ఇప్పటి ట్రెండ్ ఏమిటి..? ఒక స్టార్ హీరో సినిమా తీస్తే… కనీసం నాలుగైదు భాషల్లో… చేతనైతే ఏడెనిమిది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా పేరిట దేశమంతా విడుదల చేయడం… ప్రతి భాషలోనూ టీవీ రైట్లు, ఓటీటీ రైట్లు, ఓవర్సీస్ రైట్లు కలిపి కుమ్మేసుకోవాలి… థియేటర్లలో హోర్డింగులు గట్రా ఫుల్ హైప్ క్రియేట్ చేయడం… సినిమాలో ఫుల్ మాస్ మసాలా నింపేయడం… కథా మన్నూమశానం ఎలా ఉన్నా పర్లేదు, కథనం సంగతి వదిలేయండి… వేయి శాతం హీరోయిక్ ఫైట్లు, పిచ్చి డాన్సులు ఇరగదీసేయాలి అంతే… ఇదే కదా ట్రెండ్…! కానీ ఈ మోహన్ లాల్ ఏమిటిలా చేశాడు..? అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయిన దృశ్యం సినిమాకు సీక్వెల్ తీశారు… దాదాపుగా అదే తారాగణం… ఎక్కడ ఆ సినిమా ఎండ్ అయ్యిందో ఈ సీక్వెల్ అక్కడే స్టార్టవుతుంది… నో థియేటర్ రిలీజ్, కేవలం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల… అదేమిటీ, కేరళలో కరోనా కేసులు ఎక్కువ కాబట్టి ఇంకా థియేటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుందాం… కానీ అంతటి సూపర్ హిట్ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే డబ్బులే డబ్బులు కదా… ఎందుకిలా చేశాడు..?
ఎందుకంటే..? ఈ సీక్వెల్ నిర్మాతలు తొందరపడదలుచుకోలేదు… ఎంచక్కా రీమేక్ హక్కులే అమ్మేసుకుంటారు… ఫుల్ గిరాకీ… తరువాత అన్ని భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అవుతుంది… అందుకని ఇక డబ్బింగు జోలికి, పాన్ ఇండియా హంగామా జోలికి పోలేదు… పాన్ ఇండియా రిలీజులతో ఎక్కువ డబ్బు వస్తుందా..? రీమేక్ రైట్స్ అమ్మకంతో ఎక్కువ డబ్బు వస్తుందా అనేది వేరే పెద్ద చర్చ… కానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి… మన సౌత్ మాత్రమే కాదు, అన్ని భాషల్లోనూ అంతే… ముసలి హీరోలు వెండితెరను వదలరు… పిచ్చి గెంతులు, తిక్క ఫైట్లతో, బూతు పాటలతో ఏదో సోది కథను చూపించేసి, తమ ఇమేజీ అనే తొక్కలో భ్రమపదార్థాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు… కానీ మళయాళ స్టార్లు కాస్త నయం… కథకు, కథనానికి ప్రాధాన్యం ఇస్తారు… ఆ పాత్రలోకి దూరిపోతారు… సోకాల్డ్ కమర్షియల్ అంశాల్ని పెద్దగా పట్టించుకోరు… అదో ఇదో ఎందుకు..? ఈ దృశ్యం-2 మూవీయే పక్కా ఉదాహరణ…
Ads
సీక్వెల్ కదాని ఇష్టమొచ్చినట్టుగా చుట్టేయలేదు… ఫస్ట్ సినిమాకు ఎంత కష్టపడ్డారో ఈ స్క్రిప్టుకు అంతకన్నా ఎక్కువే కష్టపడ్డట్టు కనిపిస్తుంది… ఇలాంటి థ్రిల్లర్లకు కథనంలో గ్రిప్పే బలం, ప్రాణం… ఫస్ట్ సినిమాలో శవం లేదు, కేసు లేదు… అంతటి పోలీసమ్మ విసిగిపోయి, వదిలేస్తుంది, వెళ్లిపోతుంది… కానీ కథ అక్కడితో ముగియలేదు… ఈ సీక్వెల్ అదే… పోలీసులు కేసు రీఓపెన్ చేస్తారు… ఆ విషయం బయటపెట్టకుండా సాక్ష్యాధారాల్ని సేకరిస్తుంటారు… ఓ థియేటర్ ఓపెన్ చేసి, నిర్మాతగా కూడా మారాలనుకునే హీరో ఇక పోలీసుల ప్రయత్నాలకు కౌంటర్లు మొదలుపెడతాడు… కేవలం ఓ క్రైం సినిమాగా గాకుండా… హీరో పెద్ద కూతురు భయాన్ని జయించలేక తరచూ ఫిట్స్‌కు గురికావడం, హీరో లైఫ్ స్టైల్ మారిపోయి, తన అంతస్థు పెరిగేసరికి అప్పటిదాకా స్నేహభావంతో ఉన్న ఇరుగూపొరుగూ ఈర్ష్య పెంచుకోవడం గట్రా అదనపు అంశాల్ని జోడించి కథకు మరింత చిక్కదనం, రుచి తీసుకొచ్చారు… ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది కానీ కేవలం మళయాళ వెర్షన్‌ను ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో చూసుకోవాలి… కానీ మనకేమో మన భాషలో చూస్తేనే మజా… ఇందులో ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కథనంలో ట్విస్టులకే ప్రాధాన్యం… కానీ ఏమాటకామాట… మన ముసలి ముదుర్లు కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తే ఈరోజుకూ ఒకటే ఇబ్బందిపడిపోతుంటారు… కానీ మోహన్‌లాల్ వంటి నటన తెలిసిన సీనియర్లు ఎలాంటి చాలెంజింగ్ పాత్రనైనా సరే, ఎంత అలవోకగా, ఎంత అవలీలగా తమ భుజాలపై మోస్తారో చూడాలంటే ఇలాంటి సినిమాల్ని చూస్తుండాలి మనం కూడా…!! తనతోపాటు ఈ దర్శకుడు జీతూ జోసెఫ్‌కు ‘‘ముచ్చట’’ కాంప్లిమెంట్స్..!!
Share this Article