Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విముక్తిభవన్… ముముక్షుభవన్… కాశిలోని ఈ భవనాల కథ తెలుసా..?

November 29, 2024 by M S R

.

ముక్తిధామం… కాశీక్షేత్రం!

ఏ విహారయాత్రో, తీర్థయాత్రకో వెళ్లితే… ఎవరైనా, మంచి సౌకర్యాలున్న గదులెక్కడున్నాయో చూసుకుంటారు. అలాంటి అతిథి గృహాలో, లాడ్జింగ్సో, రిసార్ట్సో ఎంచుకుంటారు.

Ads

వెళ్లినచోట ఎంత అలసిసొలసి తిరిగొచ్చినా.. కాసింత సుఖం, సంతోషం, ఒక ప్రశాంత వాతావరణం కోసం ఆ సదుపాయం, ఆ ఏర్పాటు. కానీ, ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. జన్మవిముక్తిని కోరుకునే అతిథి గృహాన్నెంచుకుంటారా..? అసలలాంటి అతిథి గృహాలుంటాయా…? పునర్జన్మ ఉందొడ్డని కోరుకుంటూ మోక్షం కోసమంటూ విముక్తి కోరుతూ ఎంచుకునే అతిథిగృహాలకూ.. కాశీ ఓ మజిలీ!

ఏంటా కాశీమజిలీ కథ..?

ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి. ఆదర్శ కుటుంబాల పేరిట తల్లిదండ్రులు, ఎక్కువలో ఎక్కువ ఇద్దరు పిల్లలతోనే కుటుంబాలు కనిపిస్తున్న వేళ.. ఆర్థిక తారతమ్యాలు, కుటుంబ గొడవలతో.. ధనం మూలం ఇదం జగత్ గా మారిపోయింది.

పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం మనిషిని మనిషి తనకు తాను అంతర్లీనంగా తెలుసుకునే వికాసం కన్నా… విధ్వంసం వైపే అడుగులు వేయిస్తోంది. మరోవైపు ఎదిగిన కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోక వివిధ కారణాలను సాకులుగా చూపుతుండటంతో వృద్ధాశ్రమాలకూ గిరాకీ పెరిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికెవరు ఈలోకంలో అని ఓ సినీ కవి చెప్పిన వైరాగ్యభావన పరాకాష్ఠకు చేరినవారు.. ఇక తామెక్కువ రోజులు బతుకలేమనే ఒక నమ్మకానికొచ్చినవారు.. ఇదిగో కాశీలోని అస్సీ ఘాట్ మార్గం వైపు దారి కడుతున్నారు. పునర్జన్మ లేని విముక్తి కోసం.. కాశీ లాభ్ విముక్తి భవన్ కు… కాస్త, అంతకుముందు ముముక్షు భవన్ కు బాటసారులై తరలివెళ్లుతున్నారు.

ఇంతకీ ఏంటీ.. ఈ కాశీ లాభ్ విముక్తి భవనం, ముముక్షు భవనాల వైరాగ్య కథ..?

ఇక మేం తనువు చాలిస్తాం. ఈ లోకంలో మాకు మేం తప్ప ఇంకెవ్వరూ లేరు. అందులోనూ కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది… కాశీలో మరణ విముక్తితో మరుజన్మకు తావులేదనుకునేవాళ్లు క్యూ కట్టే ప్రదేశమే ఈ ముముక్షు భవన్.

ఇక ఈ శరీరాన్నే విడిచి వెళ్తామనుకునేవారికి… ఇంకా కులాలేంటి, మతాలేంటన్న సందేశం అంతర్లీనమై… వాటికతీతంగా ఎవరు వచ్చినా మరణానికి ముందు ఆదరించే శరణాలయమే మోక్షభవనంగా పిల్చుకునే ముముక్షు భవన్. అయితే, ఇక ఎవరి జీవితమైనా చివరి దశకు చేరుకుంటుంది..తనువు చాలించడమే తరువాయి అన్న సూచనలు కనిపిస్తే.. ముముక్షు భవన్ నుంచి కేవలం పది, పదిహేను రోజుల్లో దేహాన్ని విడిచి వెళ్తారనుకునేవారిని కాశీ లాభ్ ముక్తి భవన్ కు తరలిస్తారు.

