.
Subramanyam Dogiparthi
……. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ ముద్దుల క్రిష్ణయ్య . మ అనే అక్షరం వీళ్ళకు బాగా కలిసొచ్చింది . 28 సెంటర్లలో వంద రోజులు , మూడు సెంటర్లలో సంవత్సరం పాటు ఆడి డబ్బుల వర్షం కురిసింది .
ఏముందంట ఈ సినిమాలో ? సగటు ప్రేక్షకుడి వినోదానికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి . గ్రామాలలో ఇప్పటికీ ఎంతో ఇష్టమైన ఉట్టి కొట్టటం ఉంది , ఊళ్ళో ఆడపిల్లలంతా హుషారు హుషారుగా ఆడటం ఉంది , డాన్సులు ఉన్నాయి , శ్రావ్యమైన పాటలు ఉన్నాయి , వీర ఫైట్స్ ఉన్నాయి .
Ads
శృతి మించిన శృంగారం ఉంది . కాస్తంత బూతు ఉంది . జనం చేత చివాట్లు కూడా తిన్నారు . కొంతమంది జనం భలేటోళ్ళు . తప్పు తప్పు , వద్దు వద్దు అంటేనే ఆ బూతుని చూస్తారు . దాన్ని వదిలేద్దాం .
ఈ 1+2 సినిమాలో బాలకృష్ణ తన అభిమానులకు పండగ చేసాడు . చలాకీగా , రియల్ హీరోలా అలరించాడు . ఇద్దరు ముద్దుగుమ్మల్లో విజయశాంతిది నటించే అవకాశం ఉన్న పాత్ర . గ్లామర్ని ఆరబోస్తూ , తన నటనా ప్రతిభను కూడా చూపింది . ఊరి నుండి నిష్క్రమిస్తూ ఊరి ప్రజలతో పాటు ప్రేక్షకుల చేత కూడా అయ్యో పాపం అనిపించుకుంటుంది . రాధ తల బిరుసులో , అహంకారంలో తల్లి నోట్లో నుంచి ఊడిపడ్డ కూతురుగా బాగా నటించింది .
మరో ముఖ్య పాత్ర , సినిమాకు గుండె కాయ యస్ వరలక్ష్మిది . ఇలాంటి అరుపుల పాత్రలకు ఆమె పెట్టింది పేరు . అలాంటి పాత్రలకు ఆమెకు ఆమే సాటి . యస్ వరలక్ష్మి , బాలకృష్ణల మధ్య యుధ్ధం సీన్ , పద్యాలను విసురుకోవటం బ్రహ్మాండంగా ఉంటుంది . యస్ వరలక్ష్మి గాత్రంతో జనం చెవుల్లోని తుప్పు వదిలిపోతుంది . ఈ ఐడియా వచ్చినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి .
ఇంక మంగళగిరి రమణమ్మ గారి మొగుడి పాత్ర . భార్యాభయస్తుడిగా గొల్లపూడి మారుతీరావు బాగా నటించారు . మరో పాత్ర నిర్మలమ్మది . ఆమెకూ ఇలాంటి పాత్రలు కరతలామలకం . కోడి రామకృష్ణ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపించే వయ్యారి ప్రౌఢ వై విజయ అతిధి పాత్రలో తళుక్కుమంటుంది . ఇతర పాత్రల్లో కల్పనారాయ్ , అనిత ప్రభృతులు నటించారు .
ఈ సినిమాలో అద్భుతమైన పాట సురుచిర సుందరవేణి పాట , దాని చిత్రీకరణ . పాటను వ్రాసిన సి నారాయణరెడ్డి గారిని , పాడిన బాలసుబ్రమణ్యం సుశీలమ్మలను , అంత అందమైన నృత్యాన్ని కంపోజ్ చేసిన శివ సుబ్రమణ్యాన్ని , చక్కటి కాస్ట్యూమ్సుని కుట్టిన టైలర్సుని , చిత్రీకరించిన కోడి రామకృష్ణని , బ్రహ్మాండంగా నటించిన విజయశాంతి , బాలకృష్ణలను అభినందించాలి . ఇంతకుముందు చూసి ఉన్నా మళ్ళా చూడొచ్చు ఈ పాటను .
ఏం చేయను ఎలా ఆపుకోను అంటూ సాగే రాధ , బాలకృష్ణ డ్యూయెట్ బాగున్నా చాలా వివాదాస్పదం అయింది . చివరకు ప్రేక్షకులకు , విమర్శకులకు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది . ఇప్పుడు సెన్సార్ లేని కొన్ని OTT సినిమాల్లో లాగా మూలుగుళ్ళు కోడి రామకృష్ణ మార్క్ శృంగారంగా విమర్శలకు గురయింది . రాసిన వాళ్లెవరో గానీ ‘దప్పిగొన్న మేఘమా దాహమింక తీరిందా’ అంటాడు ఓచోట… మేఘానికి దప్పిక ఏమిటో… హీరోహీరోయిన్ల రతిక్రీడ తరువాత చెట్టు మీద నుంచి పిట్టలు రాలిపడటమేమిటో దర్శకుడికే ఎరుక…
ఒంగోలు గిత్తా టీజింగ్ సాంగ్ , కృష్ణయ్య దూకాడు , ఇడిగో చెట్టు చాటుగా వంటి జన రంజక పాటలు బాగుంటాయి . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం . చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ . ఇప్పటి ఢాం ఢాం సంగీత దర్శకులు , సౌండ్ ఇంజనీర్లు , ఎడిటర్లూ ఇలాంటి సినిమాల నుండి నేర్చుకోవాలి . ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ , నల్లవాడె అమ్మమ్మ అల్లరి పిల్లవాడె ట్యూన్లను బేక్ గ్రౌండ్లో చక్కగా రెండు సన్నివేశాలలో అమర్చారు . అదీ సంగీత దర్శకత్వం అంటే .
యస్ వరలక్ష్మి , నిర్మలమ్మలు ఉంటే వాళ్ళ లెవెల్లో డైలాగ్స్ ఉండాలి . అలాగే వ్రాసారు గణేష్ పాత్రో . సాహుల్ ఫైట్లను బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు . కడియం , బుర్రిలంక గ్రామాల్లో షూటింగ్ చేయబడిన ఈ సినిమా 1986 ఫిబ్రవరిలో వచ్చి రికార్డుల పరంపరను సృష్టించింది .
ఈ మాస్ మసాలా వినోదాత్మక సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ అభిమానులు మళ్ళా మళ్ళా చూడొచ్చు . అలాగే ముద్దుగుమ్మలు విజయశాంతి , రాధల అభిమానులు కూడా . యస్ వరలక్ష్మి గొంతు విని చెవుల తుప్పు వదిలించుకోవాలని అనుకునే వారు కూడా . సందేశాలు , సందేహాలు వంటివి ఏం ఉండవు . ఫుల్ అల్లరి , వినోదం . That’s all . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article