కేసీయార్ బర్త్ డే యాగం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తాయి కదా… అదేనండీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఓ బహిరంగ సభ స్థాయిలో ఓ ప్రత్యేక యాగం నిర్వహింబోతున్నారు అని చెబుతున్నారు కదా… ఆ ఆది శ్రవణ యాగం అనగానేమి..? అసలు ఇంతవరకూ ఆ యాగం పేరే ఎవరూ వినలేదు కదా..? అనే ప్రశ్నకు ఆయనే నిన్న ఓ క్లారిటీ ఇచ్చాడు విలేకరులకు… పనిలోపనిగా ఓ చిన్న అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్ కూడా విడుదలైంది… ఒక్కసారి ఈ యాగం గురించి ఆయన వివరణ ఏమిటో చదువుదాం… అది ఆది శ్రవణ యాగం కాదు, అధి శ్రవణ యాగం అట..! (అతి రాత్రం తరహాలో అధి శ్రవణం కూడా చరిత్ర గర్భంలో దాగి ఉన్న యాగమేమో బహుశా… తెలంగాణలో పెద్ద పెద్ద పండితులే ఈ పేరు విని తెల్లమొహాలు వేస్తున్నారు…)
‘‘అధి శ్రవణుడు అంటే ఎవరో కాదు పరమేశ్వరుడు.. తన భక్తుల యొక్క అర్తులను విన్న వెంటనే వారిని అనుగ్రహించే దైవం అని అర్థం. ఈ యాగం గురించి అన్ని విషయాలు ప్రాచీన తంత్రాలలో అతి రహస్యంగా చెప్పబడింది… అంతే కాకుండా 600 ఏళ్లకు ముందు కేరళలో ఈ యాగాన్ని చేయటం జరిగింది… మళ్ళీ ఇప్పుడు ఆ రహస్యమైన యాగాన్ని తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు లోక కళ్యాణర్థo నా ద్వారా చేయాలనీ సంకల్పo జరిగింది… కరోనా వల్ల జనాలు అనేక కష్టాలు పడ్డారు… ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు అన్న విషయం మన అందరికి బాగా తెలుసు… అందుకే ఇటువంటి వైపరీత్యాలు జరగకుండా ఈ అధి శ్రవణ మహాయాగం చేస్తున్నం… ఇందులో లోకాన్ని పాలించే 11 మంది రుద్రులకు సంబంధించిన మూల మంత్రాలతో విధి విధానంగా జరిపే ఒక ప్రక్రియ….ఇది సాధారణమైన పూజలు చేస్కునే వారికీ తెలిసే అవకాశమే లేదు… కేవలం ఒక యజుర్వేదంలోనే 1000 శాఖలు ఉన్నాయి అని జెప్పుకుంటున్నాం కానీ మనకి తెలిసినవి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం 2 మాత్రమే… మిగిలినవి సరైన ఆదరణ లేక అంతరించి పోయాయి అని జెప్పుకుంటున్నాం… ఇప్పుడు మన దగ్గర లేనంత మాత్రాన అవి లేనట్టు కాదు కదా… మనకి తెలియనివి ఎన్నో గొప్ప గొప్ప యాగాలు, వాటి విధానాలు తంత్ర శాస్త్రాల్లో ఉన్నాయ్… సరయిన విధానాలతో అవి చేస్తే లోకానికి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాము… అందుకే అందరూ ఇటువంటి దైవకార్యానికి సహాయపడండి…’’
Ads
హమ్మయ్య… ఆ వివరణ లోతుపాతులకు వద్దు గానీ… కేసీయార్ ఆరోగ్యం కోసం, 600 ఏళ్లుగా మనకు తెలియకుండా పోయిన ఓ ప్రాచీన తంత్ర యాగాన్ని నిర్వహిస్తున్నారన్నమాట… వావ్, భేష్… కానీ ఈ ప్రచారసామగ్రిలో ఏం రాశారంటే..? కేరళ నంబూద్రి బ్రహ్మాణులకే పరిమితమైపోయిన ఈ తంత్రయాగం వెలుగులోకి తీసుకొస్తున్నాం… బాగుంది… కానీ ఈ రశీదులు ఏమిటో అర్థం కాలేదు రెడ్డి గారూ… ఎడమ వైపు కేసీయార్ కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టారు, మీ విధేయత అభినందనీయం… అధి శ్రవణమంటే పరమేశ్వరం అని చెబుతూ, అమ్మవారి ఫోటో పెట్టి, అసలు శివుడి బొమ్మే లేదేం సార్..? ఓహో, మరిచిపోయారా..? అవునూ, ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే యాగమా..? రాష్ట్ర ప్రభుత్వ లోగో, స్పోర్ట్స్ అథారిటీ లోగో కూడా పెట్టేశారు… అందులోనే ఓ ముక్క రాశారు… ‘రాజకీయాల్లో ముఖ్య స్థానం వరించడం’ ఈ యాగం ఉద్దేశం అని… అంటే కేటీయార్ సీఎం కావడం కోసమేనా ఈ యాగం..? మరి కేసీయార్ బర్త్ డేకు లింకు దేనికి..? తెలంగాణ పచ్చగా ఉండటానికి అని కవరింగు కథలు దేనికి..? అయ్యా, అసలు ఆ పైన ముద్రించిన ఆ ముగ్గురు స్వాములు ఎవరు..? అధి శ్రవణ యాగానికీ వాళ్లకూ సంబంధం ఏమిటి..? దిగువన ముద్రించిన స్వాములు ఎవరు..? ఈ మొత్తం యవ్వారానికీ సూత్రధారులా..? హేమిటో లెండి, కేసీయార్ పేరు మీద చేస్తున్నారు కదా, ఇక అడ్డేముంది..? అడిగే గొంతేముంది..?!
Share this Article