1920లో కాశీలోని అస్సీ ఘాట్ వద్ద స్థాపించిన ఈ ముముక్షు భవన్ ను.. కాశీ ముముక్షు సభకు సంబంధించిన సభ్యులంతా కలిసి ప్రారంభించారు. ఈ ముముక్షు భవన్ ప్రాంగణంలోనే సంస్కృత కళాశాల, గురుకుల విద్యాలయం, గ్రంథాలయం వంటివున్నాయి. అలాగే, ఇక్కడికొచ్చేవారికి ఉచిత భోజనం, ఆయుర్వేద వైద్యమందించే ఏర్పాట్లూ చేసి పెట్టారు.

ఇక్కడ కనిపించేవారంతా రెక్కలు వచ్చిన పక్షుల నిరాదరణకు గురైన వృద్ధ తల్లిదండ్రుల జంటలే ఎక్కువ. ఇంటిపట్టున ఏ భావోద్వేగాలను, ప్రేమ, ఆప్యాయతనైతే కోల్పోయారో… అవేవీ మిస్ కాకుండా తమ చివరి మజిలీలో చూసుకోవడమే ఈ మోక్షభవన్ ప్రత్యేకత.

ప్రపంచంలో ఎవరైనా చనిపోతే సంతాపాలు, శ్రద్ధాంజలి ఘటించడం చూస్తాం. కానీ, అదే కాశీలో పోతే మాత్రం దాన్ని ఆశీర్వాదంగా భావించేవాళ్లే కొల్లలు. ఇది విశ్వాసాలతో కూడిన జీవన విధానం. అలాంటి పుణ్యభూమిగా చాలామంది వారణాసిని నమ్మబట్టే.. విశ్వనాథుడు కొలువైన చోట.. ఏకంగా ఆ నిటలేశ్వరుడు గజ్జె కట్టి ఆడే మణికర్ణిక శ్మశానానికి దరిదాపుల్లో ఈ ముముక్ష, ముక్త్ భవనాలను నిర్మించారు.

ముముక్ష భవన్ కు వచ్చేవారి నుంచి మినిమం ఫీజ్ తీసుకుంటారు. అయితే, ఎందరో క్యూ కట్టినా కాస్త వాళ్ల స్థితిగతులు, అంతకుముందు వారి జీవిన పరిస్థితులు ఇవన్నీ పరిశీలించి అర్హులనుకున్నవారినీ, అవసరార్థులను మాత్రమే చేర్చుకుంటారు.

ఎవరైనా ఆర్థికంగా లేనివారు వచ్చినా వారి పరిస్థితి బట్టి చేర్చుకునే ఉదారతా ఈ మోక్షభవన్ లో లభిస్తుంది. ఇక్కడ వారి అన్నపానీయాలకు కావల్సిన ఏర్పాట్లతో పాటు.. కాలకృత్యాలకు, స్నానాదులకు కావల్సిన ఏర్పాట్లుంటాయి.

బంగ్లాదేశ్ కు చెందిన కమలా చక్రవర్తి గతంలో ఏమన్నారంటే… ముముక్ష భవన్ లో నన్ను ఇక్కడ వారు చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టేలా.. పునర్జన్మ లేకుండా నాకు విముక్తి ప్రసాదించారని ఆ విశ్వనాథుణ్ని కోరుకుంటానన్నారు.

ఇలా బంగ్లాదేశీ అయిన 97 ఏళ్ల వితంతువు కమలా చక్రవర్తిలాగే.. ఇక్కడ కుల, మత, జాతి, ప్రాంత, దేశాలకతీతంగా భిన్నరకాల సమ్మేళంతో ఈ విముక్తి భవనాలు కనిపిస్తాయి. ముముక్షు భవన్ లో 60 ఏళ్లకు పైబడ్డవాళ్లు కనిపిస్తే… ఇక రేపో, మాపో పోతామనుకునేవారు.. 80 ఏళ్లకు పైబడ్డవారు ముక్త్ భవన్ లో దర్శనమిస్తారు.

