సినిమా పేరు… మా నాన్నకు పెళ్లి…! ఈవీవీ కేవలం బూతుల దర్శకుడిగా మారకముందు తీసిన సినిమా… అందులో కృష్ణంరాజు తండ్రి, అంబిక తన ప్రియురాలు, కొడుకు శ్రీకాంత్… తండ్రి ప్రేమకథ అనుకోకుండా తెలుసుకుని, వాళ్ల పెళ్లికి తనే పెద్దరికం వహిస్తాడు, తాత సహకరిస్తాడు… ఈ ప్రయత్నంలో తన ప్రియురాలితో బంధం భగ్నమయ్యే సిట్యుయేషన్ వచ్చినా డోంట్ కేర్ అంటాడు… అదీ కథ… 1997 నాటి కథ…
సినిమా పేరు… స్వాతి… ఒకప్పుడు మంచి మంచి కథాంశాలతో క్రాంతికుమార్ సినిమాలు తీస్తున్న రోజులు… శారద సింగిల్ మదర్, కాలం కాటేసిన బాధితురాలు… మరోవైపు పెళ్లాం చనిపోయిన జగ్గయ్య… వాళ్లిద్దరికీ తను పెళ్లిపెద్దగా పెళ్లి చేస్తుంది సుహాసిని… ఆ పెళ్లి తరువాత తనే కష్టాలపాలు అవుతుంది… తన జెనెటిక్ ఫాదర్‌ను కలుస్తుంది… అదంతా వేరే కథ… ఇది 1984 నాటి కథ…
Ads
తెలుగు డిజిటల్ ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సనాలిటీ మ్యాంగో రాముడికీ, సింగర్ సునీతకూ పెళ్లయ్యింది తెలుసు కదా… సునీత తన ఎదిగిన పిల్లలు ఆకాష్, శ్రేయలతో కలిపి, పెళ్లి వేదిక దగ్గర దిగిన ఈ ఫోటో చూడగానే గుర్తొచ్చిన సినిమాలు అవే… నిజానికి వేర్వేరు కథలే… సునీత కథకూ ఆ సినిమా కథలకూ సంబంధం లేదు… కానీ ఓ డిఫరెంట్ పిక్చర్… ఆ తల్లి మొహంలో చెప్పలేని ఏదో ఆనందభావన… ఆ పిల్లల మొహాల్లో తల్లి పట్ల ప్రేమ… కొత్తగా, హత్తుకునేలా ఉంది… అయితే..?
మీడియాలో, సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్… ఇలాంటివి హృదయానికి కనెక్ట్ అవుతాయి… మన తత్వాల్ని బట్టి సునీత నిర్ణయాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆ ఫోటోలోని ఆత్మీయభావన కాస్త సంబరంగా అనిపిస్తుంది… అదేసమయంలో రకరకాల చర్చలకు దారితీస్తుంది… సహజం… పాశ్చాత్య సమాజాల్లో అత్యంత సాధారణమైన ఇలాంటివి భారతీయ సమాజానికి ఇంకా కొత్తకొత్తే కాబట్టి…
పెద్దవాళ్లే… విడాకులు తీసుకుని, పెళ్లిళ్లు ఛిద్రమై, జీవన భాగస్వామి మరణించి… కారణాలు ఏవైతేనేం… ఒంటరిగా ఉండేవాళ్లు తోడు వెతుక్కోవడం, అనధికారికంగా కలిసి ఉండటం చూస్తూనే ఉన్నాం… ఎవరి పిల్లలు వాళ్లకు… పైగా సమాజం నుంచి నింద భయం… పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడవద్దనే భావన… అందుకని ఆ బంధాల్ని అధికారికంగా చేసుకోరు చాలామంది… దానికి భిన్నంగా సునీత… తన పిల్లల సమక్షంలోనే తనవంటి ఓ ఒంటరి మగపక్షిని పెళ్లాడింది…
ఇన్నేళ్లూ ఆ పిల్లలను పెంచడానికి తాను ఏం కష్టాలు పడింది..? ఇప్పుడే ఎందుకు అధికారికంగా పెళ్లి చేసుకుంటోంది..? అనే వివరాల జోలికి వెళ్లడం వేస్ట్… ఆమె వ్యక్తిగత జీవితం ఆమె సొంతం… రైట్ రాయల్‌గా ఇద్దరూ కాలర్లు ఎగరేసి, తలలు ఎత్తుకుని, అందరికీ చెప్పి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అందులో తప్పుపట్టడానికి కూడా ఏమీలేదు… కానీ చర్చ అమ్మలక్కల్లో ఏ దిశలో జరుగుతూ ఉంటుందంటే..?
ఇద్దరూ ఎదిగిన పిల్లలే, వాళ్లకూ సొంత సర్కిల్స్ ఏర్పడ్డయ్… ఈ పెళ్లి వార్తలు వినగనే అడుగుతారు… ఏమిటోయ్ మీ మదర్ పెళ్లట కదా అని… వాళ్లెలా రిసీవ్ చేసుకుంటున్నారు..? వెనక వెక్కిరింపుగా నవ్వేవాళ్లూ ఉంటారు… అవును, మాకు గర్వంగా ఉంది అంటారా..? మలివయసులో ఒక తోడు అవసరం పట్ల ఆ ఇద్దరు పిల్లలూ కన్విన్స్ అయ్యారా..? ఇది తల్లి ఇష్టం కాబట్టి, తల్లి అంటే తమకు ఇష్టం కాబట్టి, ఇక మారుమాట్లాడకుండా ఊరుకుండిపోయారా..?
ఐనా పిల్లల చదువులు, పెళ్లిళ్ల మీద దృష్టిపెట్టాల్సిన వయసులో ఆమె ఈ పనిచేయడం ఏమిటి..? రేప్పొద్దున వాళ్లకు సంబంధాలు వచ్చినప్పుడు ఇవన్నీ మైనస్ అవుతాయి కదా..?….. ఇదుగో ఇన్ని ప్రశ్నల మీద కొద్దిరోజులపాటు చర్చ సాగుతూ ఉంటుంది… బట్, అఫ్కోర్స్, సునీత గానీ, రామ్ గానీ ఇవన్నీ ఆలోచించకుండా ఉండరు కదా… అన్నిరకాల లెక్కలూ వేసుకున్నాకే అడుగులు వేసే హైలీ మెచ్యూర్డ్ కదా… దిల్ రాజు ఈ లేటు వయసులో, లేతవధువును పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి దావత్ ఇవ్వలేదా..? సునీత చేసిందాంట్లో తప్పేముంది..? సో, సునీతకు, రామ్‌కూ ‘ముచ్చట’ హేపీ మేరీడ్ లైఫ్ అని అభినందనలు చెబుతోంది…
Share this Article