ఆమధ్య మంచు విష్ణు సినిమా ఒకటి వచ్చింది… దాని పేరు జిన్నా… మాంచి కసి హీరోయిన్లు సన్నీ లియోని, పాయల్ ఉన్నారు… కాస్తో కూస్తో కామెడీ ఉంది… అయితేనేం, టాలీవుడ్ ఈమధ్యకాలంలో ఎరుగనంత డిజాస్టర్ అది… కొన్నిరోజులైతే థియేటర్ల సింపుల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదు… జీరో షేర్… ప్రేక్షకులు అడ్డంగా ఈడ్చి తన్నడం అంటారు దాన్ని… అంతకుముందు మంచు మోహన్‌బాబు సినిమా ఒకటి కూడా అంతే… అది మరీ దారుణాతిఘోరం…
హిందీకి వెళ్తే కంగనా రనౌత్ నటించిన ధాకడ్ సినిమా గతి కూడా ఇలాగే… సో, కొన్ని డిజాస్టర్లు ఇలాగే ఉంటాయి… మరీ ఇంత ఘోరం కాదు గానీ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి, చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ మహానాయకుడు ఎట్సెట్రా బోలెడన్ని నష్టాల్ని మూటగట్టాయి… హీరో ఎంత తోపు అయితేనేం ప్రేక్షకుడికి నచ్చలేదంటే కథ బంగాళాఖాతమే… సేమ్, మలయాళంలో మోహన్‌లాల్ ఎంత వెటరన్ హీరో అయితేనేం, ఈ.జీగా 100 కోట్ల వ్యాపారం చేయగలిగిన స్టార్‌డం ఉంటేనేం… అలోన్ అనే సినిమా ఘోరంగా తన్నేసింది…
అలోన్ సినిమా మొదటి నాలుగు రోజుల వసూళ్లు చూద్దాం… మీరు నమ్మాలి… మొదటి రోజున 45 లక్షలు… సరే, పర్లేదు, చాయ్ బిస్కెట్ల ఖర్చు వచ్చిందీ అనుకుందాం… రెండోరోజు 8 లక్షలు, మీరు చదివింది నిజమే… 8 లక్షలు, మరుసటి రోజు కూడా సేమ్… షేమ్… నాలుగో రోజున కాస్త నయం 10 లక్షలు… వీకెండ్ కదా… నాలుగు రోజులు కలిపీ 71 లక్షలు దాటలేదు… ఫాఫం, అలోన్…
Ads
ఇదే ఇలా ఉంటే, ఇక ఓటీటీ, శాటిలైట్ టీవీ, ఓవర్‌సీస్ రైట్స్ కొన్నవాళ్లు ఎలా శోకాలు పెట్టబోతున్నారో చూడాలి… అలోన్, లోన్‌లీ పదాలు సిమిలర్ అనిపించినా సరే, కాస్త లోతుగా వెళ్తే రెండూ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్థాలిస్తాయి… మీ వెంట మంచికీ, చెడుకూ ఎవరూ లేనప్పుడు మీరు ఒంటరివాళ్లు (అలోన్)… అందరూ ఉన్నాసరే ఎవరూ లేనట్టు ఫీలయ్యే సందర్భాల్ని ఒంటరితనం (లోన్‌లీనెస్) అనాలేమో… సహఅనుభూతి కోసం చుట్టూ వేరే ప్రేక్షకులు చాలామంది ఉన్నా సరే మీరు అలోన్ అనే ఈ సినిమాను చూస్తుంటే అకస్మాత్తుగా ఒంటరితనం ఆవహించినట్టు ఫీలవుతారు…
ఈ సినిమా చూస్తుంటే అదోరకం భావన… మీరు హఠాత్తుగా ఆ సినిమా పేరులాగే అలోన్ అయిపోతారు… పైగా అది మీకిష్టమైన హీరో సినిమా అయితే, అది చికాకుపెడుతుంటే, అలోన్ చుట్టూ అంతుచిక్కని లోన్‌లీనెస్… ఏమోనబ్బా… ఈ బాష్యాలు గందరగోళంగా ఉన్నాయి, అర్థం కావడం లేదు అంటారా..? సినిమా కూడా అంతే… అందుకే ఆ సినిమా నడిచే థియేటర్ల వైపు వెళ్లడానికే జనం భయపడి చస్తున్నారు… అంతా మోహన్‌లాలే… మిగతా వాళ్లంతా జస్ట్, అలా వచ్చి వెళ్తుంటారు… చివరకు మోహన్‌లాల్ డై హార్డ్ అభిమానులు కూడా వణికిపోతున్నారు…
అలోన్… ప్రముఖ దర్శకుడు, షాజీ కైలాస్, లెజెండరీ నటుడు మోహన్ లాల్ నుండి ఊహించదగిన చిత్రమైతే కాదు… ఒక అపార్ట్‌మెంట్ లోపల మోహన్‌లాల్… దేశవ్యాప్తంగా కోవిడ్-ప్రేరిత లాక్‌డౌన్… ఈ నేపథ్యంలో, అలోన్ మొత్తం కథ ఈ పాత్ర కాళిదాస్ (మోహన్‌లాల్) చుట్టూ తిరుగుతుంది. అతను గతంలో అద్దెదారులుగా ఉండి, చనిపోయిన తల్లి, ఆమె బిడ్డ గొంతులను వింటుంటాడు… తన ఇంట్లోని ఈ పారా-నార్మల్ యాక్టివిటీకి భయపడతాడు…
ఈ సినిమా మర్డర్ మిస్టరీగా సాగుతుంది… స్క్రీన్‌ప్లేలో ఉత్కంఠభరితమైన సీన్లను జొప్పించడం ద్వారా ఇది మిమ్మల్ని థ్రిల్‌కు గురిచేయాలని అనుకుంటాడు దర్శకుడు… కానీ అసంబద్ధమైన ట్రాన్సిషనల్ సంగీతం, విచిత్రమైన కెమెరా యాంగిల్స్‌తో, ముఖ్యంగా మోహన్‌లాల్ కళ్లలోకి జూమ్ చేసేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.., మీరు ఏవైనా భ్రమలకు గురవుతున్నారా లేక ఒక సినిమా చూస్తున్నారా మీరే ప్రశ్నించుకుంటారు. ఓచోట మోహన్‌లాల్ అంటాడు… ఒకేచోట చాన్నాళ్లు ఉండిపోతే ఇక ఉండలేనంత విసుగు ఆవరిస్తుందని… నిజమే, మోహన్‌లాల్ సినిమాలు చూసీ చూసీ మనకూ ఆ ఫీల్ ఆవరిస్తుందేమో…
Share this Article