.
కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడా…?
కైలాష్ పర్వతం నిజానికి పురాతన కాలంలో నిర్మించబడిన భారీ మానవ నిర్మిత పిరమిడ్ అని రష్యన్ నేత్రవైద్యుడు ముల్డాషెవ్ బృందం ఒక బలమైన నిర్ధారణకు వచ్చింది. దాని చుట్టూ చాలా పిరమిడ్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతం సర్వసాధారణ కార్యకలాపాలకు భిన్నంగా పారానార్మల్ సెంటర్ గా పేర్కొంది ఈ బృందం.
Ads
ఇంతకీ ఆ అసాధారణ మార్మికతేంటి..?
రాత్రి వేళ ఈ కైలాస పర్వత ప్రాంతంలో వింత శబ్దాలు ముల్డాషెవ్ పరిశోధక బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇవన్నీ ముల్డాషెవ్ ఒక అకడమిక్ పేపర్ లో పేర్కొన్నారు. పిరమిడ్స్ లోంచి ఒక రాయి పడ్డ శబ్దంలా… అలాగే, ఈ పిరమిడ్స్ లో ఏవో కొన్ని జీవుల సంచారం కూడా ఉన్నట్టు తాము కనుగొన్నట్టు రష్యన్ నేత్ర వైద్యుడి బృందం ఈ అకడమిక్ పేపర్స్ లో వెల్లడించింది.
కల్కి సినిమాతో ఫేమస్ అయిన శంబాలా అనే పదం.. ఇదిగో ఈ కైలాస పర్వతం నుంచి పుట్టుకొచ్చిందే. టిబెటన్ గ్రంథాల్లో ఈ శంబాల అనే ఆధ్యాత్మిక మార్మికదేశమొకటి కైలాస పర్వతానికి వాయువ్యదిశలో ఉన్నట్టుగా ఈ రష్యన్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ చెప్పుకొచ్చింది. దీన్ని వైజ్ఞానిక కోణంలో శాస్త్రీయంగా చెప్పడమంటే మాకూ కత్తిమీద సామేనన్న రష్యన్ బృందం… ఐతే, ఈ ఆధ్యాత్మిక శంబాల మాత్రం నేరుగా భూమిపైనున్న మానవ జీవితాలకు ముడిపడి ఉందనే నిర్ధారణకు కూడా వచ్చినట్టు పేర్కొంది.
ఈ పిరమిడ్స్ అద్దాల వంటి రాళ్ల నిర్మాణంతో సిటీ ఆఫ్ గాడ్స్ ను తలపించేలా ఉండటంపై కూడా తాము నివ్వెరపోయింది డాక్టర్ సాబ్ టీమ్. ఈ పిరమిడ్ ను బాగా పరిశీలించి చూసినప్పుడు ఇదొక డీఎన్ఏ అణువుల నిర్మాణాన్ని పోలి ఉన్నట్టుగా కూడా వారు వెల్లడించారు.
ఇక ముంబైకి చెందిన ఓ సంస్కృత పండితుడు మోహన్ భట్ కూడా.. ఈ కైలాస పర్వతాన్ని పిరమిడ్ అనే విషయాన్ని నిగ్గుతేల్చారు. రామాయణం కూడా ఈ కైలాస పర్వతాన్ని పిరమిడ్ గా పేర్కొందని.. వేదాల్లో కూడా ఈ పర్వతానికి సంబంధించిన ప్రస్తావనలున్నాయన్నారు. దీన్నో విశ్వ అక్షంగా ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నట్టు ఆయన చెప్పే మాట.
రష్యన్ బైలింగ్వల్ వెబ్ సైట్ Onwards to the Past ఓపెన్ చేస్తే వారి పరిశోధనలను మరింత సమగ్రంగా చదువొచ్చు. అయితే, మాల్డాషెవ్ బృందం పరిశోధనలను చైనీస్ శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. వారు పూర్తిగా ఎక్కడా విశ్వసించకపోగా.. మతాచారాల ప్రకారం పరిశోధన కన్నా.. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడాన్నే టిబెట్ తో కలిసి నిషేధించారు.
అయితే, విశ్వ రహస్యాలను ఛేదించేంత జ్ఞానవంతుణ్ని కాదని.. తమకు తోచిన రీతిలో పరిశోధనలు కొనసాగించామని… స్వర్గానికి రహదారిలా నమ్మే కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ ను చైనా, టిబెట్ నిషేధించడాన్నీ ముల్డాషెవ్ స్వాగతించారు.
