Prasen Bellamkonda…… విలన్….హీరో అనేవి పర్యాయపదాలా… కావు. కానీ కొన్ని సందర్భాలలో అవును. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ను అందరూ పొగుడుతుంటే చూసా. చిరాకేసింది. అతను మంచి నటుడే. కానీ మంచి నటన మంచి సినిమా అనిపించుకోదు.
విలువలు ఇలా దిగజారడాన్ని మనం అంగీకారిస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. విలన్ చేయాల్సిన పనులన్నీ హీరో చేస్తే కూడా హీరోయేనా. కొన్ని తప్పుడు పనులను లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో చేసేవాళ్ళను విపరీతంగా ఆరాధించే మనుషులు మనకు తెలుసు. రెండు వేల కోట్లు షేర్ మార్కెట్లో గల్లంతయినప్పుడు హర్షద్ మెహతాను చాలా మంది విపరీతంగా ఆరాధించారు. ఇదొక్కటే కాదు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో ఎందుకున్నాయంటే మన విలువల గ్రాఫ్ పాతాళం కంటే కిందకు పడిపోవడం వల్ల.
మోసం చెయ్యడం అనైతికం కాదనీ, అది ఎంత నైపుణ్యంతో చేస్తే అంత ప్రేమార్హంగా మోహించే ఉన్మత్తతలోకి సమాజం దూకేసినట్టుంది. ఇప్పుడు పుష్ప లాంటి స్మగ్లర్ ని గ్లోరిఫై చేసే విలన్ హీరో సినిమాలు పాన్ ఇండియా సెన్సేషన్ అయేది కూడా దేశమంతా ఒకే తరహా ప్రేక్షకుడున్నాడని చెప్పేందుకే.
Ads
వృత్తిలో విఫలమైన ఓ లాయర్ తొక్కే అడ్డదారులే ఈ మలయాళ సినిమా కథ. చిన్న చిన్న మోసాలు పెద్ద పెద్ద ద్రోహాలు, ఇంకా బడా హత్యలు అన్నీ చేసేసి అదే జీవితానికి ఆర్ధిక మోక్ష మార్గం అని చాటిచెప్పే సినిమా.
విలన్లే హీరోలైన సినిమాలు మనకు చాలా ఉన్నాయి. అమితాబ్ డాన్. కమల్ ఎర్ర గులాబీలు. షారుఖ్ బాజీగర్ లాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. అయితే ఆ పాత్రలకు తమదైన ఒక వాదన ఉంటుంది. తమ తప్పుడు లేదా హింసాత్మక, కృూరాత్మక చేష్టలను సమర్థించుకుంటూ ప్రేక్షకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాయి. లేదూ రియలైజ్ అవుతాయి చివరికి.
(arsha baiju)
ముకుందన్లో ఏదీలేదు. ఈ ముకుందన్ కేవలం తను జీవితంలో ఆర్ధికంగా ఎదగడం కోసం యాక్సిడెంట్ ఇన్స్యురెన్స్ క్లయింలలో నానా గడ్డీ కరుస్తాడు. పద్దతిగా ఉండే ఒక ప్రియురాలితో బ్రేకప్ చేసుకుంటాడు. ఒక కాంట్రాక్ట్ కోసం ఇంకో ప్రియురాలిని ప్రేమించడం మానేసే బేరం పెడతాడు. ఇంకా చాలా చాలా నైచ్యాలకు పాల్పడతాడు. అతను అలా అలా కరిచిన డబ్బుతో కోటీశ్వరుడు కావడమే ఈ కథలో నీతి.
ఇన్స్యురెన్స్ యాక్సిడెంట్ క్లయింల రంగంలో బోలెడంత అవినీతి ఉన్న మాట నిజం. అదంతా వివరిస్తూనే ఆ రంగాన్ని సరిచేసే ప్రయత్నం హీరో చేసినట్టు చెపితే బాగుండేదేమో. పుష్ప, ఇప్పుడీ ముకుందన్ లాంటి కొన్ని సినిమాలు విలన్ ని హీరోకి పర్యాయ పదంగా మార్చేయడం కేవలం మన విలువల కొలతలలో మనం చేసుకున్న మార్పులే. సినిమా అందరూ బాగుందంటున్నారు. కానీ కాదేమో…
Share this Article