అంటే అన్నామంటారు గానీ… ఈ వార్త చూశారా..? ఇంకెవరు..? ప్రపంచ పాత్రికేయానికే కొత్త పాఠాలు నేర్పించే నమస్తే తెలంగాణలోనే..! కేసీయార్ అసహనంతో ఉడికిపోతున్నాడు… ఇంకా రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోలేదా..? నాన్సెన్స్, కాంగ్రెస్ సీనియర్లు ఏం వెలగబెడుతున్నారు..? అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా రేవంత్ పోస్టు ఊడబీకలేదేమి..? హయ్యారే, ఎంత దుర్భరం ఈ నిరీక్షణ అంటూ…
ఫామ్ హౌజులో రుసరుసలాడుతున్నాడు… తన మైకే కదా… నమస్తే అదే ఫీలింగును తీసుకొచ్చి పత్రిక అనబడే ఆ కాగితాలపై ముద్రిస్తోంది… చూడండి, రెండు మూడు నెలల్లో రేవంతుడి పని మటాష్ అని ఏదో భీకరంగా… తను మెట్లన్నీ దిగొచ్చి మీడియా పాయింట్ దగ్గర చెప్పినట్టు గుర్తు… ఐనా ఇంకా కావడం లేదు…
నిన్న, మొన్న రాసిన ప్రత్యేక కథనాలు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొచ్చినవే… హైకమాండ్ బుసబుస, పొంగులేటిపై అందుకే రేవంత్ రుసరుస… అందుకే మంత్రివర్గ విస్తరణ లేదు, పీసీసీ అధ్యక్షుడు లేడు, కార్పొరేషన్ పదవులు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు… అసలే ఖర్గే కస్సుమంటున్నాడు… అందుకే ఈ జాప్యం, మంత్రులందరూ అందుకే దూరం దూరం ఉంటున్నారు… అంటూ, రేవంత్ సర్కారు రేపోమాపో కూలిపోతుంది అన్నట్టుగా తెగ రాసేస్తోంది… కొంత నయం, నమస్తే సాక్షి కాస్త సంయమనం పాటిస్తున్నది…
Ads
సరే, అవన్నీ వదిలేస్తే పైన వార్త చూశారుగా… వరదల్లో జనం అట, సచివాలయానికి సీఎం అని శీర్షిక… జస్ట్, మంత్రులకు ఆదేశాలు అట… నిజానికి పాలకుడు ఇలాంటి విపత్తు సమయాల్లో మొత్తం యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, తను సమీక్షించుకోవాలి… తనే వరద ప్రాంతాలకు వెళ్తే అది సహాయక చర్యలకు మరీ విఘాతం…
ఐనా సరే, ఈ బురద రాతలు, దురద కూతలకు భయపడి మంత్రులు… మరీ హరీష్ రావు కొక్కిరిస్తున్న ముగ్గురు మంత్రులు కూడా వరద సహాయక చర్యల్లోనే తిరుగుతున్నారు… మరీ సీతక్క నిర్విరామంగా వరద ప్రాంతాల్లో తిరుగుతోంది… పొంగులేటి, తుమ్మల, భట్టి కూడా… నిజం చెప్పాలంటే, ఖమ్మం, వరంగల్ పాత జిల్లాల కలెక్టర్లు కూడా యాక్టివ్ అయిపోయారు… చివరకు రేవంత్ కూడా ఈరోజు బయల్దేరాడు, తనకూ ఈ బురద రాజకీయం చిరాకెత్తినట్టుంది…
నిన్నటి నుంచీ మనం అనుకుంటున్నదే కదా… రేపటి నుంచి ఇక బురద రాజకీయం స్టార్ట్ అవుతుందీ అని… మొదలెట్టారు… ఖమ్మంలో ఎన్ని సీట్లు ఇచ్చారు ప్రజలు, మీరేం చేశారు అంటూ… తనపై జనంలో ఉన్న కాస్తో కూస్తో సాఫ్ట్ కార్నర్‌ను కూడా సమాధి చేసుకుంటున్నాడు… విదేశాల్లో తిరుగుతున్న కేటీఆర్ ట్వీట్లతో బురద జల్లుతున్నాడు… అయ్యా, పెద్ద నేతలూ… కాస్త రెండు రోజులాగండి, తరువాత మీ ఇష్టమొచ్చినట్టు తిట్టండి, బురద జల్లండి, ఎలాగూ కాచుకుని ఉన్నారు కదా…
సీఎం సచివాలయానికి రాలేదట, నమస్తే రాత, టీన్యూస్ కూత… హహహ… అసలు సచివాలయం మొహమే చూడని కేసీయార్ మీడియా అది… రేవంతుడు సచివాలయానికి రావడం లేదని ఆక్షేపిస్తోంది… నవ్వొచ్చే వైఖరి… కొండగట్టులో అంతమంది బస్సు ప్రమాదంలో చనిపోతే కేసీయార్ డోన్ట్ కేర్ అన్నట్టు వ్యవహరించిన తీరు గుర్తుందా..? సీతక్క భలే కౌంటర్ చేసింది…
ఎల్లప్పుడూ చంద్రబాబుపై టన్నులకొద్దీ విషాన్ని చిమ్మే brs ఇప్పుడు బాబు వరదల్లో బాగా పనిచేస్తున్నాడని కితాబు ఇస్తోంది… రేవంత్ ను తిట్టడానికి… అసలు ఒక రాజకీయ పార్టీగా brs వరద బాధితులకు నాలుగు రోజులు అండగా ఉండాలి కదా… మీకు అనేక తరాలు తినేంత సంపదని ఇచ్చింది ఈ తెలంగాణా… కృతజ్ఞత ఏది…?
అన్ని ఎందుకు..? హరీష్, కేటీఆర్ సరే… అసలు కేసీయార్ ఎందుకు మాట్లాడడు… కేటీయార్ విదేశాల నుంచే బురద జల్లినట్టుగా కేసీయార్ కూడా ఫామ్ హౌజు నుంచి స్పందించొచ్చు కదా… నో, తను ప్రతిపక్ష నేత, ఐనా నిల్ స్పందన… మరోవైపు ఈ బురద రాజకీయాల్లో మునిగిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు… అందరూ కాదులెండి, వాళ్లిద్దరూ, తాజా మెరుపు వద్దిరాజు, వద్దంటే మాట్లాడే జగదీషుడు… ఇంకెవరినీ మాట్లాడనివ్వరు కదా… ఫాఫం, వాళ్ల బాధ వాళ్లది…!!
Share this Article