సినిమాయే జనంలోకి వెళ్తోంది… ఊరూరా వెళ్తోంది… పలకరిస్తోంది… కన్నీళ్లు పెట్టిస్తోంది… చూశాం నిజంగానే, జనం బళ్లు కట్టుకుని తీర్థం పోయినట్టుగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసిన తీరు విన్నాం… ఇది పూర్తిగా డిఫరెంట్… ఊరూరూ ఏకమై, పెద్ద స్క్రీన్లు వేసుకుని, అందరూ కలిసి సినిమాను వీక్షిస్తున్న కొత్త దృశ్యాలివి… థియేటర్ కాదు, ఓటీటీ కాదు, టీవీ కాదు… దీనికీ ఓ పేరు పెట్టాలి… ఇంతగా జనం ఓన్ చేసుకున్న బలగం సినిమాను ఆ కొత్త కేటగిరీలో వేసేయాలి అర్జెంటుగా…
కొత్తేమీ కాదు, బుర్రకథలు, హరికథలు, పల్లె కళారూపాలు, నాటకాలను జనమంతా కలిసి వీక్షించడం కొత్తేమీ కాదు… కానీ ఒక సినిమాను ఇలా ఊళ్లల్లో బొడ్రాయి పండుగ లెక్క కలిసి వీక్షించడమనేది కొత్తకొత్తగానే ఉంది… ఛిఛీ మూఢనమ్మకాలు, ఎహె అంతా నీసు కంపు, థూ మందువాసన అని కొందరు ఎంత తెగిడినా జనం పట్టించుకోవడం లేదు… తమ కథను చూసుకుంటున్నారు… సినిమా పాత్రల్లో తమను చూసుకుంటున్నారు… కదిలిపోతున్నారు… దూరమైన తమ కుటుంబసభ్యులను తలుచుకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నారు…
Ads
గ్రామ ఉమ్మడి వీక్షణం వల్ల థియేటర్లకు వచ్చే డబ్బు రాకుండా పోవచ్చుగాక… కానీ సినిమా చిరకాలం ప్రజల మెదళ్లలో అలా నిలిచిపోతుంది… బలగం సినిమా పెట్టుబడిని ఎన్నో రెట్లు డబ్బు వాపస్ వచ్చేసింది… ఓటీటీ, శాటిలైట్ డబ్బులూ ఊహించనంత మొత్తంలో దిల్ రాజు జేబుల్లోకి చేరింది… ఇక రంది లేదు… కాలం కలిసి వస్తే, వేణు వంటి దర్శకుడు మళ్లీ ఇలాగే కష్టపడితే మరో బలగం తెరపైకి రావడం పెద్ద కష్టమేమీ కాదు… చెత్తా కంటెంటుతో ఇన్నేళ్లూ జాతిలో సాంస్కృతిక, మానసిక కాలుష్యాన్ని దట్టించిన చెత్త దర్శకుల నోటమాట రావడం లేదు…
మిత్రుడు Gurram Seetaramulu చెబుతున్నట్టు…. ‘‘సినిమాలో వ్యభిచారులు, విలన్లు మాత్రమే ఒక యాస మాట్లాడాలి… కోకాపేట అత్తల మీద, ఓల్డ్ సిటీ ముస్లింల మీద వెటకారాన్ని దట్టిస్తూ… సీమ మనుషుల్ని చంటి పిల్లల గొంతు కోసే వాళ్ళలాగా చేసి… ఓల్డ్ సిటీ వాడే దుబాయ్ షేక్ కు అమ్మాయిలను అమ్మేవాళ్ళ లాగా చేసి… వీళ్ళ కామానికి, జుగుప్స టేస్టుకు చిలకలూరు పేటలు, పెద్దపురాలు, భోగం మేళాలు… ఇవన్నీ ఈ వెండితెర మనకు మిగిల్చిన కేన్సర్ కురుపులు…
తెలుగు సినిమా మానసిక రోగుల అడ్డా… పిట్ట గూడు లాంటి విగ్గు పెట్టి, దూడ పెదాలు, దొడ్డికాళ్లు ఊపుకుంటూ, ఇంతింత పొట్టలు ముందుకేసి, మనవరాలి వయసున్న పద్దెనిమిది ఏళ్ళ పడుచు పిల్ల బుగ్గల మీద, చిటికెన వేలుతో కామపు చెమటను చిలకరిస్తూ, చిలక కొట్టుడు కొట్టిన జుగుప్స తెరమీద చూపిస్తూ, ఆ పసి మనసుల మీద మరో అత్యాచారం చేస్తూ, కాసుల వ్యాపారం చేస్తున్నారు ఇన్నాళ్లూ… ఎర్రగడ్డ కార్డు ఒకటి జేబులో పెట్టుకుని కాళ్ళూ చేతులూ నోరూ డ్రైనేజ్ కంపుతో వాగడం సినిమా సంస్కారానికి నిలువెత్తు చిరునామా… తెలంగాణ సినిమా అంటే పిట్ట, నల్లిబొక్క, కాకి గోల అట… తన్ని తగలేసినా అదే అహంకారం నల్లి కుట్ల ముచ్చట్లు …
సరే, ఈ చర్చ వేరు అనుకుందాం… కానీ ఊళ్లు థియేటర్‌నే తమ వద్దకు రప్పించుకునే కొత్త ధోరణి సోకాల్డ్ సినిమా సైట్లకు, యూట్యూబు చానెళ్లకు, మెయిన్ స్ట్రీమ్‌కు కనిపించదు… సినిమా సెలబ్రిటీలు కార్చే సొల్లు అక్షరమక్షరమూ దోసిళ్లలో పట్టుకుని, అచ్చేసుకుని మురిసిపోయే రాతగాళ్లూ ఒక్కసారి తెలంగాణ పల్లె వైపు చూడండి… అదీ ఒక సినిమాను యావత్ సమాజం ఓన్ చేసుకునే అపురూపం… బలగం సజీవ సంభాషణలు కనబరుస్తున్న ప్రభావం, కారుస్తున్న కన్నీళ్లు, కదులుతున్న బంధాలు, అహాలు, పట్టింపులు గూళ్లను గమనించిండి…!!
తరాలుగా వెటకారానికీ, వివక్షకూ గురైన తెలంగాణ మాట, పాట, ఆట ఇప్పుడు తెలుగు సినిమాకే కాదు, అందరికీ మూలవస్తువే… అందుకే వెంకటేశ్ కూడా నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ అనే భారీ హిందీ సినిమాలో ఏకంగా బతుకమ్మ పాటనే పెట్టేసి, పూజా హెగ్డేతో బతుకుమ్మ ఆడిస్తున్నారు… వావ్… ఇదుగో వీడియో…
https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I
Share this Article