Sai Vamshi ……. .. చిన్నప్పుడే బాగుండె! థియేటర్‌లో సినిమా చూసి ఇంటికొచ్చి తిని పడుకున్న తర్వాత ఆ సినిమా పేరు కూడా మర్చిపోయేవాళ్లం. తర్వాత రోజు ఏదైనా గోడ మీద పోస్టర్ కనిపిస్తేనో, టీవీలో యాడ్ వస్తేనో, టీ బంకుల దగ్గర ఖాళీ దొరికితేనో తప్పించి ఎవరూ పెద్ద చర్చించేవారు కాదు. జస్ట్ బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ వీళ్ల కామెడీ గురించి గ్యారెంటీగా చెప్పుకునేవారు.
ఇప్పుడు కొత్త సినిమా చూస్తే సరిపోదు. రివ్యూ రాసేదాకా మనసు పీకుతూ ఉంటుంది. నక్షత్రకుడిలా ఆ ఆలోచన వెంట పడుతూ ఉంటుంది. అది కూడా కొత్తగా, సరి కొత్తగా, సూటిగా ఉండకుండా, ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా రివ్యూ రాయకపోతే పరువు దక్కదనే ఫీలింగ్. మామూలుగా రివ్యూ రాయడం అనేది పాపంగా, దోషంగా పరిణమించింది.
‘సినిమా బాగుంది’, ‘సినిమా బాగాలేదు’ అనే Simple Terminology వాడితే మనసు అస్సలు అంగీకరించదు. పాండిత్యం అంతా చూపించకపోతే శాంతి లేదు. పైగా కొరియన్ సినిమాల రిఫరెన్స్‌లు, అర్థం కాకపోయినా మలయాళ సినిమాలపై పొగడ్తలు.. అన్నీ మిక్స్ చేయాలి.
ఇంకొందరు రాసేవి రివ్యూలో, Rapid Fire సమాధానాలో అర్థం కావు. ‘దొబ్బింది’, ‘పోయిందంటగా’, ‘ఫ్లాప్’, ‘కథ అడ్డం తిరిగింది’ ఇలా ఉంటాయి. అవి రివ్యూలో, ఆ సినిమాలోని డైలాగులో తెలియదు. కింద మళ్లీ చర్చోపచర్చలు, హితబోధలు, సంప్రదింపులు, బుజ్జగింపులు, ఊరడింపులు.
అవతల హీరో, దర్శకుడు చికెన్ లాగిస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం వాదోపవాదాలతో పగలు పెంచుకోవడాలు! అటో గ్యాంగ్, ఇటో గ్యాంగ్! మొత్తం కృష్ణార్జున యుద్ధం. ‘వీరనరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లో చూసి కూడా రివ్యూలు రాయనివారు ధన్యులు సుమతీ!
Share this Article