అదేమిటో కాంగ్రెస్ క్యాంపులో చేరనున్న ప్రశాంత్ కిశోర్ అంటూ ఓ వార్త వచ్చింది… ఎవ్వడూ పట్టించుకోలేదు పెద్దగా… సోషల్ మీడియాలో చర్చ కూడా లేదు… ఆమధ్య అన్ని రాష్ట్రాల్లోనూ తన టీంలోకి వందలాది మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా వార్త వచ్చింది… అదీ ఎవ్వడూ పట్టించుకోలేదు… నిజానికి ఇది నిజమే అయితే కాస్త ఇంట్రస్టింగ్ డిబేట్ జరిగి ఉండాల్సింది… ఎందుకంటే, తన చేతిలో మంత్రదండం ఉంది, ఎవరినైనా గెలిపించగలడు అనే ఓ ఫేక్ హైప్ తన చుట్టూ క్రియేటై ఉంది కాబట్టి…
ఏపీలో జగన్‌కు వర్క్ చేశాడు కాబట్టి, తెలంగాణలో కేసీయార్ కూడా పీకేతో వర్క్ చేయించుకుంటున్నట్టు చెప్పాడు కాబట్టి… పీకే కాంగ్రెస్ క్యాంపులో చేరితే సమీకరణాలు కాస్త మారే చాన్సుంది కాబట్టి…. సరే, కేసీయార్ ఏదో చెబుతాడు… ఏడెనిమిదేళ్లుగా పీకే తెలుసు నాకు, పుణ్యానికే సేవ చేస్తాడు, డబ్బులు తీసుకోడు అని ఏదో అంటాడు కానీ తన ముందుండే నిర్జీవమైన ఆ మైక్ కూడా నమ్మదు ఆ మాటల్ని…
Ads
అసలు ఎన్నికల వ్యూహకర్తృత్వం అనే దందా తొలిసారిగా స్టార్ట్ చేసిందే పీకే… సోషల్ టీమ్స్ పెట్టి, సర్వేలు చేస్తూ, బ్రాండింగ్ చేస్తూ, స్లోగన్స్ సృష్టిస్తూ, ప్రత్యర్థులపై బురద జల్లుతూ, పైసలిచ్చిన కస్టమర్‌కు క్యాంపెయిన్ చేస్తూ, ఈ దిశలో ఫేక్ పోస్టులనూ ఆశ్రయిస్తూ, నానా కథలు పడుతూ దీన్ని ఓ అనైతిక వ్యాపారంగా మార్చిందే తను… నిజానికి తను అపజయమెరుగని కేరక్టర్ ఏమీ కాదు… తనను నమ్మినందుకు ఉత్తరప్రదేశంలో కాంగ్రెస్ చేతులూమూతులూ కాలిపోయినయ్ గతంలో…
ముందుగా ఓ విషయం చెప్పుకోవాలి… ఈ వ్యాపారంలో తనకు నైతికత అనేదేమీ ఉండదు, అలాంటి వ్యర్థ పదాలకు తనేమీ కట్టుబడి ఉండడు… ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్‌తో ఒప్పందాలు ఉన్నయ్ కదా… అదే సమయంలో అన్నాడీఎంకే, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు కూడా వర్క్ చేయడానికి సిద్ధపడ్డాడు… జగన్, స్టాలిన్, మమత కేవలం పీకే వల్ల గెలవలేదు… చాలా కారణాలున్నయ్… ఠాక్రేది పూర్తి గెలుపేమీ కాదు… సరే, తెలుగు రాష్ట్రాలకు వద్దాం…
కేసీయార్ కోసం వర్క్ చేస్తానంటున్నాడు… కానీ మిగతా నాయకుల్లాగా కేసీయార్ పీకే చెప్పినట్టలా చేసే నాయకుడు కాదు… తనే పెద్ద వ్యూహకర్త… కేసీయార్ లెక్కలు, విధేయతల సమీకరణాలు వేరే ఉంటయ్… పీకే ఓ లిస్టు ఇచ్చేసి, వీళ్లను వదిలించుకో అనగానే తనేమీ వినడు… తను టీఆర్ఎస్ వర్క్ కంట్రాక్టులో కంటిన్యూ అవుతాడా అనేది డౌటే… ప్రస్తుతానికి వస్తే గుజరాత్‌లో ఒకవేళ కాంగ్రెస్‌కు వర్క్ చేసే పక్షంలో… అది కేవలం ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాబోదు… రాబోయే జనరల్ ఎలక్షన్స్ కోసం మొత్తం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వర్క్ చేస్తాడేమో…
మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉండే టీఆర్ఎస్‌కు తను ఎలా వర్క్ చేయగలడు..? పోనీ, ఇటు టీఆర్ఎస్‌కు అటు కాంగ్రెస్‌కు ఏకసమయంలో వర్క్ చేస్తానంటే కేసీయార్ అంగీకరించడు… ఏమో, టీఆర్ఎస్‌ను యూపీయే వైపు తీసుకుపోతే తప్ప… కానీ తెలంగాణలో ప్రస్తుతం ఆ సిట్యుయేషన్ ఏమీ లేదు… కాంగ్రెస్‌కు వర్క్ చేస్తాను అంటే ఏపీలో జగన్‌కు పోయేదేమీ లేదు, కానీ తను కాంగ్రెస్‌ను, సోనియా నాయకత్వాన్ని అసహ్యించుకుంటాడు కాబట్టి పీకే కాంగ్రెస్‌కు వర్క్ చేయడాన్ని ఇష్టపడడు…
మొన్నమొన్నటిదాకా కేసీయార్ ఆలోచనల్లాగే… నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫ్రంటుకు రూపకల్పన చేయాలని పీకే కలలుగన్నాడు… పలు పార్టీల నేతలను కలిశాడు… సంప్రదింపులు చేశాడు… ఇసుక తక్కెడ, పేడ తక్కెడ… ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక మీదకు రావడం కల్ల… ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్‌ను తీసుకొండి, వీళ్లతో కలుస్తాడా..? నెవ్వర్..! ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క బ్యానర్ కిందకు వచ్చినా సరే, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ నాయకత్వం లేకుండా బీజేపీని ఎదుర్కోవడం కష్టం… అఫ్‌కోర్స్, ప్రాంతీయ పార్టీల కూటమి మళ్లీ పాలించే స్థితి వస్తే వీపీసింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ కాలంలో దేశం ఎలా వెనక్కి వెనక్కి పోయిందో చూశాం కదా…
కాంగ్రెస్ పార్టీతో అనుబంధం లేకుండా, ఓ ప్రొఫెషనల్‌గా వర్క్ చేయడానికి అంగీకరించాడు అని ఓ వార్త… నెవ్వర్, అది సాధ్యం కాదు… పనిచేసేదే పార్టీ కోసం అయినప్పుడు అనుబంధం ఎందుకు ఉండదు..? పైగా కాంగ్రెస్‌కు వర్క్ చేయడం తనకేమీ కొత్త కాదు… ఆమధ్య పంజాబ్ సీఎం అమరీందర్‌కు ప్రధాన సలహాదారుగా సర్కారీ జీతం కూడా తీసుకుని వర్క్ చేశాడు… ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో లేదా యూపీయేతో భారీ ఒప్పందం గనుక కుదిరితే… కేసీయార్‌తో కలిసి వర్క్ చేయడం సందేహాస్పదమే..!!
బెంగాల్ ఎన్నికలప్పుడు బీజేపీకి సవాళ్లు విసురుతూ… ఇక ఐప్యాక్ పనుల్లో వేలుపెట్టబోననీ, ఈ దందాను వదిలేస్తాననీ అన్నాడు… రాజకీయ నాయకులతో తిరిగీ తిరిగీ ‘‘మాటపై నిలబడకపోవడం’’ అనే క్వాలిటీని సంపాదించుకున్నాడు… ఆ ఒట్టును గట్టుపైకి పారేశాడు… అయినా తను కూడా ఓ పొలిటిషియనే కదా… బీహార్‌లో నితిశ్ తన వారసుడిగా ఎంపిక చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంటే, తన్నేసి బయటికి వచ్చాడు కదా… ఒప్పందాలకు కమిటైపోయి, ఒకే పక్షానికి డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాడని ఎవరైనా నమ్మితే అది వాళ్ల ఇష్టం… అంతే…!!
Share this Article