కాశీ అంటేనే కథల సంపుటి. ఒకవైపు అద్వైతసిద్ధి కోసం జరిగే ప్రయత్నాలు.. ఇంకోవైపు బతుకు పోరాటపు దృశ్యాలు భిన్నమైన కోణాలను మన కళ్లకు కడుతూనే ఉంటాయి. అప్పుడే గంగలో స్నానాదికాలు ముగించుకుని సంధ్యావందనాలు చేసుకుని మడి, ఆచారాలతో మంత్రాలు చదువుతూ ఘాట్ మెట్లెక్కి వచ్చే బ్రాహ్మణులొకవైపు కనిపిస్తుంటే.. వారి పక్కనుంచే ఒకటి తర్వాత మరొకటి మణికర్ణిక ఘాట్ కు ఈ లోకాన్ని విడిచిపోయే శవాలు దహనసంస్కారం కోసం బయల్దేరుతాయి.

అనాథలైనవారెందరో శ్మశాన వాటికల్లో ఆడ, మగ లింగభేదం లేకుండా కనిపించే కాటికాపర్లు.. వారితో వ్యాపారాన్ని నడిపించే దళారీలు.. ఇలా మొత్తంగా మోక్షానికి నెలవని నమ్మే చోటా అబ్బురపర్చేలా మోసాలూ అణువణువునా తారసపడే ఓ భిన్న ప్రదేశం కాశీ.

మోక్షభవన్ నుంచి ముక్తిభవనంలోకి ఎంట్రీని ఎలా నిర్ణయించేది..?

ఇక పదిహేను రోజుల్లోపు చనిపోతారనుకునేవారే ముక్త్ భవన్ లోకి తీసుకెళ్లబడతారు. అందుకోసం మాత్రమే ఈ ధర్మశాల సంరక్షణ అని ఇక్కడివారు చెప్పే మాట. 1920లో మోక్షభవనం ప్రారంభమైతే… 1958లో శ్రీ విష్ణు హరి దాల్మియా మరణ విముక్తి కోసం కాశీకి వచ్చేవారికోసం ఈ లాభ్ ముక్త్ భవన్ ఏర్పాటు చేశారు.

ఏడాదికి సుమారు 250 మందికి పైగా ఈ లాభ్ ముక్త్ భవన్ బాట పడతారు. ఎందుకంటే, ఇది కేవలం ముక్తి పొందే మణికర్ణిక ఘాట్ కు అరకిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది.

అయితే, వేలల్లో, వందల్లో ఒక్కరికి మాత్రమే ఆ ముక్తి లభించే అవకాశముందంటారు ఇక్కడ పనిచేసే మేనేజర్స్. వేల మంది ఈ ముక్త్ భవన్ నుంచి మణికర్ణిక ఘాట్ కు వెళ్లే క్రమంలో వారి ఆత్మకు శాంతి కల్గాలని తాము చేయాల్సిన క్రియలన్నీ శాస్త్రయుక్తంగా చేస్తామంటారు ఇక్కడి ముక్త్ భవన్ సిబ్బంది.

గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ శుక్లా ఏమంటారంటే… తన అనుభవంలో సుమారు 15 వేల మంది ఈ ముక్త్ భవన్ లో విముక్తి పొందారని.. అయితే, వారు భవబంధాలను త్యజించినవారైనప్పుడే వారు పునర్జన్మ నుంచీ విముక్తి పొందే అవకాశముందని.. అలాంటివారు అరుదేనన్నది శుక్లా మాట.

ఆయన చెప్పిన కొన్ని ఉదాహరణల్లో ఓ కథ మానవ జీవితంలో కోల్పోతున్న దాన్ని పట్టి చూపేది. రామ్ సాగర్ మిశ్రా అనే సంస్కృత పండితుడుండేవాడు. సోదరులలో పెద్దవాడైన మిశ్రాకు, అత్యంత సాన్నిహిత్యమున్న తన తమ్ముడితో కుటుంబ కలహాలు చెలరేగాయి. దాంతో ఎప్పుడూ కలిసుండే వారిద్దరి కుటుంబాలూ వేరుపడ్డాయి.

తన చివరి రోజుల్లో మిశ్రా కూడా కాశీలోని ముక్తి భవన్ కు మరో పదిహేను రోజుల్లో చనిపోతానన్న ఒక కచ్చితత్వంతో వచ్చారు. ఇక రేపో, మాపో తను దేహాన్ని విడుస్తున్నాననుకుంటున్న తరుణంలో 40 ఏళ్ల నుంచి కుటుంబ కలహాలతో తన సోదరుడిని కలవలేకపోయిన మిశ్రాలో ఏదో అపరాధ భావన వెంటాడింది.

తన చివరి కోరికగా.. ముక్తి భవన్ పెద్దలకు తన తమ్ముడికి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేమని విజ్ఞప్తి చేశాడు. వెళ్లే ముందు అన్ని వివాదాలను పరిష్కరించుకు వెళ్లాలనేదే మిశ్రా అంతర్గత మనస్సు చెప్పే మాట. మిశ్రా కోరిక మేరకు తమ్ముడికి ముక్తిభవన్ నుంచి లేఖ వెళ్లింది.

అన్న ఆ పరిస్థితిలో ఉన్నాడని తెలిసిన తోడబుట్టిన తమ్ముడూ హుటాహుటీన కాశీ బాట పట్టాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడు మిశ్రా ఇంట్లో పెట్టిన విభజన గోడను కూల్చేయాలని.. అలాగే, మనసుల్లో ఉన్న విభనలనూ తొలగించాలని ఆ తమ్ముణ్ని కోరాడు.

ఆ మాట విన్న తమ్ముడు సరే అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కలవటం వల్ల వచ్చే ఆనందభాష్పాలొకవైపు.. అన్న దూరమై పోతున్నాడన్న బాధ తమ్ముడిలో ఇంకోవైపు ఇదిగో అలాంటి ఎన్నో దృశ్యాలను తాను కాశీ ముక్తి భవన్ లో చూశానంటారు నాటి మేనేజర్ శుక్లా.

లాభ్ ముక్త్ భవన్ స్కాంధ పురాణంలో చెప్పినట్టుగా కాశ్యం మరణం ముక్తి: అనే సామెత ప్రకారం జననం లేని మరణం కోసమే ఎదురుచూస్తుంటుందట.

అయితే, ఉపనిషత్తులు మాత్రం జ్ఞానం లేనిదే ముక్తి సాధ్యం కాదంటాయి. అలా అని విజ్ఞానవంతులు నల్గురు కలిసి కాశీలో ఓచోట పోగై సమావేశమైనంత మాత్రాన ఆ జ్ఞానం వస్తుందనీ కాదు. ముందు ఆ కాశీ విశ్వేశ్వరుణ్ని నమ్మాలంటారు ఇక్కడి పండితులు. మరణంతో మణికర్ణిక ఘాట్ లోకి ప్రవేశించి అంత్యక్రియలనంతరం ఆ పరమేశ్వరుడు వారిని దరికి తీసుకుని చెవిలో చెప్పే తారక మంత్రాన్ని విశ్వసించాలంటారు.

ఆ తారకమంత్రమే.. ” రంగ రామాయ నమ:”. అంటే మన అంత్యక్రియల సమయంలో మనం కాలి బూడిదైపోతున్నప్పుడు ఆ అగ్నిలో ఉన్న సాక్షాత్తూ శ్రీరామచంద్రుడికి… మన అంతర్మాతలో కొలువైన ఆ తారకరాముడికి నమస్కరించడం వల్ల మాత్రమే… భవబంధాలను త్యజించి ఆ తారకమంత్ర జపం చేయడం వల్ల మాత్రమే.. విముక్తి లేని మరణం సాధ్యమంటూ ఇక్కడి పండితులు చెప్పే మాట!

వరుణ, అసి నదుల సంగమాన జరిగే తంతు, నమ్మకాలు, విశ్వాసాలపై ఎవరి అభిప్రాయాలు వారివైనప్పటికీ.. ఆ విశ్వనాథుడు కొలువై, నిత్యకాష్ఠానికి నెలవైన ఈ మహాశ్మశానాన.. మరోవైపు సాయంసంథ్య వేళ గంగాహారతితో చూడముచ్చటైన దృశ్యానికి వేదికగా.. ఆసక్తకర అంశాలెన్నింటికో కాశీ ఓ భిన్నమైన క్షేత్రం! జీవితంలో ఒక్కసారైనా నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు, భిన్నజాతులు ఓపెన్ మైండ్ సెట్ తో ఓసారి సందర్శించాల్సిన చర్చనీయాంశ ధామం కాశీ!         ( రచన :: రమణ కొంటికర్ల )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions