.
అనుకోని ప్రమాదం… ఎస్ ఎల్ బి సి సొరంగంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిపై ఆశలు వదిలేసుకుంటున్న విషాదం… ఆ టన్నెల్ బోరింగ్ మిషన్, ఆ ప్రాజెక్టు స్థితే ప్రశ్నార్థకం కాబోతున్న దుస్థితి… సొరంగం లోపల పరుచుకున్న బురద…
అదే బురద తెలంగాణ రాజకీయాల్లో… మరింత చిక్కటి బురద… అటు ప్రమాదం జరిగిందో లేదో బీఆర్ఎస్ బురద రాజకీయం మొదలు… ఆలస్యమే లేదు… అదేదో రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధించడం అన్నట్టుగా…
Ads
కమీషన్ల కక్కుర్తితో పర్యవేక్షణ మరిచిపోయారు కాబట్టే ప్రమాదం అంటాడు కేటీయార్… ఈమధ్య తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు… అచ్చం నమస్తే తెలంగాణలాగా మారిపోయాడు… తనదే కదా… ఇది ప్రమాదం, కాస్త సంయమనం, పరిణతి అవసరం… అవి లోపిస్తే లాంగ్ రన్‌లో పొలిటికల్ కెరీర్‌కే ప్రమాదం… అదీ ఈ సొరంగం ప్రమాదంలాగే…
మేడిగడ్డ మీద నానా చవాకులూ పేలారు, ఇప్పుడేమంటారు అంటాడు ఓ మాజీ మంత్రి… తనకున్నదే చటాక్… ఇది ప్రమాదం, అది నాసిరకం… అవును, మేడిగడ్డ అంతే, కొన్ని పిల్లర్లే మళ్లీ కట్టాలట… చివరకు వేల కోట్లు పెట్టిన సచివాలయం కూడా అంతే… పెచ్చులు రాలుతూ ఇకపైనా ప్రమాదమేనట…
చివరకు యాదగిరిగుట్ట గుడి పునర్నిర్మాణమూ చేతకాకపాయె… సుంకిశాల చేపట్టింది ఎవరు..? ఆ ప్రమాదంపైనా విమర్శలే… అసలు సుంకిశాలతో హైదరాబాద్ అదనంగా ఒక్క లీటర్ తాగునీరు వస్తుందా..? నిజాల్లోకి వెళ్లి, అప్పుడు చెప్పండి… పైగా ఇన్నాళ్లూ అంటకాగి, వేదికల మీద సన్మానాలు చేసి, ఆ మేఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి, కేసులు పెట్టాలంటూ డిమాండ్లు…
ఎస్ ఎల్ బి సి సొరంగ ప్రమాదం వద్ద ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్, rat hole miners… ఇంతమంది శ్రమిస్తున్నారు వాళ్లను రక్షించడానికి… మంత్రులు అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు,.. ఏకంగా ప్రధాని, రాహుల్ గాంధీ కూడా పరిస్థితిని ఆరా తీస్తున్నారు… ఐనాసరే చేష్టలుడిగిన సర్కారు అని రాస్తుంది నమస్తే… అంటే బీఆర్ఎస్ క్యాంపు…
ఏడెనిమిది స్టోరీలు కుమ్మిపారేసింది… సీఎం పోలేదు అని విమర్శ… చివరకు కాంగ్రెస్ రేవంత్ పాలనను రోజూ కీర్తించే ఈపేపర్లూ అదే తోవ… బీజేపీ నేతలు ఎందుకు పోలేదు, బీఆర్ఎస్ నేతలు ఎందుకు పోలేదు అని కౌంటర్లు… ఏం చేయాలి వీళ్లంతా వెళ్లి..? రెస్క్యూ పనులకు అడ్డంకులుగా మారకపోతే…!
నిన్న మరీ ఘోరంగా కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు అని హెడింగ్ పెట్టింది… దిక్కుమాలిన పాత్రికేయం అనే పదం సరిపోదేమో… కాంగ్రెస్ ప్రాజెక్టు ఏమిటి..? ఆ పనులు అప్పగించినప్పుడు ఎవరు అధికారంలో ఉంది..? ఐనా మేడిగడ్డ కుంగినప్పుడు కుప్పకూలిన బీఆర్ఎస్ ప్రాజెక్టు అని రాసి ఉండాల్సిందా అందరూ… ఇదేం భాష..? ఇదేం పోకడ..?
యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తరువాత ప్రారంభసభను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాంలాగా నిర్వహించారు… బీఆర్ఎస్ గుడి అనలేదు కదా ఎవ్వరూ… (చివరకు స్వర్ణగోపురం ఆవిష్కరణ జరిగితే నెరవేరిన కేసీయార్ స్వర్ణసంకల్పం అని రాసుకుంది… మరి నీ స్వప్నాల గుడి, నీ స్వర్ణాల గుడి ఆ గోపుర ఆవిష్కరణకు వెళ్లలేదు సరే, కానీ నువ్వు యాదగిరిగుట్టకు వెళ్లక ఎన్నేళ్లయింది..?)
ఇలాగే ఉంటాయి నిజాలు… ప్రమాదాలు వేరు, నాసిరకం నిర్మాణాలు వేరు… కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే… ప్రమాదాల సందర్భాల్లో కాస్త హుందాగా, పరిణత రాజకీయం, సంయమనం ప్రదర్శించడం మేలు… సమాజానికి..! మరీ ఏపీ పాలిటిక్స్ తరహాలో వెగటు, కంపు రాజకీయాల దిశలోకి తెలంగాణ పాలిటిక్స్‌ను తీసుకుపోకూడదు..!! (సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న అనుచిత, కక్షరాజకీయం గురించి మరోసారి చెప్పుకుందాం…)
Share this Article