అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ కొరియోగ్రాఫర్… తన మీద పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురుస్తోంది తెలుగు నెటిజనం నుంచి..! విషయం ఏమిటంటే..? తమిళం, తెలుగు సినిమాల్లో డాన్సులు కంపోజ్ చేసే ప్రతి మాస్టరూ ఇప్పుడు తెలుగు టీవీ ప్రోగ్రాములు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు… ఎంతోకొంత సంపాదించుకుంటున్నారు సంతోషమే… రఘు, బాబా భాస్కర్, జానీ, యానీ, యశ్… మధ్యమధ్యలో శివశంకర్ కూడా వస్తుంటాడు… కేవలం ఢీ, డాన్స్ ప్లస్ అనే డాన్స్ ప్రోగ్రాముల్లోనే కాదు… వావ్, క్యాష్, జబర్దస్త్… అన్నీ వాళ్లవే ప్రస్తుతం… ఇక శేఖర్ మాస్టర్ గురించి చెప్పనక్కర్లేదు… ఈటీవీకి అతుక్కుపోయాడు… కానీ అకస్మాత్తుగా ఢీ-13 నుంచి మాయం అయిపోయాడు… ఢీ ఈసారి మరీ నాసిరకంగా ఉంది, హైపర్ ఆది, దీపికి పిల్లి విసిగించేస్తున్నారు… పైగా అన్నీ పాత డాన్సులే, మరీ రాబోయే ఎపిసోడ్లో పండు ‘నాదీ నక్కిలేసు గొలుసు’ ఆడవేషం పాట మళ్లీ పెట్టారు, అది గతంలోనూ చేశాడు తను… ఇంత నాసిరకం ప్లానింగుతో ఢీ కొనసాగుతూ ఉండగా….
హోంఖారన్నయ్య నిర్వహించే డాన్స్ ప్లస్ మరో విషాదం… బొచ్చెడు మంది జడ్జిలు ప్లస్ సూపర్ జడ్జి ఓంకార్… ఐనా పెద్దగా ఆకట్టుకోవడం లేదు షో… అందుకని ఏవేవో తిప్పలు పడుతూ ఫుల్ మసాలా, మెలోడ్రామాను యాడ్ చేస్తున్నాడు తను… అకస్మాత్తుగా రఘు మాస్టర్ ఒకరి డాన్స్ ఆపేయమంటాడు… అదొక డ్రామా… హఠాత్తుగా ముమైత్ మీద ఫిర్యాదు చేస్తాడు ఓ కంటెస్టెంట్ గ్రూపు లీడర్, తనకు వత్తాసు పలుకుతాడు ఓంకార్… చివరకు ఆ కంటెస్టెంట్ మూతికి బట్ట (మాస్క్ కట్టి) మరీ ముమైత్ బుగ్గల మీద ముద్దు పెట్టి రాజీ కుదురుస్తాడు… ఇలా ప్రోమోల కోసం వేయించే వేషాలు, డ్రామాలతో షో క్వాలిటీ నానాటికీ నాసిరకం అయిపోతోంది… అందుకే ఈసారి ఢీ గానీ, డాన్స్ ప్లస్ గానీ ఎంత పోటీలు పడుతున్నా సరే… 4 నుంచి 5 రేటింగుల మధ్య కొట్టుకుంటున్నయ్…
Ads
ఈటీవీ ఢీ షోకి వద్దాం… శేఖర్ మాస్టర్ ఎందుకు ఈ షో నుంచి వెళ్లిపోయాడో తెలియదు… నిజానికి పూర్ణ, ప్రియమణి చాలు… కానీ ప్రియమణి కూడా తనకు విరాటపర్వం గట్రా షూటింగులు ఉండి తరచూ ఎగ్గొడుతోంది… పూర్ణకు కూడా ఈమధ్య ఒకటీరెండు సినిమా అవకాశాలు దక్కాయి… సో, గణేష్ మాస్టర్‌ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు… నిజానికి శేఖర్ మాస్టర్ ప్రదీప్, సుధీర్, ఆదిలతో కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు, వాళ్లలో కలిసిపోతాడు తను… దీంతో గణేష్‌ను చూసి మొహం చిట్లించడం మొదలెట్టారు ప్రేక్షకులు కానీ… రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించి ఒక్కసారిగా తను హీరో అయిపోయాడు,.. ఎలాగంటే..?
ఎవరో పాయి అనే ఓ కంటెస్టెంట్ ఓ పాటలో చేశాడు, పాట బాగా వచ్చింది… తనను పరిచయం చేస్తూ ‘‘ఈయనకు తండ్రి లేడు, తల్లి నెలజీతం 1500’’ అని సదరు గ్రూప్ లీడర్ చెప్పాడు… అప్పుల వాళ్లు వస్తే ఇంట్లో లేనని చెప్పించేది సాయి వాళ్ల అమ్మ అని తోటి కంటెస్టెంట్ కూడా బాధపడ్డాడు… వెంటనే గణేష్ అందుకుని ‘సాయీ, మీకు మొత్తం అప్పు ఎంత ఉంది’’ అనడిగాడు, ‘4 లక్షలు సార్’ అన్నాడా అబ్బాయి… షో షూటింగ్ అయ్యాక నన్ను కలువు, నేనిస్తాను అని గణేష్ ప్రకటించేశాడు… అది నిజమా..? మరీ ఓంకార్ బాపతు కృత్రిమ మసాలాయా..? అనేది వదిలేయండి… గణేష్ మాటల్లో నిజాయితీ కనిపించింది… ఆ సమయానికి అలా స్పందించాడు… గ్రేట్… ఆది అందుకుని ‘‘మీరు పవన్ కల్యాణ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు, ఇప్పుడు ఈ విషయంలో నాకు పవన్ కల్యాణ్‌లా కనిపించారు…’’ అని ప్రశంసించాడు… ఇంకేముంది..? ఈ ప్రోమో కామెంట్లు గణేష్‌కు అభినందనలతో దద్దరిల్లిపోతున్నయ్… అందరి కష్టాలూ ఏ ఒక్కరో తీర్చలేకపోవచ్చు… ఓ సందర్భం వచ్చినప్పుడు అలా సాయం చేసే ప్రకటన వచ్చేస్తుంది… అభినందించాలి… ఇంకొకరు స్ఫూర్తి పొందేలా…!!
Share this Article