గుర్తుందా ఓరోజు… అభిజిత్ అమ్మ లక్ష్మి తనను చూడటానికి హౌస్‌కు వచ్చింది… ఇక్కడ గొడవలన్నీ తాత్కాలికమే అమ్మా, మళ్లీ కలుస్తాం అని అవినాష్ ఏదో చెప్పబోతుంటే… కొట్టుకొండిరా, లేకపోతే ఆటలో మజా ఏముంటది..? అన్నదామె… గ్రేట్… ఆట స్పిరిట్ ఒక్క ముక్కలో చెప్పేసింది… ఆడుకొండి, కొట్టుకొండి, మజా పంచుకొండి… ఆ నిమిషంలో ఆమె బిగ్‌బాస్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకుంది…
ఈరోజు ఆమె మళ్లీ ఆకట్టుకుంది అందరినీ… వేదిక మీద తన కొడుకు ట్రోఫీతో నిలబడాలని ఆమెలోని అమ్మ కోరుకోవడం సహజమే… కానీ కొడుకు గెలిచాక, చిరంజీవి-నాగార్జునలను ఓ కోరిక కోరుతూ… అభిజిత్‌తోపాటు అఖిల్‌ను కూడా మీఅంతటివారు కావాలని ఆశీర్వదించండి అనడిగింది… ఒక్క అభిజిత్‌నే కాదు, అఖిల్‌ను కూడా ఓన్ చేసుకుని ఆ కోరిక కోరింది… ఎస్, ఆ అమ్మ అప్పుడు నిజంగా గెలిచింది… ఓడిపోయిన వాడిని అనాథగా వదిలేసేవాళ్లు వ్యర్థులు… ఇలా కలుపుకునేవాళ్లే ప్రశంసనీయులు…
ఆ అమ్మ కొడుకే కదా అభిజిత్… సేమ్, ఆ హుందాతనమే… అదే తనను గెలిపించింది… బిగ్‌బాస్ ప్రేక్షకులు కేవలం ఫిజికల్ అప్పియరెన్స్, స్ట్రాంగ్ నెస్, రఫ్ నేచర్, దూకుడు మాత్రమే చూడరు… రకరకాల ఎమోషన్లు ముంచెత్తినప్పుడు కూల్‌గా నిలబడి, తోటి కంటెస్టెంట్లతో కూడా కలబడి కొట్లాడుతూనే, అవసరమైనప్పుడు వాళ్ల పక్కనే నిలబడి, భుజంపై చేయివేసి భరోసాగా నిలబడి, ధైర్యం చెప్పడం… అభిజిత్‌కు బాగా కలిసొచ్చింది…
Ads
నిజానికి అభిజిత్ గెలుపు గురించి రాసుకోవడం, చెప్పుకోవడం ఒకరకంగా వేస్ట్… అందులో థ్రిల్ లేదు… సస్పెన్స్ లేదు… మజా లేదు… ఎందుకంటే, ఓ మంచి పీఆర్ టీఎం పెట్టుకోవడంతోనే తను విజేతగా ఫస్ట్ అడుగువేశాడు… చాలా ఖర్చు పెట్టినట్టున్నాడు… దానికి తగినట్టే హౌస్‌లో తనదంటూ ఓ గేమ్ ప్లాన్ అమలు చేస్తూ వచ్చాడు… అది సక్సెసైంది… తను అర్హుడే… అయితే అది చాలారోజుల క్రితం నుంచీ వినిపిస్తున్నదే… తనే విజేత అని అందరూ అనుకుంటున్నదే…
అందుకే చిరంజీవి వచ్చి ట్రోఫీ ప్రజెంట్ చేయడం అనేది ఓ ఫార్మాలిటీ… విజేతగా ప్రకటించడం దాకా జరిగిన తంతు ఓ ఫార్మాలిటీ… అలాగని అఖిల్‌ను తేలికగా తీసిపారేయనక్కర్లేదు… ఏ సందర్భంలోనూ తను ఆట స్పిరిట్‌ను కోల్పోలేదు… మొండిగానే నిలబడ్డాడు… ఆట అంటే అంతే… ఒకరే విజేత ఉంటారు, మరొకరు రన్నరప్‌గా మొహం వంచుకోవాల్సిందే…
బిగ్‌బాస్ నాలుగో సీజన్ నిజానికి ఓ ఫ్లాప్ షో… కంటెస్టెంట్లు ఎంపిక, గేమ్స్, టాస్కుల ఎంపిక చాలా పూర్… చాలా తప్పులు దొర్లాయి… కొన్నివారాలయితే మరీ దయనీయంగా రేటింగ్స్ వచ్చాయి… ముంబై టీం పూర్తిగా లోకల్ టీం మీద ఆధారపడటం ఓ కారణం కావచ్చు… సరే, కరోనా జాగ్రత్తలు కూడా ఆ టీంకు అడుగడుగునా సవాళ్లు విసిరింది కావచ్చు… కానీ ఇన్నాళ్ల పూర్ షోను ఫినాలే గ్రాండ్ షోతో ఓవర్ కమ్ చేయడానికి ప్రయత్నించారు…
దాదాపు అయిదు గంటలపాటు సాగిన మారథాన్ షో బహుశా 24 రేటింగ్స్ దాటవచ్చునని అంచనా వేస్తున్నారు… తెలుగు ప్రేక్షకులు నిజంగానే టీవీలకు అతుక్కుపోయారు… గ్రాండ్ ఫినిషింగ్… నిజంగా 24 రేటింగ్స్ దాటితే మాత్రం అది తెలుగు టీవీ తెరకు సంబంధించి ఆల్ టైమ్ రికార్డు అవుతుంది… ఈమేరకు యాడ్స్ కూడా కుమ్మేశారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే చివరిరోజు తమ ఖర్చంతా రికవరీ అయ్యేలా మింట్ చేసుకున్నారు… ఎస్, అంగీకరిద్దాం… బిగ్గెస్ట్ రియాలిటీ షో… షో…!!
Share this Article