అంబానీ, ఆదానీ… ఈమధ్య పదే పదే వార్తల్లోకి వస్తున్న పేర్లు… రైతుల ఆందోళనల్లో ప్రముఖంగా వినవస్తున్న పేర్లు… మోడీ సర్కారు అంబానీలు, ఆదానీలకు జాతిసంపదను దోచిపెడుతున్నదనేది ఆరోపణ… ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని ప్రచారాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే… అంబానీతో మోడీ సర్కారు ఏదో ఒప్పందం కుదుర్చుకున్నదనే ప్రచారం పెరిగి పంజాబ్, హర్యానాల్లో రిలయెన్స్ మొబైల్ టవర్లను, రిటెయిల్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నారు… జియో కనెక్షన్ల పోర్టింగ్ పెట్టిస్తున్నారు…
ఓరి దేవుడోయ్, కంట్రాక్టు ఫార్మింగు మీద ఆసక్తే లేదు మాకు, మా వ్యాపార ప్రణాళికల్లో అది లేనేలేదు… ప్రభుత్వంతో ఏ ఒప్పందాలూ లేవు… ఏ భూములూ కొనలేదు… ఈ బుదర జల్లడం ఆపేయండ్రోయ్ అని రిలయెన్స్ లబోదిబోమంటోంది… సరే, ఆ ప్రకటనను అన్ని మీడియా సంస్థలూ కవర్ చేశాయి… ఈరోజు ప్రజాశక్తిలో ఓ వార్త కనిపించింది… అది సోషల్ మీడియాలో యాంటీ-మోడీ సెక్షన్ వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది… ఆ వార్త నిజమేనా అని చెక్ చేస్తే ఏడో పేజీలో దర్శనమిచ్చింది… జాలేసింది… చివరకు ప్రజాశక్తి మరీ ఈ స్థాయికి పడిపోయిందా అనిపించింది…
Ads
ఎస్.., ఆదానీ-మోడీ బంధం అందరికీ తెలుసు… ఆదానీ కోసం మోడీ ఏం చేయడానికైనా రెడీ అనేదీ నిజం… కానీ ఎప్పుడో యూపీయే హయాంలో జరిగిన ఒప్పందాలను తీసుకొచ్చి మోడీ మెడలో ఎందుకు వేయాలి..? ఒక నిజం చుట్టూ ఎంత వాదనను నిర్మించినా, ఎంత విమర్శను ఎక్కుపెట్టినా వోకే… ప్రజల కోణంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు… కానీ..?
అబద్దం చుట్టూ వార్తను, విమర్శను, రాజకీయ ఉద్దేశాల్ని అల్లితేనే సమస్య… ఒకసారి ఈ వార్త చూడండి… ఇందులో వండిన సారాంశం ఏమిటంటే..?
‘‘రైతుల నుంచి ఎఫ్‌సీఐ సేకరించిన ఆహారధాన్యాల నిల్వ కంట్రాక్టును 30 ఏళ్లకు వర్తించేలా మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేసింది… అడ్వాన్సుగా 700 కోట్లు కూడా ఇచ్చింది… ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే, త్వరలో మిగతా రాష్ట్రాలకు కూడా… మోడీ ప్రభుత్వం తమతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆదానీ అగ్రి లాజిస్టిక్స్ కంపెనీ తన వెబ్సైటులో కూడా పేర్కొంది… నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా సమాచారం ఇచ్చింది’’…. ఇదీ వార్త…
ఎలాగూ వెబ్సైటులో పెట్టారంటున్నారు కదా, చదువుదామని వెళ్తే… అక్కడ సైటు ఓపెన్ చేయగానే పెద్ద ‘‘ఫేక్ న్యూస్ అలర్ట్’’ అని కనిపించింది… ఆదానీ అగ్రి లాజిస్టిక్స్ తన వెబ్సైటులో పెట్టిన ఓ ప్రకటన ఏముంటుందీ అంటే..?
‘‘ఆహారధాన్యాల నిల్వ నిర్వహణ, రవాణాను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే నిర్ణయం 2000 సంవత్సరంలో తీసుకున్నారు… 2003లో ఎఫ్‌సీఐ గ్లోబల్ టెండర్లు పిలిచింది… 2005లో ఆ కంట్రాక్టును మాకు అప్పగించింది ప్రభుత్వం… 20 ఏళ్లకు వర్తించే ఆ కంట్రాక్టును 2007 నుంచి మేం చేపట్టాం… అంటే ఇప్పటికి 13 ఏళ్లుగా ఆ కంట్రాక్టును నిర్వహిస్తున్నాం… మేమే కాదు మరో 10 కంపెనీలు కూడా ఆహారపదార్థాల నిల్వ, రవాణ కంట్రాక్టుల్లో ఉన్నాయి…’’
ఆదానీ అన్నీ నిజాలే చెబుతాడని ఎవరూ భావించనక్కర్లేదు… కార్పొరేటు కంపెనీలకు అబద్ధాలు కూడా అస్త్రాలే… అయితే ఒక అబద్దాన్ని పత్రిక వార్తగా రాసేముందు కనీసం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చుగా..? మొన్నటికిమొన్న ఇదే సీపీఎంకు చెందిన నవతెలంగాణ 25 వేల మంది జవాన్లు తమ శౌర్యపతకాల్ని వాపస్ చేశారని ఓ పేద్ద వార్త రాసి, ఫ్యాక్ట్ చెక్‌లో భంగపడింది… చైనా అనుకూల భజనలతో తరించిపోతూ, ఈ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ ధోరణుల గురించి కాదు ఇక్కడ ఇష్యూ… అసలు ఇలాంటి వార్తలు రాస్తున్నప్పుడు, ఎదుటివాళ్లను వేలెత్తి చూపే నైతికత ఎలా ఉంటుందనేదే ప్రశ్న…!!
Share this Article