ఇది ఏ పంచాంగం..? సిద్ధాంతి ఎవరు..? ప్రచురణకర్త ఎవరు..? అనే ప్రశ్నలు అనవసరం… దిగువ ఓ ఫోటో చూడండి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఇప్పటికే పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు కస్టమర్ల అవసరాల మేరకు అభిజిత్ ముహూర్తాలు పెట్టేస్తున్నాం… వ్యవప్రయాసలకు గురిచేసే పెళ్లి తంతును కుదించడం చేతకాదు గానీ ఆ తంతును మరింత పెంచేస్తున్నాం… రకరకాల ఉత్తరాది ఆచారాలను కూడా నెత్తిన పెట్టుకుంటున్నాం… మాదేం పోయింది అనుకుని తెలుగు పంతుళ్లు కిమ్మనడం లేదు…
ఇదంతా సరే, కానీ ప్రతి కార్యక్రమానికీ మనం ముహూర్తం చూస్తాం… వర్జ్యం లేకుండా, దుర్ముహూర్తం లేకుండా, మంచి తిథిని చూసుకుంటాం… అది ప్రామాణికమైన పంచాంగమే చెబుతుంది… పార్టీల పంచాంగశ్రవణాలతో పంచాంగం విలువను పీకల్లోతుల్లోకి ఎప్పుడో పాతిపెట్టేశాం… ఇప్పుడిక సిజేరియన్లకు కూడా ముహూర్తాలు పెట్టేస్తున్నాం… రేప్పొద్దున అవసరాలను బట్టి మూఢాలకు సడలింపులు కూడా ఉంటాయేమో ఇక… అసలే పెళ్లిళ్లకు వివాహపొంతన పేరిట, గణాలు లెక్కించే పద్ధతి బాగా పాపులరైంది… 36కు 18 మార్కులు రాకపోతే పెద్దలు ససేమిరా అంటున్నారు, సంబంధాలు ఎంత మంచివైనా సరే…
శాస్త్రం సౌకర్యాన్ని ఇవ్వాలి… అనుసరించగల సౌలభ్యాన్ని ఇవ్వాలి… నిజమే, కానీ సర్దుబాట్లు, అశాస్త్రీయతలకు పెద్దపీట వేయకూడదు… చాలామంది ఈమధ్య సిజేరియన్లే ప్రిఫర్ చేస్తున్నారు… అది అసహజమైన ప్రసవం… సహజ ప్రసవం కాదు… కాకపోతే కాన్పు కష్టం రిస్క్ ఎందుకనే భావనతో సిజేరియన్ల వైపు ఎక్కువగా వెళ్తున్నారు… వేళ్ల మీద లెక్కించదగిన హాస్పిటళ్లు మాత్రమే సహజ ప్రసవాలు జరిగేలా ఎంకరేజ్ చేస్తున్నారు… కానీ తల్లిదండ్రులే సిజేరియన్లు కోరుకుంటుంటే వాళ్లేం చేయగలరు..?
Ads
ఈ సిజేరియన్ల మీద మోజుకు మరో కారణం ఉంది… మంచి ముహూర్తం, మంచి తిథి చూసి కడుపు కోసి, శిశువును బయటికి తీస్తే… అదే జనన సమయం… జనన తేదీ… మన గ్రహాచారాలు, జ్యోతిష్యాలకు ప్రధాన ఆధారం పుట్టిన తేదీ, పుట్టిన సమయం కాబట్టి… వాటి ఆధారంగానే జాతకాలు, గ్రహచార ఫలితాలు గణిస్తున్నారు కాబట్టి… చాలామంది వాటిని నమ్ముతారు కాబట్టి… మంచి తిథి, మంచి ఘడియల్లోనే ‘కత్తెర కాన్పులు’ జరిపించేస్తున్నారు…
నిజానికి ఒక మనిషి ఈ లోకంలోకి వస్తున్నాడంటే… తన జాతకం లిఖించుకునే వస్తాడు… ఆ జాతకాన్ని బట్టే తన పుట్టుక ముహూర్తం నిర్దేశింపబడి ఉంటుంది… ఆ పుట్టుక సమయం, తేదీని బట్టే పండితులు జాతకాల్ని, భవిష్యత్తును లెక్కిస్తారు… మరి ఓ శిశువు పుట్టే తిథిని, ఘడియల్ని మనమే నిర్దేశిస్తున్నామంటే బ్రహ్మ రాయాల్సిన రాతను మనం రాస్తున్నట్టా..? నిజంగా ఆ కత్తెర కాన్పుల సమయాల్ని బట్టి జాతకాల్ని లెక్కిస్తే, అవి శాస్త్రీయమేనా..? అసహజ ప్రసవ సమయాలు మనిషి గ్రహచార ఫలితాల్ని నిర్దేశిస్తాయా..? ఇదీ కొత్త మథనం…
‘‘ఎవరినైనా అడిగి మంచి తిథి, మంచి టైములో గనుక కాన్పు జరిపించుకుంటే… పుట్టే పిల్లాడు, లేదా పిల్ల జాతకం బాగుంటుందని ఇలా ముహూర్తపు సిజేరియన్లు చేయించుకోవడం ఎక్కువైంది… పుట్టే తేదీ, సమయాన్ని మనం డిసైడ్ చేస్తున్నాం సరే, కానీ మనిషి జాతకాన్ని డిసైడ్ చేసే చాలా అంశాలుంటాయి కదా… మంచి తిథిన పిల్లల పుట్టుకల్ని కోరుకునే మనుషుల నమ్మకాన్ని తప్పుపట్టలేం, అలాగని విధిరాతను తప్పించలేం…’’ అంటున్నాడు ధర్మపురికి చెందిన ఆన్‌లైన్ జ్యోతిష్యుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ…
మూల, ఆశ్లేష, జ్యేష్ట వంటి నక్షత్రాల్లో (శాంతి నక్షత్రాలు) పుట్టుక మంచిది కాదనే విశ్వాసం ఒకటి ప్రజల్లో ఉంది… అందుకని ఆ నక్షత్రాలు వచ్చే తిథిలు, ఘడియల్ని తప్పించి సిజేరియన్లు చేయించుకుంటున్నారు… నిజానికి ఆయా నక్షత్రాల్లో ప్రసిద్ధులు పుట్టారు… కానీ ఏదేమైనా మరీ సిజేరియన్ ముహూర్తాల్ని కూడా ముందే ఫిక్స్ చేసి మరీ పంచాంగంలోకి ఎక్కించడం ఎందుకో అసహజంగా, అసమంజసంగా తోస్తోంది…!! చివరగా :: మన తెలుగు పంచాంగాల లెక్కలు వేరు, దృక్ పంచాంగాల లెక్కలు వేరు… మరి ఈ పంచాంగంలోని ఈ కత్తెర ముహూర్తాలు ఏ లెక్కల ప్రకారమో…!! అన్నట్టు… ఈ సిజేరియన్ ముహూర్తాలకు కూడా డిస్‌క్లెయిమర్లు పబ్లిష్ చేశారు, ఎందుకైనా మంచిదని…!!
Share this Article