.
పాపం. దర్శకుడు మెహన్ శ్రీవత్స అలా తనను తాను చెప్పుతో కొట్టుకోవడం చూస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇబ్బందిగా కూడా ఉంటుంది. “త్రిబాణధారి బార్బరిక్” (ఈ టైటిల్ వ్యుత్పత్తి, భావార్థాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది!)
సినిమా విడుదలకు ముందు అందరిలాగే షరా మామూలుగా “ఈ సినిమా సక్సస్ కాకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా” అని ఆత్మవిశ్వాసంతో దర్శకుడు మీడియా కెమెరాల సాక్షిగా చెప్పినట్లున్నాడు. తీరా సినిమా విడుదల అయ్యాక థియేటర్లలో జనం లేరు. దర్శకుడి మనసు చివుక్కుమంది.
Ads
కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. విడుదలకు ముందు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. అన్నంత పని చేశాడు. కారులో ఒంటరిగా కూర్చుని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటూ తన చెప్పుతో తనను కొట్టుకుంటూ…ఇక మలయాళంలోనే సినిమాలు తీస్తా…తెలుగులో సినిమాలు తీయను అని విలపించాడు. అలా చేయకుండా ఉండాల్సింది. చేశాడు. ఇలాంటివి ఈరోజుల్లో బాగా వైరల్ అవుతాయి.
సినిమా అక్షరాలా వ్యాపారం. పెను జూదం. కళామతల్లి, సృజనాత్మకత, సామాజిక సందేశం, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత లాంటి పడికట్టు పారిభాషిక పదాలు మాటవరసకు, చర్చకు పనికివస్తాయి తప్ప…ఆచరణలో అవి దేవతావస్త్రం కథను కప్పుకుని ఉంటాయి.
వాస్తవానికి శ్రీవత్స చెప్పుతో కొట్టుకున్నాడు. మిగతావారు ఇలా కొట్టుకోలేక లోలోపల విలపిస్తూ ఉన్నారు. అంతే తేడా. శ్రీవత్స ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించి చెప్పులను కాళ్ళకే పరిమితం చేయాలి.
అంటే అన్నారంటారు కానీ…ప్రేక్షకులకు మాత్రం చెప్పు దెబ్బలు తగలడం లేదా?
# దిక్కుమాలిన సినిమాలకు మొదటివారం రెండింతలు, మూడింతలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే ఉదారంగా అనుమతులిస్తున్నప్పుడు ఎవరి చెప్పుతో ఎవరు కొడుతున్నట్లు?
# సినిమా నిర్మాణానికి వంద కోట్లు అయితే అందులో 75 కోట్ల పారితోషికం తీసుకునే హీరో ఆదర్శాలగురించి మాట్లాడితే ఎవరి చెప్పుతో ఎవరు కొడుతున్నట్లు?
# మల్టీప్లెక్స్ లకు వెళితే పార్కింగ్ మొదలు పాప్ కార్న్ దాకా జి ఎస్ టీ తో కలిపిన వేలకు వేల దోపిడీల దగ్గర ఎవరి చెప్పుతో ఎవరు కొడుతున్నట్లు?
# ఒక సినిమా మీద వెయ్యి కోట్లు పెట్టాం…వచ్చి చూడడం మీ బాధ్యత. మిమ్మల్ని పిండుకోవడం మా హక్కు అని నిర్మాతలు దబాయిస్తుంటే ఎవరి చెప్పుతో ఎవరు కొడుతున్నట్లు?
# సినిమా విజ్ఞానం దాటి…వినోదం దాటి…గుత్తాధిపత్య వ్యాపారంగా మారినవేళ కనిపించే ప్రేక్షక మొహాలకు తగులుతున్నవన్నీ కనపడని చెప్పు దెబ్బలే కదా!
–పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article