ, శరత్, ప్రేమచంద్ లూ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మీ, బాలమురళీ కృష్ణ, రావు బాలసరస్వతిదేవి, వీణ బాలచందర్, బాలాంత్రపు రజనీకాంతరావు…లాంటి సవాలక్ష మంది అస్సలు ఏమాత్రమూ సుతరామూ తెలీరు కదా అని ఒక దిగులు ఉండేది నాకు.
ఆల్బర్ట్ కామూ outsider బాగా నచ్చిందనీ ఒక కుదుపు కుదిపిందనీ విదుర చెప్పినప్పుడు నమ్మడం కష్టం అయింది. బాలగోపాల్ వ్యాసాలు చాలా చదివాననీ, బాగా నచ్చాయనీ చెప్పాడు. డప్పు రమేష్, సంజీవి, గద్దర్ గొంతుల్లో జీవం పోసుకున్న జన నాట్యమండలి పాటలు అంటే ఎంతో ఇష్టం వాడికి. అమెరికన్ బ్లాక్ సింగర్స్ పాటలు అదేపనిగా వింటాడు. మొదట rock నడిచింది.
విదుర అక్కా అని పిలిచే డాక్టర్ సమత కూతురు రచన వీడికి blues ని పరిచయం చేసింది.
బాబ్ మార్లే ‘రెగె’ కవ్విస్తే, “all i want to say is that they don’t really care about us” అని ఎగిరెగిరి పడే మైకేల్ జాక్సన్ పాటలు ఈ కుర్రాళ్ళని జలపాతాలుగా, తుఫాన్లుగా, ఉప్పెనలుగా మార్చేసాయి. బ్లాక్ సింగర్స్ ప్రొటెస్ట్ సాంగ్స్ వినడం వీళ్ళ ఫేవరేట్ పాస్ టైం. అమెరికన్ బ్లాక్ kendric lamar పాటలు విదుర పాడతాడు. ఒక తెల్ల పోలీస్ అధికారి, గొంతు మీద కాలేసి నొక్కి, జార్జి ఫ్లాయిడ్ ని చంపేసినపుడు, black lives matter అనే నినాదం ఉద్యమంగా మారినప్పుడు, లామార్ పాట, “we gon be alright” ప్రపంచాన్ని కుదిపేసింది. అలాంటి ప్రొటెస్ట్ పాటల్లో కసి, తిరుగుబాటు, ధిక్కారం ఈ యువ హృదయాన్ని కదిలించగలిగాయి.
***
“పెదనాన్నా” అంటూ విదుర, మోహన్ ఆఫీసు కొచ్చేవాడు. అదో మినీ కల్చరల్ సెంటర్. కవులు, ఆర్టిస్టులూ, జర్నలిస్టులు, పాడేవాళ్ళు, ఎందరితోనో మాట్లాడేవాడు. పుస్తకాలు, రాజకీయాలు, ఏ issue ని ఎలా చూడాలి? అని మోహన్ చిన్న లెక్చర్లు దంచేవాడు. మోహన్ దగ్గరే, గోరటి వెంకన్న, అరుణోదయ రామారావు, చింతలపల్లి అనంత్, లెల్లే సురేష్, శ్రీరామ్, పాండు, కేవీ… లాంటి ఎందరో పాటల్ని, పద్యాల్ని విన్నాడు. డిగ్రీ చదువుకునే కుర్రకుంకకి అది నిజంగా గొప్ప అనుభవం.
28 ఏళ్ళక్రితం…అసలు కథ…
సికింద్రాబాద్ ‘ఆంధ్రభూమి’ డైలీలో న్యూస్ ఎడిటర్ గా ఆనందంగా అని చేసుకుంటున్నా . ఎడిటర్ సీ. కనకాంబరరాజుకి డైలీ జర్నలిజం ఏమిటో ఏమీ తెలీదు గనక, బాధ్యత అంతా నాదే. నేనేం రాసినా, మొదటి పేజీ విన్యాసాలు చేసినా, “బ్రమ్మాండం…మీరు చేస్తే తిరుగే ఉండదు. పదండి, వో పెగ్గు తాగుదాం” అనేవాడు సికరాజు.
అప్పుడు, వారాసిగూడా, బౌద్దనగర్ లోని విశాలమైన ఫస్ట్ ఫ్లోర్ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆర్టిస్ట్ మోహన్ కొంతకాలం మా ఇంట్లోనే ఉన్నాడు. బొమ్మలేసుకుంటూ, సిగరెట్లు కాలుస్తూ, బ్లాక్ టీలు తాగుతూ, కబుర్లు చెబుతుండేవాడు. మాకు పది అడుగుల దూరంలో కార్టూనిస్టు సురేంద్ర ఇల్లు.
“తేరే మేరే సప్నే అబ్ ఎక్ రంగ్ హై…” అని నళినీ, నేనూ పాడుకుంటూ చల్లని సాయంకాలాల్లో వేడి కాఫీలు తాగుతున్న వేళల్లో, ఒకనాడు….
” డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా, మనకి మరొకడు పుట్టబోతున్నాడు” అని ప్రకటించింది. ముందు పిల్లవాడు కదా, ఈసారి ఆడపిల్ల అయితే బావున్ను అని ఏదేదో చెబుతోంది. నా కుడి దవడ కండరం బిగుసుకుంది… అదేదో నవల్లో లాగా.
కొంత ఉద్రేకపడి, కొంత ఆలోచించి, కొంత స్థిమితపడీ మర్నాడు నళినీకో క్లాసు తీశాను. “ఉన్న జనాభా చాలు, మనం మరొకణ్ణి add చేయనవసరం లేదు” అని . కొన్ని మాటలు తర్వాత నళినీ ఒప్పుకుంది. “సరే” అంది. తెలిసిన లేడి డాక్టర్ ని కలిసింది.
1994 జనవరి నెలలో…
ఒకరోజు తెలతెలవారుతుండగా అయిదు గంటలకి ముందే లేచాం. నేను రెడీ అయ్యాను. నళినీ రెడీ అవుతోంది. కాఫీ పెట్టమని మోహన్ గదిలోకి వెళ్ళాను. “ఏవిట్రా, పొద్దున్నే హడావుడి! లైట్లన్నీ వేసి ఉన్నాయి” అన్నాడు. “అబార్షన్ కోసం, నళినీని తీసికెళుతున్నాను. ఏమీ తినకుండా ఉదయం ఆరుగంటలకే రమ్మంది డాక్టర్” అని చెప్పాను.
“కాఫీ ఉందా, కూర్చోరా” అన్నాడు మోహన్.
“ఇవన్నీ ఇప్పుడెందుకు రా. ఇంకో కొడుకో, కూతురో ఉంటే ఏమవుతుంది? నాకూ ఇద్దరు పిల్లలు కదా. మీరు చిన్నవాళ్లేగా. అబార్షన్ ఏమిటీ! అంత అవసరం లేదురా. ఉండనీ…నళినీకి చెప్పు. పోనీ నేను చెప్పనా? ” అన్నాడు. మోహన్ ఎప్పుడూ రీజనబుల్ మాట్లాడతాడు. మౌనంగా ఉండిపోయాను. రెడీ అయ్యి, రెండు కాఫీలు పట్టుకొచ్చింది నళినీ. “హాస్పిటల్ లేదు. ఏమీ లేదు. నళినీ నువ్వు హేపీగా ఇంట్లోనే ఉండు. వీడితో మాట్లాడతాను” అన్నాడు మోహన్.
తర్వాత, ఆగస్ట్ 25న నర్సాపురం మిషన్ హాస్పిటల్లో పుట్టాడు విదుర. మొదటవాడికి డా. సమత, అనూర అని పెట్టింది గనక, చిన్నాడి పేరు విదుర అనింది నళిని. రెండు పేర్లలోనూ నా ప్రమేయం లేదు మరి.
నిజంగా మోహన్ ఆ రోజు ఆ మాట చెప్పకపోయి నట్టయితే… ఎంత ఆనందాన్ని కోల్పోయి ఉండేవాళ్ళమో – అనిపిస్తుందిపుడు.
పెద్దకొడుకు – కామ్ గా, కూల్ గా, బాధ్యతని మోస్తూ గంభీరంగా ఉండే ఒక పెద్ద అండ. అదే చిన్నకొడుకు అనేవాడు జోవియల్ గా, అల్లరిగా, flamboyant గా ఉంటాడు కదా!