వాస్తవంగా కైలాస పర్వత ప్రాంతంలో నివాసం అంత సులభం కాదు. అందుకే, ఇక్కడ జీవించే సాధుసంతులను ప్రత్యక్ష దైవాల్లా కొల్చేవారున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ భూతల స్వర్గం కైలాస పర్వతం. జన్యుసంకరణకు కూడా ఆస్కారం లేకుండా ఇక్కడికెవ్వరికీ ఎంట్రీ లేదనీ చెబుతుంటారు.
ఇక్కడి హిమగిరి సొగసుల్లో జీవించేవారి ఆయుష్షు కూడా ఎక్కువేనంటారు. వీరి దేహదారుఢ్యం కూడా ఔరా అనిపిస్తుంటుంది. సాధారణ సమాజ జీవితాల్ని మించి.. ఇక్కడివారి అందం, ఎత్తు… దేవతలను తలపించేలా ఉండటమే ఈ ప్రాంతానికి ఇంత ప్రత్యేకమైన చర్చకు దారి తీసి ఉండొచ్చు.
అలెక్స్ మెక్ కాయ వంటివారు చేసిన పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలు కూడా టిబెటిన్ స్టడీస్ లైబ్రరీ లో భద్రపర్చారు. ఆసియాలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా కైలాస పర్వతం హిందువులు, బౌద్ధులు, జైనులకు ఎలా మారిందో ఆయన వివరించారు. ఇక సద్గురు జగ్గీ వాసుదేవన్ వంటివారైతే… కైలాస పర్వతాన్ని ఓ మార్మిక గ్రంథాలయంగా పేర్కొంటారు.. అచ్చంగా కైలాసంగానే అభివర్ణిస్తారు.
సినిమాల్లో చూపించినట్టుగా కొంత ఫాంటసీగా అనిపించినా… నిజంగా కూడా యోగులు, సాధుసంతులు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఇలాంటి కొండగుహలే. ఎందుకంటే, సాధారణ జనజీవనానికి దూరంగా ధ్యానంలో మునిగితేలే ఆవాసాలుగా వీటిని ఎంచుకుంటారు. తమ జ్ఞానాన్ని శక్తిరూపకంగా నిక్షిప్తం చేసే ఇక్కడి బండరాళ్లే సాధుసంతువుల నెలవులు. అందుకు ఆ ఆది గురువైన శివుడే ఇక్కడ నివసించే సన్యాసులకు ఓ రోల్ మాడల్.
అగస్త్య మహాముని అంతటివారు ఇక్కడే నివసించేవారని హిందువులు నమ్మితే.. మంజుశ్రీ, అవలోకిటేశ్వర, వజ్రపాణి వంటి బౌద్ధగురువులు కూడా ఇక్కడే నివసించేవారని బౌద్ధుల ప్రగాఢ విశ్వాసం. ఇక రిషభుడు ఇంకా ఇక్కడే పర్వతాలపై జీవించే ఉన్నాడన్నది జైనుల నమ్మకం. మొత్తంగా ఓ జ్ఞాననిధిలా కైలాస పర్వతానికున్న పేరు అజరామరమైపోయింది.
అయితే, కైలాసపర్వతాన్ని చదవడమూ అంత సులువైన విషయం కాదంటారు జగ్గీ వాసుదేవన్. నువ్వు ఎంత తెలివివంతుడవైనా.. ఆ మార్మికమైన లైబ్రరీలోకి అడుగుపెడితే.. అంతా అయోయమమే. కాబట్టి మళ్లీ అఆల నుంచి మొదలుపెట్టాల్సిందేనంటారాయన.
మౌంట్ కైలాస్ టూర్… ఓ జీవన సాఫల్యయాత్ర!
జీవితంలో దేవుడికి దండం పెట్టినా కూడా… తన గురువుతో సరిసమానంగా మాత్రం చూడలేదంటారు జగ్గీవాసుదేవన్. కానీ, కైలాస పర్వతం దగ్గరకు వెళ్లితే మాత్రం… దాన్ని తన గురువుతో సరిసమానంగా చూశానంటారు ఈ సెయింట్. ఈ భూమ్మీద తననేవీ పెద్దగా ఆశ్చర్యపర్చడం లేదనీ… కానీ, కైలాస పర్వతం మాత్రం తనను అమితంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందన్నది జగ్గీ చెప్పే మాట.
అందుకే, కైలాస మానస సరోవర యాత్ర అనేది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన యాత్రగా చూడబోకండి… అదో రహస్య ప్రదేశం.. దాన్ని తెలుసుకోవాలనుకున్నాకొద్దీ తెలియందేదో ఇంకా ఉందనే విషయం తెలుస్తూనే ఉంటుందంటారు జగ్గీ.
మరి అంతగా కైలాస పర్వతంలో ఆశ్చర్యపర్చే విషయాలేంటి..?
వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం! పార్ట్ 3 ……. (రచన :: రమణ కొంటికర్ల)
Share this Article