.
Subramanyam Dogiparthi …….. మౌనపోరాటం , ప్రతిఘటన , మయూరి వంటి సందేశాత్మక చిత్రాలను , ఆణిముత్యాలను అందించిన ఉషాకిరణ్ మూవీస్ వారిని అభినందించాలి . మయూరి ఎలా అయితే సుధా చంద్రన్ నిజ జీవిత కధ ఆధారంగా తీయబడిందో అలాగే ఒరిస్సా లోని సంబల్పూర్ జిల్లాలోని కుల్తా నువపల్లి (ఊరి పేరు కరెక్టుగానే వ్రాసాననుకుంటా) అనే గ్రామంలోని గిరిజన యువతి సబిత బదేహి నిజ జీవిత కధ ఆధారంగా ఈ మౌనపోరాటం తీయబడింది .
సినిమాలో కధలాగానే సినిమా కూడా ఓ సెన్సేషనల్ మూవీనే అయింది . ఒక ఊపు ఊపింది . రెండు నంది అవార్డులు వచ్చాయి . రెండవ ఉత్తమ చిత్రంగా , బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనింగుకు అవార్డులు వచ్చాయి .
గాంధీగిరి అంటే ఏమిటో తెలుపుతుంది . సినిమాలో కూడా గాంధీ గారి బొమ్మ కిందనే కూర్చొని మౌనపోరాటం చేస్తుంది . సత్యాగ్రహం చేస్తుంది . అహింసాయుతమైన సత్యాగ్రహానికి కల అపారమైన శక్తిని చూపుతుంది . హింస సత్వర సంతృప్తిని ఇవ్వొచ్చు . కానీ సమస్య యొక్క కారణాన్ని రూపుమాపదు . అలాంటి సత్యాన్ని చెపుతుంది ఈ సినిమా .
Ads
బహుశా ఈ సినిమా కధ తెలియని వారు ఉండరేమో ! చూడనివారు కూడా ఉండరేమో ! ఒక బస్తీ బుల్లోడు ప్రభుత్వ అధికారిగా అనంతగిరి అనే గిరిజన ప్రాంతానికి వెళ్లి అక్కడ దుర్గ అనే అమ్మాయిని వశపరచుకుని తల్లిని చేసి మొహం చాటేస్తాడు .
అతన్ని వెతుక్కుంటూ పోయి అవమానపడుతుంది . లం… అని పిలిపించుకుంటుంది . ఆ గిరిజన స్త్రీకి అండగా ఝాన్సీ అనే మహిళా కళాశాల విద్యార్థి యూనియన్ సెక్రటరీ అండగా నిలుస్తుంది . దేశం మొత్తాన్ని కదిలిస్తుంది . పార్లమెంటుని కూడా కదుపుతుంది . లోక్ అదాలత్ ఏర్పాటు చేయబడుతుంది .
లోక్ అదాలత్ మౌనపోరాటం చేస్తున్న దుర్గ వద్దకే తరలి వస్తుంది . పౌరసంఘాలు , మహిళా సంఘాలు , గిరిజన సంఘాలు , మేధావులు , అతివాదులు , అందరూ ఆమెకు అండగా నిలుస్తారు . గతి లేని పరిస్థితుల్లో నిజాన్ని అంగీకరించి ఆమెను భార్యగా స్వీకరిస్తాడు . అయితే దుర్గ తనకు కావలసింది నిజము , న్యాయమే అని చెప్పి గూడెం జనంతో గూడెంనకు వెళ్ళిపోవటంతో సినిమా ముగుస్తుంది . అద్భుతమైన సినిమా . సినిమా అంటే ఇలా వినోదమూ , సందేశమూ , స్ఫూర్తిదాయకమూ అయి ఉండాలి .
సినిమాలో మెచ్చుకోవలసింది కధనాన్ని , మోహన్ గాంధీ స్క్రీన్ ప్లేని , దర్శకత్వాన్ని . మొదటి హాఫ్ అంతా అందమైన కొండలు , లోయలు , వాగులు , ప్రకృతి అందాలను చూపారు . ఆ ప్రకృతి అందానికి తోడు యమున , రాజ్యలక్ష్మి , ముచ్చర్ల అరుణ వంటి అందమైన కధానాయికలను కలిపారు .
గిరిజనుల అమాయకత్వాన్ని , విద్య లేమిని అడ్డం పెట్టుకుని వాళ్ళను దోపిడీ చేసే విలనాసురుడిగా కోట శ్రీనివాసరావు , సబ్ ఇనస్పెక్టర్ సుత్తి వేలు దుర్మార్గాన్ని , క్రౌర్యాన్ని బ్రహ్మాండంగా చూపారు . వెరశి సినిమా ఓ సంచలనాత్మక , సందేశాత్మక , క్లాసిక్ మాస్ సినిమా అయింది .
ఈ సినిమా 1989 లో వచ్చింది . అప్పటికి DNA టెస్టులు ఇంకా రాలేదు . DNA టెస్ట్ ఇండియాలో 1991 లో సాక్ష్యంగా అంగీకరించబడింది . ఇప్పుడు ఈ సినిమా చూసే ఈతరం వాళ్ళకు DNA టెస్ట్ చేయించవచ్చు కదా అనే సందేహం కలగవచ్చు . ఈ సినిమా టైంకు DNA ను ఉపయోగించటం ప్రారంభం కాలేదు .
యమునకు తెలుగులో ఇది మొదటి సినిమా . మొదటి సినిమాతోనే సుధాచంద్రన్ లాగా చాలా పాపులర్ అయింది . ఇతర ప్రధాన పాత్రల్లో వినోద్ కుమార్ , కోట శ్రీనివాసరావు , సుత్తి వేలు , ప్రసాద్ బాబు , రమణారెడ్డి , నర్రా , రాళ్ళపల్లి , కాకినాడ శ్యామల , అరుణ , రాజ్యలక్ష్మి , కృష్ణవేణి , పావలా శ్యామల , ప్రముఖ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి తదితరులు నటించారు . ఝాన్సీ పాత్రధారి పేరు నాకు తెలియదు . నూతన నటిలాగా ఉంది . ఇదే మొదటి సినిమా అనుకుంటాను . బాగా నటించింది .
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది . జానకమ్మ సంగీత దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది . పాటల్ని వేటూరి , జాలాది వ్రాసారు . ఇదే మౌనపోరాటం అనే పాట బాగా పాపులర్ అయింది . ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన పాటలాగా .
దొర రాక కోసం వేచియున్నవి ఈ కన్నులు , పెందరాడే చందురుడే నన్ను చూసి తొంగిచూసె పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . జుంబారే జుంబారే , యాల యాలగా అంటూ సాగే పాటల చిత్రీకరణ అందంగా ఉంటుంది .
సినిమా యూట్యూబులో లేదు . ముక్కలు ముక్కలుగా ఉంది యూట్యూబులో . ఈటివి విన్ లో పూర్తిగా ఉంది . రామోజీరావు గారి సినిమా కదా ! యూట్యూబులో ఎక్కించబడలేదు . ఎన్ని సార్లయినా చూడబుధ్ధి వేసే సినిమా , చూడతగ్గ సినిమా . An unmissable movie .
నేను పరిచయం చేస్తున్న 1218 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article