మా ఇంట్లో నేనూ చిన్నకొడుకుని, నళినీ వాళ్ళింట్లో తను చిన్నకూతురు.
ఆ గారాన్నీ, స్వేచ్ఛనీ పొందాము. ఎదురు
చెప్పగల ధైర్యాన్ని ఎంజాయ్ చేసాము.
అదే రిపీట్. అనూర హుందాగా, అతితక్కువ మాటల్తో, కంపోజ్డ్ గా ఉంటాడు. విదుర జోకులేస్తూ, నవ్విస్తూ, తలతిక్కకీ ఒక ఫిలాసఫీ ఉంటుందన్నట్టే మాట్లాడతాడు గలగలా!
ఇద్దరు కొడుకులున్న తల్లుల్ని మీరు గమనించారా?
ఎంతో భరోసాతో, కొద్దిపాటి పొగరుతో, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. Its grinder and the gas stove, which have liberated womankind more than a thousand reformers – అని ఓ పెద్దాయన అన్నారు కదా. ఐతే చిన్నకొడుకు సిండ్రోమ్ అనేది కూడా స్త్రీకి గొప్ప తెగింపునీ, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. తల్లీ, చిన్నకొడుకూ, తండ్రి చిన్నకూతురూ అనే మంచి స్నేహాన్నీ, అనుభూతిని మించిన మాధుర్యం ఈ భూమ్మీద దొరకడం చాలా అరుదు.
విదురగాడి వల్ల మా ఇంట్లో అదే జరిగింది.
ఒక్కడిది కాదు. అన్ని కుటుంబాల
అనుభవమూ ఇదే అయ్యుంటుంది.
చరణ్ తేజ, అయేషా మిన్హాజ్, ఒయిషాని, రాహుల్ అరిపాక లాంటి న్యూ జెనరేషన్ ప్రోగ్రెసివ్ జర్నలిస్టులూ, గుత్తా రోహిత్ లాంటి కొందరు యాక్టివిస్టులూ విదురతో కబుర్లూ, సాయంకాలం పార్టీలకి మా ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళకున్న స్పాంటేనిటీ, క్విక్ రిపార్టీ, అవగాహన ఆశ్చర్యపరుస్తాయి. దేశ విదేశీ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలూ, సాహిత్యం, పాటలూ, మారుతున్న యూరప్ గురించి వాళ్ళ క్లారిటీ, డీటెయిల్,
ఊహా శిల్పం , కచ్చితమైన అభిప్రాయాలు
నన్ను ముగ్దుణ్ణి చేశాయి.
ఇంట్లో విదురని ‘జిగి’అని పిలుస్తాం.
‘అరె జిగ్గా’అంటుంది నళినీ. హైదరాబాద్ లో ఇప్పుడో మంచి ఉద్యోగం చేస్తున్నాడు జిగి.
చదువూ, పాటలూ, ఫ్రెండ్సూ… అంతే వాడి రొటీన్!
ఏం పుస్తకాలు చదివావో ఈ మధ్య కాలంలో అని విదురని అడిగాను… అలెక్స్ హేలీ రాసిన మాల్కమ్ ఎక్స్ బయోగ్రఫీ, గీతా రామస్వామి రాసిన memorable బుక్ ల్యాండ్, గన్స్, కాస్ట్, అండ్ వుమన్, Simone de Beauvoir రాసిన Ethics of Ambiguity… ఈ మూడు పుస్తకాలూ బాగా నచ్చాయి నాకు అన్నాడు .
కొసమెరుపు: ‘ప్రపంచ చిన్నకొడుకుల్లారా ఏకం కండి’ అని మనమూ ఓ స్లోగన్ coin చెయ్యొచ్చు.
‘World younger sons day’ జరపొచ్చని అమెరికన్ కార్పొరేట్ ధనపిశాచాలకి ఒక ఐడియా గనక ఇస్తే, వాళ్ళు ప్రతి యేటా ఈ పేరు మీద వేలకోట్ల డాలర్ల వ్యాపారం చేసేస్తారు.ప్రేమికుల రోజు , సీనియర్ సిటిజెన్స్ డే ని కనిపెట్టింది వాళ్లే మరి!…. Taadi Prakash … 9704541559
Share this Article