.
Subramanyam Dogiparthi ….. ప్రేమనగర్ వంటి బ్లాక్ బస్టర్కి దర్శకత్వం వహించిన కె యస్ ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చింది ఈ ముద్దులమొగుడు సినిమా . చాలా బలహీనమైన స్క్రీన్ ప్లే . ఆయనే తయారు చేసుకున్నారా అనే అనుమానం వస్తుంది .
డబ్బులో గారాబంగా పెరిగిన అమ్మాయి ఆర్ధికంగా తన కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మగవాడిని పెళ్ళి చేసుకుంటే ఉత్పన్నమయ్యే సమస్యల మీద కుప్పలకుప్పలు సినిమాలు వచ్చాయి .
Ads
అలాంటి కధాంశాన్ని తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా బలంగా , బిర్రుగా , కన్విన్సింగుగా ఉండాలి . అది లోపించటం వలనే పెద్ద పెద్ద నటులు ఉన్నా , ఆత్రేయ గారి పాటలు , యస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో శ్రావ్యమైన సంగీతం ఉన్నా బాక్సాఫీస్ వద్ద చతికిలపడి పోయింది ఈ సినిమా . అయినా , ఈ సినిమాలో కొన్ని విశేషాలు ఉన్నాయి . ముఖ్యంగా అక్కినేని పాత్ర .
బహుశా ఇలాంటి పాత్ర ఆయన మరొకటి వేయలేదు . రంగస్థల నటుడు , Standup Comedian . 40 సంవత్సరాల కిందే స్టేండప్ కమేడియన్ పాత్రను తెలుగు సినిమాలో పెట్టడమంటే గొప్పే . అక్కినేని ఆ పాత్రను అద్భుతంగా పోషించారు . నటసామ్రాట్ అనే బిరుదుకు న్యాయం చేసారు . సినిమాలో కూడా హాస్య రస చక్లవర్తి , నవ్వుల నటసామ్రాట్ అనే బిరుదులు ఉంటాయి .
మాటలు , పాటలు అన్నీ ఆత్రేయ గారివే . పాటల్ని బాగా వ్రాసారు . నవ్వండి నవ్వండి అంటూ సాగే ఒక పాటలో నవ్వుల్లో రకాలని అభినయిస్తూ సాగే అక్కినేని నటనకు హేట్సాఫ్ చెప్పాల్సిందే . ఈ వీడియోని ఏ సినీ ప్రేమికుడు , కళాకారుడు , ప్రియదర్శిని వంటి స్టేండప్ కమేడియన్ పొరపాటున కూడా మిస్ కాకూడదు . అంత గొప్పగా నటించారు అక్కినేని .
అక్కినేని కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉంటాయి . అక్కినేనిని , శ్రీదేవిని చాలా అందంగా చూపారు . అన్ని డ్యూయెట్లలో అదరగొట్టారు . మల్లె తెల్లగా మంచు చల్లగా పాటలో అక్కినేని డాన్స్ చాలా బాగుంటుంది . నృత్య దర్శకుడు సలీంని అభినందించాలి . నవ్వించి కవ్వించె నటరాజుని నేనే పాటలో కూడా ఇద్దరి స్టెప్పులు బాగుంటాయి .
రండి రారండి అనే పాటలో స్టేజి మీద అక్కినేని డాన్స్ పెర్ఫార్మన్స్ బాగుంటుంది .దానిని స్టేండప్ కామెడీ లాగా డాన్సింగ్ కామెడీ అని అనవచ్చు . తొలి నే చేసిన పూజాఫలము వెలిసిన నాపాలి దైవమా అంటూ సాగే పాట శరత్ బాబు , సుహాసినిల మీద చిత్రీకరించబడింది . యస్ రాజేశ్వరరావు గారి సంగీత సౌరభాన్ని ఆస్వాదించవచ్చు .
ఎంత వింత ప్రేమ ఇదీ ఎంత మంచి భాష ఇదీ అనే విషాద పాట , ఎందరికి తెలుసు ప్రేమంటే అనే క్లైమాక్స్ పాటల్లో సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది . Undoubtedly unmissable . సంగీత సాహిత్య ప్రియులు ఈ పాటల వీడియోలను తప్పక చూడాలి .
అక్కినేని , శ్రీదేవి , శరత్ బాబు , సుహాసిని , సత్యనారాయణ , యస్ వరలక్ష్మి , ధూళిపాళ , నాగేష్ , మిక్కిలినేని , ప్రభృతులు నటించారు .
చెరుకూరి ప్రకాశరావు నిర్మాతగా 1983 ఫిబ్రవరిలో వచ్చింది . అక్కినేని , శ్రీదేవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు . పాటల్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article