.
సినిమా ఇండస్ట్రీలో హఠాత్తుగా కొన్ని పిచ్చి పంచాయితీలు తలెత్తుతాయి… దాని మీద నెటిజనంలో ఒకటే చర్చలు, ఖండనలు, తిట్లు ఎట్సెట్రా… బిపాషా బసు, మృణాల్ ఠాకూర్ వివాదం కూడా అంతే…
వివాదం ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో మృణాల్ ఠాకూర్‌కూ తనకు కుంకుమ్ భాగ్యలో కో-స్టార్ ఆర్జిత్ తనేజా నడుమ ఓ సరదా సంభాషణ బాపతు వీడియో… అందులో ఆర్జిత్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ పుషప్స్ చేయగలవా అంటుంటాడు మృణాళ్‌ను…
Ads
నీకు కండలున్న మగాడువంటి ఆడది కావాలా…? (పురుషురాలు, మగది అనీ రాస్తున్నారు) అయితే ఫో, వెళ్లి బిపాషా బసును చేసుకోపో, నేను ఆమెకన్నా బాగా ఉంటాను తెలుసా అని సరదాగా బదులిస్తుంది… ఆ వీడియో పాతది… హఠాత్తుగా ఇప్పుడు ఎవరో దాన్నిఇన్‌స్టాలో వైరల్ చేస్తున్నారు…
నిజానికి అప్పట్లో బిపాషా బాసు చాలా హాట్ కేరక్టర్ బాలీవుడ్‌లో… కానీ తనకు మగాడి లుక్కు ఉండదు, కండలూ ఉండవు… తనది మంచి అట్రాక్టివ్ బాడీ… మృణాల్ కూడా చేసింది సరదా వ్యాఖ్యే… పైగా అప్పుడప్పుడే టీన్స్ దాటుతున్నట్టుంది… అంత పరిణతీ లేదు, పైగా అలాంటివి వీడియో తీసి నెట్‌లో పెట్టడానికి కూడా ఎవరూ అంగీకరించరు… ఎవరో గానీ రికార్డ్ చేశారు, ఇప్పుడది మళ్లీ వైరల్ అయిపోయింది…
వాస్తవంగా బిపాషా బసు 2015 నుంచీ నటించడమే లేదు… సుసానే, మలైకా అరోరా వంటి మిత్రులతో ఏదో తనకు తోచిన వ్యాపారం చేసుకుంటోంది… ఫస్ట్, డీనో మోరియాతో డేటింగ్… తరువాత జాన్ అబ్రహాం, హార్మన్ బవేజాలతో కూడా… 2014లో తన కో-స్టార్ కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది…
ఇప్పుడీ పాత వీడియో వైరల్ కావడంతో తనూ సరదాగానే స్పందించి… ‘ఆడవాళ్లూ కండలు పెంచండి, మనం కూడా బలంగా ఉండాలి… శారీరకంగా, మానసికంగా కూడా… ఆడవాళ్లు బలంగా కనిపించకూడదనే పాత ఆలోచనల్ని బద్దలు కొడదాం’ అని తనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… మృణాల్‌ను ఏమీ అనలేదు…
మృణాల్ వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అనే విమర్శలు పెరగడంతో తను బిపాషా పేరు ఎత్తకుండానే సారీ చెప్పింది… చిన్నప్పుడు, అంటే 19 ఏళ్ల వయస్సులో పరిణతి లేక ఏదో మాట్లాడాను, వయస్సు పెరిగేకొద్దీ తెలివి పెరుగుతుంది కదా… అవి తప్పే అని రాసుకొచ్చింది…
ఇక్కడ చిత్రం ఏమిటంటే… టీవీ రియాలిటీ షో పర్సన్ ఉర్ఫి జావేద్, టీవీ నటి హినా ఖాన్ వంటి తారలు మృణాల్‌ను సమర్థించుకురావడం… అవును, చిన్నతనంలో ఏదేదో అంటాం, అందులో పెద్దగా తప్పులు తీసి వివాదం క్రియేట్ చేయడం ఏమిటి అని కొట్టిపారేస్తున్నారు వాళ్లు… ఏవో సరదా సంభాషణల్లో ఏవో మాటలు దొర్లుతుంటాయి లైట్ తీసుకోవాలి అంటున్నారు… కానీ నెటిజనానికి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి కదా, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు నెట్‌లో..!!
Share this Article