ముద్రగడ పద్మనాభం రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో కనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను ఉద్దేశించిన రాసిన లేఖ… అక్కడక్కడా చురకలు పెడుతూ, పరోక్షంగా వెక్కిరిస్తూ సాగింది ఆ లేఖ… ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందీ అంటే… రాధాకృష్ణ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని ఇంటర్వ్యూ చేస్తూ ముద్రగడ ప్రస్తావనను తీసుకొచ్చాడు… పద్మనాభం వగైరా వాళ్లు కాపుల గురించి మాట్లాడతారు కదా, ఒక్కరినైనా ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువచ్చారా అని రాధాకృష్ణ ప్రశ్నిస్తే, రామానాయుడు నో అని జవాబు చెప్పాడట… అదీ ముద్రగడకు చర్రుమంది…
ఆయన ఏం అడిగాడో, ఏం జవాబు వచ్చిందో, ఈయన ఏం ఆక్షేపిస్తున్నాడో కాసేపు వదిలేస్తే… రెండుమూడు అంశాలు కాస్త ఆశ్యర్యంగా అనిపించాయి… అందులో ఓ చిన్న విషయం… రాధాకృష్ణ ఏకవచనంలో మాట్లాడటాన్ని ముద్రగడ అగౌరవంగా భావించడం… ఇలా మాట్లాడే పత్రికాధిపతిని చూడలేదట… ఒక కోణంలో ఆయన విమర్శ కరెక్టే… కానీ రాధాకృష్ణ రూట్స్, పాలిటిక్స్ ఆంధ్రా కావచ్చుగాక, కానీ తను నిజామాబాద్ సెటిలర్… తన మాటలో ఆ తెలంగాణతనం అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది… తెలంగాణ భాషలో ఏకవచనం, బహువచనం తేడాలుండవ్… దొరనైనా నువ్వు అనే అంటారు… పైగా నాకు బాగా తెలిసినవాడే కదానే చనువు కూడా ఏకవచన ప్రయోగానికి చాన్సిచ్చి ఉండవచ్చు…
Ads
రామానాయుడి అభిప్రాయాన్ని లాగడానికి, చెప్పించడానికి కొన్ని ప్రశ్నలు వేసి ఉండవచ్చు… దాన్ని జర్నలిస్టు కోణంలో చూడాలే తప్ప అందులో ముద్రగడను అవమానించినట్టుగా ఏమీ అనిపించడం లేదు… ఆంధ్రజ్యోతి పాత యజమాని కేఎల్ఎన్ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి, ముద్రగడ తండ్రి వోటు వేయడం, మరో పదిమందితో వోట్లు వేయించడం నిజమే కావచ్చుగాక… దానికీ రాధాకృష్ణకూ ఏం సంబంధం..? కేఎల్‌ఎన్‌కు ముద్రగడ తండ్రి సాయం చేస్తే, రాధాకృష్ణ ముద్రగడ పట్ల కృతజ్ఞతతో ఉండాలా..? హేమిటో, అర్థం కాలేదు…
డొక్కు సైకిల్, డొక్కు స్కూటర్ మీద తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు వందల కోట్లకు ఎదిగితే అది సక్సెస్ స్టోరీ అవుతుంది తప్ప చీదరించుకునే చరిత్ర ఎలా అవుతుంది..? పైగా ఈ లేఖలో ఆరోపించినట్టు సంస్థ యజమానిని కుర్చీ నుంచి కాళ్లు పట్టుకుని లాగి, ఆ కుర్చీలో కూర్చున్నాడనేది నిజమేనా..? అప్పటికే ఆ పత్రిక మూతపడింది… ఓ నలుగురైదుగురు పెట్టుబడిదారులను కూడగట్టి (కులహితులే కావచ్చుగాక) ఆ పత్రికను కొనుక్కున్నాడు రాధాకృష్ణ… అప్పట్లో అదొక సాహసం… దాన్ని నిలబెట్టడానికి నానా ప్రయాస… అది ఫీల్డులో ఉన్నవాళ్లకు తెలుసు…
వీణ-వాణి పేరిట సాగించిన వసూళ్లు రాధాకృష్ణకు ఇప్పటికీ చెరుపుకోలేని మరకే… అందులో సందేహం లేదు… పచ్చచొక్కా, చంద్రబాబు పట్ల విధేయత, మరికొన్ని విమర్శలు ఉండవచ్చుగాక… (తన పొలిటికల్ లైన్ తనిష్టం…) కాకపోతే ‘‘నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచుకున్న కోట్ల డబ్బును బంగారం షాపుల వాళ్లను బెదిరించి, చలామణీలోకి తీసుకురావడం అనేది కొత్త విమర్శ… బయటికి గతంలో వినిపించలేదు… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ముద్రగడ రాసిన ఈ లేఖ జర్నలిస్ట్, పొలిటికల్ సర్కిళ్లలో హల్‌చల్ క్రియేట్ చేస్తున్నదనేది నిజం… లేఖలోని నిజానిజాలేమిటో రాధాకృష్ణ పెద్దగా స్పందిస్తాడనీ, జవాబు ఇస్తాడనీ అనుకోలేం… అదీ నిజమే…
Share this Article