Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుంజన్ సక్సేనా..! స్ట్రెయిట్‌గా, నీట్‌గా… ఏమాత్రం దారితప్పని ఓ బయోపిక్..!

March 24, 2024 by M S R

నాలుగేళ్లయింది ఈ సినిమా వచ్చి..! సినిమా పేరు గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గరల్… నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల సెర్చింగులో కనిపిస్తే దాని వెంట పరుగు తీసింది దృష్టి… ఈమధ్య హృతిక్ రోషన్ సినిమా ఒకటి ఫైటర్, మన వరుణ్ తేజ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మరొకటి ఎయిర్ ఫోర్స్ వార్ మీద వచ్చాయి… అంతేకాదు, కంగనా రనౌత్ సినిమా కూడా ఒకటి వచ్చినట్టు గుర్తు (తేజస్..?)…

వీటన్నింటికన్నా ముందే వచ్చింది ఈ గుంజన్ సక్సేనా… కరణ్ జోహార్ నిర్మాత, శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్ ప్రధాన కథానాయిక అనేసరికి కాస్త ఇంట్రస్టింగు… ఎవరీ గుంజన్ సక్సేనా..? కార్గిల్ వార్‌లో పాల్గొన్న తొలి మహిళా పైలట్… ఆమె బయోపిక్ ఇది… సినిమా ఆరంభం నుంచీ చివరి దాకా ఆసక్తికరంగానే చిత్రీకరించాడు దర్శకుడు శరణ్ శర్మ… ఆయనకు ఇది తొలి సినిమా అట…

నిజానికి సినిమా చూస్తున్నంతసేపూ జాన్వీకపూర్ నటన గమనిస్తున్నంతసేపూ ఒక ఆలోచన… రెండుమూడు తెలుగు చిత్రాలు చేయబోతోంది… కొన్ని హిందీ చిత్రాలు కూడా చేసింది… ఇలాంటి మంచి బయోపిక్ పాత్రను చేసిన ఆమెతో తెలుగులో పిచ్చి స్టెప్పులకు పరిమితం చేస్తారు కదాని జాలేసింది… ఆమెకు శ్రీదేవి బిడ్డగా పేరుంది, బోలెడంత డబ్బుంది, తండ్రి బోనీకపూర్‌కు ఏం తక్కువ..? దిక్కుమాలిన దేభ్యం పాత్రలు ఎందుకు చేయాలి..? ఈ గుంజన్ సక్సేనా పాత్రలో బాగానే చేసింది… మొహంలో ఫీలింగ్స్ బాగున్నాయి…

Ads

సినిమా కథ విషయానికొస్తే… రెండు వివాదాలున్నయ్… కార్గిల్ వార్‌లోకి అడుగుపెట్టిన తొలి మహిళ గుంజన్ సక్సేనా మాత్రమే కాదనీ, ఇద్దరమూ చాపర్లు నడిపించామని సక్సేనా కోర్స్‌మేట్ శ్రీవిద్య రాజన్ ఆరోపించింది… రిటైర్డ్ వింగ్ కమాండర్ నమ్రిత చాంది కూడా అదే చెప్పింది… దానికి గుంజన్ సక్సేనా కూడా ఏదో క్లారిటీ ఇచ్చింది… సినిమా కోసం కొంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారనీ చెప్పింది… అయితే రిక్రూట్‌మెంట్స్, శిక్షణ ఏర్పాట్లు, వసతులు, మహిళలపై వివక్షలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్‌ను ఈ సినిమా కొంత కించపరిచినట్టుగా ఉందని ఎయిర్ ఫోర్స్ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాసింది…

సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఈ సినిమా కథ మాత్రం బాగుంది… అయితే గుంజన్ సక్సేనా ఫైటర్ విమానం పైలట్ కాదు… హెలికాప్టర్ పైలట్… ఆ ఛాపర్ వింగ్ సేవలు, సాహసాలు కూడా తక్కువేమీ కాదు.,.. గుంజన్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో కీలక ప్రాంతాల్లోకి తన చీతా హెలికాప్టర్ మీద వెళ్లి శత్రు స్థావరాలను గుర్తించడం, సైనికులకు ఆహారం, ఆయుధాలను సరఫరా చేయడమే కాక ఎందరో క్షతగాత్రులను యుద్దభూమి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించింది… తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం శౌర్య చక్ర బిరుదుతో కూడా సత్కరించింది…

saxena
1984 లో విమానం విండో సీట్ లో కూర్చున్న అన్న తనని మేఘాలు చూడనివ్వకుండా బ్లైండ్స్ వేసేస్తున్నాడని అలిగిన పదేళ్ళ గుంజన్ ని చూసిన ఎయిర్ హోస్టెస్ ముచ్చట పడుతుంది… కాక్ పిట్ లోకి తీస్కెళుతుంది. అక్కడనుండి కనిపించే అందమైన దృశ్యాన్ని చూసిన గుంజన్ ఆ క్షణమే పైలట్ కావాలని నిర్ణయించుకుంటుంది…
ఆ నిర్ణయాన్ని అన్నతో చెప్తే తను “అమ్మాయిలు పైలట్ అవలేరు, ఎయిర్ హోస్టెస్ లు మాత్రమే అవగలరు” అని ఆటపట్టిస్తాడు… అది చూసిన తండ్రి సక్సేనా (పంకజ్ త్రిపాఠి) “ఎవరు చెప్పారు కాలేరని, అసలు తనని ఎవరు నడుపుతున్నారన్నది విమానమే పట్టించుకోనపుడు నీకేంటి నొప్పి” అని అతన్ని మందలించి, “విమానం నడిపేది ఆడైనా మగైనా పైలట్ అనే అంటారు నువ్వు తప్పకుండా పైలట్ అవుదువు గానీ, ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు” అని గుంజన్ ని ప్రోత్సహిస్తాడు. (సినిమాకు పంకజ్ త్రిపాఠి నటన, ఆ పాత్ర ప్లస్ పాయింట్స్)…
రియల్ అండ్ రీల్ గుంజన్ సక్సేనా

అలా మొదలైన తన కలని గుంజన్ ఎలా సాకారం చేస్కుంది, అప్పటివరకూ పూర్తిగా మగవాళ్ళే ఆధిపత్యం వహిస్తున్న ఆ రంగంలో మొదటి సారి కాలు మోపి, మహిళల కోసం మార్గం ఎలా సుగమం చేసింది. ఆ ప్రోసెస్ లో ఏఏ అడ్డంకులు ఎదుర్కొంది, ఎలాంటి సపోర్ట్ అందుకుంది, రక్షణ/సేఫ్టీ పేరుతో అడుగడుగుకు వెనక్కి లాగుతున్న తన అన్నని ఎలా ఎదుర్కొంది, ఈ విజయం సాధించడానికి కొండంత అండగా తన తండ్రి తనతో ఎలా నిలబడ్డాడు అనేది సినిమా కథ…

పంకజ్ త్రిపాఠి పాత్ర మనకి గుర్తుండి పోతుంది… తండ్రిగా తను ప్రోత్సహించే పద్దతి ఎక్కడా డ్రమటైజ్ చేయకుండా సహజంగా చాలా బావుంది… ఆ తండ్రీ కూతుళ్ళ బంధం చూసినపుడు ఖచ్చితంగా మన ఇంటి అమ్మాయిలను మనం ఎంత వరకూ ఎలా ప్రోత్సహిస్తున్నాం అనే విషయం ప్రశ్నించుకుంటాం. అలాగే ప్రతి అమ్మాయి అలాంటి నాన్న కావాలని కోరుకుంటుంది. ఆల్రెడీ ఉండి ఉంటే ధీమాగా మరోసారి హత్తుకుని గువ్వపిట్టలా తన చేతులలో ఒదిగిపోతుంది…

సినిమా కథ ఎక్కడా దారితప్పదు, సగటు కమర్షియల్ సినిమాలో ఉండే ఏ మసాలాలూ, చివరకు కామెడీ కూడా లేదు… స్ట్రెయిట్‌గా, సిన్సియర్‌గా ఓ మహిళా పైలట్ బయోపిక్‌ను కళ్ల ముందుంచుతాడు దర్శకుడు… ఎక్కడా ఫోకస్ తప్పలేదు… హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions