.
Subramanyam Dogiparthi
….. మురళీమోహన్ స్వంత బేనరయిన జయభేరి సంస్థ నిర్మించిన హిట్ సినిమా ఈ ముగ్గురు మిత్రులు సినిమా … 20 కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఫీల్ గుడ్ , హిలేరియస్ , ఫేమిలి ఎంటర్టైనర్ .
ధర్మాన్ని , చట్టాన్ని , న్యాయాన్ని కాపాడే వ్యక్తులు ముగ్గురు మిత్రులుగా శోభన్ బాబు , మురళీమోహన్ , చంద్రమోహన్ నటించారు . వాళ్ళకు జోడీలుగా సుహాసిని , సుమలత , తులసి నటించారు . క్రిమినల్ అయిన తండ్రి వదిలేస్తే శోభన్ బాబు తల్లిదండ్రులు వద్దే పెరుగుతాడు మురళీమోహన్ . చంద్రమోహన్ కూడా శోభన్ బాబు తల్లిదండ్రుల వద్దే పెరుగుతాడు . ముగ్గురూ ప్రాణానికి ప్రాణంగా పెరుగుతారు .
Ads
విధి నిర్వహణలో పోలీస్ ఇనస్పెక్టర్ అయిన మురళీమోహన్ ఒక క్రిమినల్ని జైలుకు పంపుతాడు . వాడు కక్ష కట్టి మురళీమోహన్ భార్య సుమలత మీద అఘాయిత్యం చేస్తాడు . ఆమెను రక్షించడానికి వచ్చిన శోభన్ బాబు చేతిలో ఆ క్రిమినల్ గాయపడతాడు . గాయపడిన క్రిమినల్ని వాడి బాస్ చంపేసి నేరాన్ని శోభన్ బాబు మీదకు నెట్టేస్తారు .
మిత్రుడిని రక్షించేందుకు ఓ నకిలీ భార్యను దించుతాడు లాయర్ చంద్రమోహన్ . ఆమె సాక్ష్యంతో శోభన్ బాబు కేసు నుండి విడుదల అవుతాడు . అక్కడ నుండి ఎలాగైనా దోషి శోభన్ బాబుని అరెస్ట్ చేయాలని ఇనస్పెక్టర్ మురళీమోహన్ ప్రయత్నిస్తూ ఉంటాడు . సెకండ్ హాఫ్ అంతా ఈ దోబూచులాటలు , ఎత్తుకు పైఎత్తులు , సందడి సందడిగా పరుగెత్తుతుంది సినిమా .
బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు దర్శకుడు రాజాచంద్ర . ముగ్గురు హీరోలు బాగా అనుభవం ఉన్న నటులు కావడంతో సినిమా కూడా అంతే బిర్రుగా నడుస్తుంది . సరదాసరదాగా , ఎమోషనల్గా , సెంటిమెంటల్గా , మంచి డ్రామాతో నడుస్తుంది సినిమా . ఈ హిలేరియస్ సినిమాకు తగ్గట్లుగానే గణేష్ పాత్రో పదునైన డైలాగులను వ్రాసారు .
మంచి పిండి ఉంటేనే మంచి రొట్టె అవుతుంది . బిర్రయిన కధ ఉంటేనే విజయవంతం అయ్యే సినిమా తయారవుతుంది . ఈ సినిమా విజయానికి కారణం కధే . ముగ్గురు మిత్రులూ ఏదో విధంగా ఒకరికి ఒకరు కావలసిన వారేగా కధను నేసారు . ముగ్గురు మిత్రులలో ఒకరయిన మురళీమోహన్ చెల్లెలుగా సుహాసిని . ఆమె శోభన్ బాబుకు భార్య అవుతుంది .
తాను చెల్లెలుగా భావించే మురళీమోహన్ భార్య సుమలత పరువుని కాపాడటానికి శోభన్ బాబు కష్టాల పాలవుతాడు . మురళీమోహన్ తండ్రి నూతన్ ప్రసాద్ వలన తండ్రిని పోగొట్టుకుంటుంది తులసి . ఆమె చంద్రమోహన్ ప్రేయసి అవుతుంది . ఇలా ఆరుగురు ఒకరికి ఒకరు మిత్రులుగానే కాకుండా వేర్వేరు అంశాలతో ముడిపడి ఉండేలా కధను నేయటమే ఈ సినిమా విజయానికి దోహదపడింది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వ్రాసిన పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు అనే బృంద నృత్యం చాలా బాగుంటుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది . మరో మంచి పాట అరవయ్యేళ్ళకు వసంతం అమ్మనాన్నకు కళ్యాణం . సత్యనారాయణ , అన్నపూర్ణల షష్టిపూర్తి పేరుతో సాగే పాట .
షష్టిపూర్తి పేరుతో ఈ సినిమాలో అన్నపూర్ణ మెడలో సత్యనారాయణ తాళి కట్టేస్తాడు . ముగ్గురు హీరోహీరోయిన్ల డ్యూయెట్లు కూడా చాలా బాగుంటాయి . దర్శకుడు రాజాచంద్ర అందంగా చిత్రీకరించారు .
ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ , అనిత , ప్రసాద్ బాబు , గిరిబాబు , ఆనంద మోహన్ , పి జె శర్మ , ఈశ్వరరావు ప్రభృతులు నటించారు . ఈ సినిమా శత దినోత్సవ వేడుకలు మద్రాసు విజయ శేష్ మహల్లో జరిగాయి . సినిమా యూట్యూబులో ఉంది . సరదాగా సాగే ఈ సినిమాను ఇంతకుముందు చూడనట్లయితే చూడండి . చూడబులే …
Share this Article